అసదుద్దీన్ మీద కాంగ్రెస్ పోటీ పెడుతుందా లేదా?
x
Source: Twitter

అసదుద్దీన్ మీద కాంగ్రెస్ పోటీ పెడుతుందా లేదా?

కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందా? అనే అంశంపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలన్నింటినీ కాంగ్రస్ నేత ఫిరోజ్ ఖాన్ పూసగుచ్చినట్లు వివరించారు.


(గోపిరెడ్డి సంపత్ కుమార్)

హైదరాబాద్ బరి నుంచి కాంగ్రెస్ తప్పుకున్నట్లేనా.. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల ప్లానేంటి... ఇద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఏంటి… ఓటమి తప్పదని అసద్.. కాంగ్రెస్ శరణు కోరాడా... లేదా ప్రభుత్వం పడిపోతుందనుకొని రేవంత్, అసద్‌తో అలాయ్ భలాయ్ తీసుకున్నాడా... ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పడమే కాదు అందులో దాగున్న గుట్టువిప్పి మరీ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ప్రాణహాని ఉందని సెన్సేషనల్ కామెంట్ చేశారు. అసలు ఏం జరిగింది... ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన రహస్య ఒప్పందంపై ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం.

అధికారంలో ఎవరు ఉంటే.. వారితో దోస్తానా చేసే పార్టీ ఎంఐఎం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణ వచ్చాక రెండు సార్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా, ఆ పార్టీకి అసోసియేట్‌గా కొనసాగుతూ వచ్చింది. తమ పనుల చేసుకునేందుకు, పాత బస్తీలో జరిగే కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు అడుగు పెట్టకుండా ఉండేందుకు ఎంఐఎం ఇలా చేస్తుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అసదుద్దీన్.. ఇప్పుడు హస్తంతో దోస్తీకి సై అన్నారు. పాత దోస్తు కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పేశారు. ఇక బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కూడా సుస్థిరత కోసం ఎంఐఎంతో దోస్తీకి పచ్చ జెండా ఊపింది. ఇందులో ఇద్దరి స్వార్థం కూడా కనిపిస్తున్నదని చెప్పవచ్చు.

తెరవెనుక జరిగిందేంటి..

ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసద్‌ను ఢీకొట్టేందుకు బలమైన ముస్లింనే బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రచారం జరిగింది. ఇప్పటికే బీజేపీ మాధవీలతకు టికెట్‌ ఇచ్చింది. ఆమె పాతబస్తీకి చెందిన నేత కావడంతో ఎంఐఎం అధినేతలో టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థిని నిలిపితే తన ఓటు బ్యాంకు దెబ్బతినడంతో పాటు బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయకుండా చాలా రోజులుగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో అసద్‌ కోరిక మేరకు ఎంఐఎంపై పోటీ చేయకూడాదని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అసద్‌కు మద్దతు ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు హస్తం నేతలు తెలిపారు. మరోవైపు తనపై తెరవెనుక కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల కొడంగల్ లో బాహాటంగానే వ్యాఖ్యానించారు. దీంతో ఎంఐఎం దోస్తానా కోరుతుండటంతో వారికున్న 7 స్థానాలు కలిసి వస్తే తనకు తిరుగువుండదని రేవంత్ భావించి స్నేహాస్తం అందించి వుండవచ్చు.

లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంపై ఇంకా ఎటూ తేల్చడం లేదు. అసద్‌ విన్నపం మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయూడదని నిర్ణయించినట్లు తెలిసింది. మొదట ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఫిరోజ్‌ఖాన్‌ను బరిలో దించాలని భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌ ఓడిపోయారు. దీంతో హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీకి సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య డీల్‌ కుదరడంతో ఫిరోజ్‌ఖాన్‌ ఇక పోటీ చేసే అవకాశం లేనట్లే అని తెలుస్తోంది.

ఎంఐఎం కంచుకోటగా..

హైదరాబాద్‌ ఎంపీ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. 1989 నుంచి 2019 వరకు ఇక్కడ ఎంఐఎం వరుసగా గెలిచింది. అంతకుముందు అసద్‌ తండ్రి సలావుద్దీన్‌ ఒవైసీ గెలవగా, ఇప్పుడు అసదుద్దీన్‌ విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలో 35 ఏళ్ల మజ్లిస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకు ఇక్కడి నుంచి పాత బస్తీకే చెందిన విరించి ఆస్పత్రుల చైర్‌పర్సన్‌ మాధవీలతను బరిలో దించింది. ఇప్పటికే పాత బస్తీలో అసద్‌ కుటుంబంపై, ఎంఐఎంపై వ్యతిరేకత పెరిగింది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ కూడా అభ్యర్థిని నిలిపితే అది బీజేపీకే లాభం జరుగుతుందని ఎంఐఎం అధినేత భావించారు. దీంతో మజ్లిస్‌ ఆధిపత్యానికి చెక్‌ పడుతుందని గుర్తించి.. కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పి.. హస్తంతో నేస్తానికి సై అన్నారు.

బీజేపీకి చెక్‌ పెట్టాలని..

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి హైదరాబాద్‌లో బాగా పుంజుకుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఓట్లకు గండి పడడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే అసద్‌ పాత బస్తీలో కాషాయ జెండా ఎగరకుండా కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేయాలన్న ప్రతిపాదనను రేవంత్‌రెడ్డి ముందు ఉంచారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు బీజేపీని ఓడించేందుకు అసద్‌ ప్రతిపాదనకు రేవంత్‌ ఓకే చెప్పారని సమాచారం.

Read More
Next Story