చిన్నారిపై హత్యాచారం.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేరస్తుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఓ రైస్ మిల్లులో నిసరిస్తున్న ఆరేళ్ళ చిన్నారి అత్యాచారానికి, హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పయించాయి. రాష్ట్రంలో భద్రత కరువైందంటూ బీఆర్ఎస్ వర్గాలు అధికార పార్టీని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఆదివారం మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్ రేప్ కి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేరస్తుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరలోనే కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ సింగ్ ఠాకూర్ లతో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు పురోగతి వివరాలను తెలుసుకున్నారు.
డ్రగ్స్, గంజాయి మత్తులో ఘాతుకాలు...
డ్రగ్స్, గంజాయి మత్తులోనే ఇలాంటి ఘాతుకాలు జరుగున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి.. పడుకున్న పాపను ఎత్తుకపోయి రేప్ చేసి చంపడం కలచి వేసిందన్నారు. హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో గతంలో చిన్నారిని రేప్ చేసి చంపేసిన ఘటనకూ గంజాయి, మత్తు పదార్దాలే కారణమన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పిల్లలను ఎలా కాపాడుకోవాలనే బాధ కలుగుతుందన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాల కారణంగా దుర్మార్గాలు పెరుగుతున్నాయన్నారు. అందుకే తెలంగాణలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పని ప్రదేశాల్లో, నివాస ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం...
మంత్రులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరుపున రెండున్నర లక్షల రూపాయాల చెక్కును అందచేసారు. మిల్లు యాజమాన్యం నుంచి రూ. ఐదు లక్షల పరిహారాన్ని ఇప్పించారు. ఆసిఫాబాద్, పెద్దపల్లి కలెక్టర్లతో మాట్లాడి బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.