బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ది మైండ్ గేమేనా ?
x
Revanth and KCR

బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ది మైండ్ గేమేనా ?

రుణమాఫీ పథకంలో నిధుల జమ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలాగ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు పార్టీ శ్రేణులకు ఆదేశించారు.


బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. గురువారం సాయంత్రం 4 గంటలకు రైతు రుణమాఫీ మొదటి విడత నిధులు జమచేస్తున్న విషయం తెలిసిందే. రుణమాఫీ పథకంలో నిధుల జమ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలాగ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు పార్టీ శ్రేణులకు ఆదేశించారు. దాంతో గ్రామగ్రామాన ప్రభుత్వం, పార్టీ యంత్రాంగాలు కలిసి వేదికలను ఏర్పాటుచేశాయి. సచివాలయంలోని ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆపీసులో సాయంత్రం 4 గంటలకు రేవంత్ బటన్ నొక్కగానే సుమారు రు. 7 వేల కోట్లు 11.50 లక్షల రైతుల ఖాతాల్లో జమవుతాయి. ఇందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో నిధులను జమచేసేసింది.

రేవంత్ బటన్ నొక్కగానే గ్రామస్ధాయి, మండల, జిల్లా స్ధాయిల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, పార్టీ సీనియర్ నేతలు వేదికలమీద ప్రత్యక్షంగా రైతులకు చెక్కులను అందించనున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఆరు పథకాల్లో నాలుగింటిని అమల్లోకి తెచ్చింది. అయితే వాటి అమలు విషయంలో ఇపుడు చేస్తున్నంత హడావుడి అప్పుడు చేయలేదు. కేవలం రైతురుణమాఫీ విషయంలో మాత్రమే రాష్ట్రమంతా పెద్ద పండుగలాగ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ ఆదేశించారు. ఇదంతా ఎందుకంటే బీఆర్ఎస్ పై మైండ్ గేమ్ ఆడుతున్నట్లే అనిపిస్తోంది. పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో కూడా రుణభరోసా పేరుతో కార్యక్రమాలు జరిగినా అర్హులు, అనర్హులు అని కాకుండా రాజకీయ పలుకుబడి కలిగిన వారందరు లబ్దిపొందారు. ఒకరకంగా చెప్పాలంటే అర్హులకన్నా అనర్హులకే బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ లాభం జరిగింది.

దాంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. ఈ విషయం తెలిసినా సరే కేసీయార్ పట్టించుకోకుండా తన రాజకీయ లబ్దికోసమే పథకంలో అందరినీ కవర్ చేశారు. సరే, చివరకు అంత చేసినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమైతే తప్పలేదు. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల సమస్య మొదలవ్వటంతో పథకం అమలు అచ్చంగా అర్హులకు మాత్రమే వర్తింపచేయాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే చాలామంది అనర్హులను ఏరేసింది. ఈ విషయాలన్నింటినీ గ్రామాల్లో కార్యక్రమాలు జరిగే వేదికల మీద మంత్రులు, ఎంఎల్ఏ తదితర ప్రజా ప్రతినిదులు వివరించాలని రేవంత్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, వాటిల్లో లబ్దిపొందుతున్న లబ్దిదారుల వివరాలను జనాలందరికీ వివరించాలని రేవంత్ ఆదేశించారు.

ఇదంతా రేవంత్ ఎందుకు చేయిస్తున్నారంటే తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ రీచ్ కాలేదన్న విషయం తెలిసిందే. మొత్తం 17 సీట్లలో 14 నియోజకవర్గాలను గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంటే గెలిచింది 8 సీట్లలో మాత్రమే. అంటే టార్గెట్ కు 6 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. కారణాలు ఏవైనా బీజేపీ అనూహ్యంగా బలపడుతోందన్న విషయం అర్ధమవుతోంది. కాబట్టి తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో విజయదుందిభి మోగించాలంటే గ్రామగ్రామాన పార్టీకి పట్టు పెరగాల్సిందే. అప్పుడు కాని ఒకే దెబ్బకు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీని దెబ్బకొట్టడం కాంగ్రెస్ కు సాధ్యంకాదు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలోపెట్టుకునే బీఆర్ఎస్, బీజేపీపైన ఆధిక్యం సాధించేందుకు రేవంత్ మైండ్ గేమ్ కు తెరలేపినట్లు అర్ధమవుతోంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసిందన్న ఇమేజీని పార్టీతో పాటు ప్రభుత్వానికి వస్తే ఆటోమేటిగ్గా స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ లాభపడుతుందని రేవంత్ అనుకుంటున్నారు. పదేళ్ళ పాలనలో కేసీయార్ నాయకత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగం, లబ్దిపొందిన అనర్హుల వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం జనాలందరికీ గుర్తుచేయబోతోంది. జనాలందరికీ గుర్తుచేయాలంటే రుణమాఫీ కార్యక్రమాన్ని పండుగలా గ్రామగ్రామాన నిర్వహించటం ఒకటే మార్గం. అందుకనే రుణమాఫీ కార్యక్రమంతోనే రేవంత్ బీఆర్ఎస్ పై మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లున్నారు. మరిదెంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

Read More
Next Story