
కేటీఆర్‌పై ముగ్గురు మంత్రుల ముప్పేట దాడి..
కాంగ్రెస్ ఎలాంటి పార్టీలో కేసీఆర్‌ను అడిగితే చెప్తారన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రులు ముగ్గురు ముప్పేట దాడి చేస్తున్నారు. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అతని అహంకారానికి నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రంలోని యూరియా కష్టాలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ వైఖరి వంటి అంశాలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్బంగానే కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌పై విమర్వలు చేశారు. కాంగ్రెస్ అంటే థర్డ్ క్లాస్ పార్టీ, డర్టీ పార్టీ అని, సీఎం రేవంత్ కూడా థర్డ్‌క్లాస్ సీఎం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటలను కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గొప్పతనం కేటీఆర్‌కు తెలియదన్నారు. సోనియా గాంధీ.. తెలంగాణ వచ్చినప్పుడు నువ్వు, నీ కుటుంబంతా కలిసి ఆమెతో గ్రూప్ ఫొటో దిగిన విషయం మర్చిపోయావా? అంటూ ప్రశ్నించారు.
మిమ్మల్ని ప్రజలు క్షమించరు: కోమటిరెడ్డి
కాంగ్రెస్‌పై అనవసర విమర్శలు చేయడం కేటీఆర్‌కు తగదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. “తెలంగాణ ఇచ్చిన పార్టీ మీకు థర్డ్ గ్రేడ్ పార్టీయా? కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే కేసీఆర్‌ను అడగాలి. ఎందుకంటే ఆయనే కాంగ్రెస్‌తో కలిసి ఉద్యమం చేశారు. మీ కుటుంబం సోనియాగాంధీతో ఫొటోలు దిగిన విషయం మర్చిపోయారా? తెలంగాణ బిడ్డ ఉపరాష్ట్రపతిగా కావడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదా? యూరియా సమస్యపై కేటీఆర్ అజ్ఞానం ప్రదర్శిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన సబ్సిడీలు, సరఫరాలపై వాస్తవాలు తెలియకే విమర్శలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు. త్వరలోనే కేటీఆర్ అవినీతి బయటపడుతుంది. ప్రజలే బీఆర్‌ఎస్‌కు శిక్ష వేస్తారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
థర్డ్ గ్రేడ్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలి: పొన్నం
‘‘థర్డ్ గ్రేడ్ అంటే కేటీఆర్ చేసిన అవినీతా? ఆయన అహంకారమా? థర్డ్‌గ్రేడ్ అంటే ప్రభుత్వమా? ముఖ్యమంత్రా? కేటీఆర్‌ది డర్టీ మైండ్. ఆయన ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు.ఇంట్లో పంచాయితీ తట్టుకోలేకే కేటీఆర్ పిచ్చిపిచ్చ మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బండారం సెప్టెంబర్ 9న బయటపడుతుంది. బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా ఉందా లేదా? అనేది ఆ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డుకు మద్దతుగా నిలబడతావా? లేదా? రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కృత్రిమ డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఎవరిస్తే వారికే మద్దతు అంటే దాని అర్తం ఏంటి? బీఆర్ఎస్ మద్దతు బీజేపీకే అని కేటీఆర్ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది’’ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
కవిత ఆరోపణలకు కేటీఆర్ బదులివ్వాలి: సీతక్క
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కూడా మండిపడ్డారు.కేటీఆర్‌ను సొంత చెల్లెలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కవితతో కొనసాగుతున్న లొల్లితో కేటీఆర్ మైండ్ ఖరాబ్ అయిందని చురకలంటించారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ రాజకీయం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెలికాప్టర్ వేసుకుని థర్డ్ ఫ్రండ్ అని తిరిగారు. కేటీఆర్ దృష్టిలో ఫస్ట్ గ్రేడ్ అంటే ఏంటో? థర్డ్ గ్రేడ్ ఏంటో చెప్పాలి. కవిత చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కేటీఆర్ ముందు సమాధానం చెప్పాలి’’ అని సీతక్క ఎద్దేవా చేశారు.
అసలు కేటీఆర్ ఏమన్నారంటే..
ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి అన్న అంశంపై కేటీఆర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి పెట్టిన అభ్యర్థి అయితే కచ్ఛితంగా ఆయనను మేము వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ అనేది ఒక చిల్లర పార్టీ. ఇవాళ రాష్ట్ర ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలుసు. అలాంటి థర్డ్ క్లాస్ పార్టీ, థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని మేము ఎందుకు సమర్థిస్తాం. ఇదంతా కూడా ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికపై జరుగుతున్నదంతా ఒక డ్రామా. బీసీల విషయంలో మా పార్టీ చిత్తశుద్ధితో ఉందని రేవంత్ చెప్పడమే తప్ప.. ఆ చిత్తశుద్ధి ఆయనకు లేదు. నిజంగానే ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు ఆయన సిఫార్సు చేయలేదు? తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదా? కంచె ఐలయ్యను పెట్టొచ్చు కదా? అంటే బీసీలపై ప్రేమ మాటలకే పరిమితం. ఎన్నికలు వస్తే మీకు మళ్ళీ బీసీలు కనిపించరు. అలాంటి మీ మాటలు మేము నమ్మాలా?’’ అని విమర్శలు గుప్పించారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.