
జీహెచ్ఎంసీ డివిజన్ల హద్దులపై పునరాలోచన
ఏ ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
జీహెచ్ఎంసీ డివిజన్ల హద్దులు కీలక చర్చలకు దారితీస్తున్నాయి. ఈ డివిజన్ల హద్దుల విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా అధికార పార్టీ నేతలు కూడా ఈ హద్దులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ హద్దులను ఎలా నిర్దారిస్తో తమకు చెప్పాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజలక్ష్మితో భేటీ అయ్యారు. డివిజన్‌ల హద్దులపై వివరణ కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రాశ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి పలువురు కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మిని కలిశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై చర్చించారు. డివిజన్ల సరిహద్దులను మార్కింగ్ చేసి వినతి పత్రాన్ని మేయర్‌కు అందించినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా ఏ ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పాలని కూడా కోరినట్లు వెల్లడించారు.
పునర్విభజనలో సమస్యలు: అరికెపూడి
డివిజన్ల విభజనలో పలు సమస్యలు ఉన్నట్లు తాము గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. కొన్ని డివిజన్‌లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే మరికొన్నింటిలో తక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఇటువంటి అన్ని విషయాలను మేయర్, కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్‌లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని, హద్దులు తెలియకుండా అధికారులు కొత్త డివిజన్‌లను ఖరారు చేశారని ఆయన అన్నారు.
అభ్యంతరాలకు 17 వరకు ఛాన్స్
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై అధికారులు అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 1328 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో ఆదివారం ఒక్కరోజు వచ్చిన వాటి సంఖ్య 227 అని అధికారులు తెలిపారు. కమిషనర్ కర్నర్‌కు అధికారులు వినతపతరం అందించారు.
హై కోర్ట్ లో పెటిషన్ దాఖలు
జీహెచ్‌ఎంసీలో డివిజన్ల సంఖ్య పెంపును ప్రశ్నిస్తూ వినయ్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను తక్షణమే విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాంనగర్ డివిజన్‌కు సంబంధించి తాను చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై మరింత విచారణ కోసం హైకోర్టు కేసును రేపటికి వాయిదా వేసింది.

