
ఏడ్చినంత పనిచేసిన కాంగ్రెస్ ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి
ప్రచారం సమయంలో కాంగ్రెస్ మద్దతుదారుడినే గెలిపిస్తామని హామీ ఇచ్చిన గ్రామస్ధులు పోలింగ్ రోజున మాత్రం బీజేపీ బలపరిచిన రేవతిని గెలిపించారు
జడ్చర్ల కాంగ్రెస్ ఎంఎల్ఏ జానంపల్లి అనిరుధ్ రెడ్డి ఏడ్చినంత పనిచేశారు. రెండోవిడత పంచాయితీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని సొంత ఊరు రంగారెడ్డిగూడ పంచాయితీ ఎన్నికలో బీజేపీ మద్దతుతో కాకిపాటి రేవతి 31 ఓట్లతో గెలిచింది. తనమద్దతుదారుడిని సర్పంచ్ గా గెలిపించుకోవాలని ఎంఎల్ఏ పంచాయితీలో ఒకటికి రెండుసార్లు ప్రచారంచేశాడు. ఎంఎల్ఏ ప్రచారం సమయంలో కాంగ్రెస్ మద్దతుదారుడినే గెలిపిస్తామని హామీ ఇచ్చిన గ్రామస్ధులు పోలింగ్ రోజున మాత్రం బీజేపీ బలపరిచిన రేవతినే గెలిపించారు. అదే విషయమై సోమవారం రంగారెడ్డిగూడలో పర్యటించిన ఎంఎల్ఏ తెగబాధపడిపోయాడు. గ్రామస్ధులతో మాట్లాడుతు సొంత ఊరికోసం తన సొంత డబ్బులు రు. 1.5 కోటి ఖర్చు పెట్టినట్లు చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాల కోసం తన సొంతడబ్బు ఖర్చు పెట్టినపుడు తనను అంతా బ్రహ్మాండమన్నారని తీరా పంచాయితీ ఎన్నికల్లో తన మద్దతుదారుడిని ఓడగొట్టారంటు తెగ బాధపడిపోయారు. తన మద్దతుదారుడిని ఓడించటం ద్వారా సొంతమనుషులే తన గుండెలపైన కొట్టారంటు బాధపడిపోయారు. ఎంఎల్ఏ బాధపడుతున్న సమయంలో గ్రామస్ధులు ఎవరూ మాట్లాడలేదు. బీజేపీ బలపరిచిన రేవతికి ఓట్లేసి ఎందుకు గెలిపించారో చెప్పమని ఎంఎల్ఏ అడిగినా ఎవరూ నోరిప్పలేదు.

