Kavitha | ‘కాంగ్రెస్ చేస్తోంది తెలంగాణ సంస్కృతిపై దాడే’
x

Kavitha | ‘కాంగ్రెస్ చేస్తోంది తెలంగాణ సంస్కృతిపై దాడే’

తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. కొత్త విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తున్నట్లు తీర్మానించారు.


తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ రూపురేఖలను మార్చడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ సంస్కృతిపై దాడేనని అన్నారు. తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండింయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజల భావోద్వేగాల, పోరాట పటిమల ప్రతిరూపమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ గృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ఈ అంశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కేవలం గత ప్రభుత్వ ఛాయలను, కేసీఆర్ ఆనవాళ్లను తొలగించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో పలు మార్పులు చేసిందని ఆరోపించారు. తెలంగాణ తల్లి బీద స్త్రీ ఎందుకు కావాలో సీఎం చెప్పగలరా? అని ప్రశ్నించారు. అంటే తెలంగాణ స్త్రీ మూర్తులు బీదవారన్నదే కాంగ్రెస్, సీఎం రేవంత్‌ల భావన అంటూ విమర్శలు వెల్లువెత్తించారు. తన జీవితంలో ఒక్కసారైన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? జై తెలంగాణ నినాదం చేశారా? అని ప్రశ్నించారు. అసుమంటి వ్యక్తి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అంటూ మండిపడ్డారు.

ప్రేమ లేకనే మార్పులు..

‘‘తెలంగాణ తల్లి అంటే రేవంత్ రెడ్డికి రవ్వంత కూడా ప్రేమ లేదు. అందుకే తల్లి విగ్రహంలో మార్పులు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోతే సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుంది? నేను ఉద్యమకాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాను. ఒక చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవాన్ని చాటేలా పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు విడుదల చేస్తాం’’ అని కవిత తెలిపారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బతుకమ్మ అగ్రవర్ణాల పండగ అన్న వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగానే నామకరణం చేస్తున్నాం. ఈ మేరకు తీర్పానం చేస్తున్నాం’’ అని వివరించారు.


అందుకే మార్చాం: రేవంత్

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి దొరసానిలా ఉందని, కానీ తమ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి.. సాధారణ తెలంగాణ మహిళను ప్రతిబింబిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుసార్లు వివరించారు. డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అసెంబ్లీలో తెలంగాణ తల్లిపై జరిగిన చర్చలో కూడా రేవంత్ రెడ్డి కీలక విషయాలు పంచుకున్నారు. ‘‘మా ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన భావన కలుగుతుంది. ఈ విగ్రహం ద్వారా తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు ఇస్తున్నాం. గడిచిన పదేల్లు తెలంగాణకు రాష్ట్ర గీతం లేకుండా పోయింది. ప్రజా ప్రభుత్వ ఏర్పడిన వెంటనే ఉద్యమం సమయంలో పౌరులను ముందుకు నడిపిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తించాం. తెలంగాణను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి ఉండాలనే ఆ తల్లికి గుర్తింపు ఇస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు...ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టవకరం. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం’’ అని పునరుద్ఘాటించారు.

Read More
Next Story