
బీఎస్పీ అభ్యర్ధికి కాంగ్రెస్ ఎంఎల్సీ ప్రచారం
పార్టీతో అవసరంలేదని చెప్పి కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) బీఎస్పీ అభ్యర్ధికి బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాడు
గురువారం జరగబోయే ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కోటా ఎంఎల్సీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. పోటీలో ముగ్గురు అభ్యర్ధులుంటే అందులో ఇద్దరు జాతీయపార్టీల తరపున పోటీచేస్తుంటే మరొకరు బీఎస్పీ(BSP) తరపున పోటీచేస్తున్నారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)తో పాటు బీఎస్పీ కూడా జాతీయపార్టీయే అనటంలో సందేహంలేదు. కానీ కాంగ్రెస్, బీజేపీలతో పోల్చుకుంటే బీఎస్పీని తెలంగాణ(Telangana)లో పట్టించుకునేవారు ఉండరు. తెలంగాణలో బీఎస్పీకి ప్రాంతీయపార్టీగా కూడా గుర్తింపులేదు. జాతీయపార్టీల వల్ల అభ్యర్ధులకు గుర్తింపు లభిస్తుందని అనుకుంటే అభ్యర్ధుల వల్ల బీఎస్పీకి గుర్తింపుంటుంది. కాబట్టే కాంగ్రెస్, బీజేపీలను జాతీయపార్టీలుగాను బీఎస్పీని ప్రాంతీయపార్టీగా చెబుతున్నది.
ఇపుడు విషయం ఏమిటంటే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ నియోజకవర్గం పరిధిలోకి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ జిల్లాలు వస్తాయి. కాంగ్రెస్ తరపున వూటుకూరి నరేంద్రరెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తుండగా బీఎస్పీ తరపున ప్రసన్నహరికృష్ణ పోటీచేస్తున్నారు. జాతీయపార్టీల అభ్యర్ధుల్లో ప్లస్సులు, మైనస్సులున్నాయి. కాంగ్రెస్ కు అభ్యర్ధి నరేంద్రరెడ్డి పెద్ద మైనస్ అనిచెప్పాలి. అదే చిన్నమైల్ అంజిరెడ్డికి బీజేపీ పెద్ద ప్లస్ అనిచెప్పాలి. నరేంద్రరెడ్డికి పార్టీలోని చాలామంది నేతలే సహకరించటంలేదనే ప్రచారం జరుగుతోంది. అభ్యర్ధి కూడా పార్టీలోని కీలక నేతలను పెద్దగా పట్టించుకోవటంలేదని పార్టీలోనే టాక్ నడుస్తోంది.
విద్యాసంస్ధలుండటమే నరేంద్రరెడ్డికి సానుకూలమని కాంగ్రెస్ అగ్రనేతలు అనుకునే టికెట్ ఇచ్చారు. అయితే విద్యాసంస్ధలే ఇపుడు పెద్ద సమస్యగా మారింది. ఎలాగంటే విద్యాసంస్ధల్లో చదివిన విద్యార్ధులకు ఇపుడు చదువుతున్న విద్యార్ధుల్లోని పేదలకు ఫీజులు తగ్గించాలని వాళ్ళ తల్లి, దండ్రులు అడగటానికి ఎంతప్రయత్నించినపుడు నరేంద్రరెడ్డి ఎప్పుడూ అందుబాటులోకి రాలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నరేంద్రరెడ్డికి ఓట్లేయాలని ఆయన తరపున ఫోన్ చేస్తున్న టెలీకాలర్స్ ను ఓట్లెందుకు వేయాలని చాలామంది మొహంమీదే అడుగుతున్నారు. ఓటర్లలో వ్యతిరేకత, పార్టీనుండి పెద్దగా సహాయం అందకపోవటం, అభ్యర్ధి కూడా పార్టీ నేతలు, క్యాడర్ ను కలుపుకుని వెళ్ళటంలేదనే ప్రచారం పెద్ద మైనస్ అని తెలుస్తోంది. నరేంద్రరెడ్డికి పడే ఓట్లలో అత్యధికం పార్టీని, ప్రభుత్వాన్ని చూసి వేయాల్సినవే అనే టాక్ పెరిగిపోతోంది.
బీఎస్పీకి కాంగ్రెస్ నేత ప్రచారం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నరేంద్రరెడ్డి పరిస్ధితి ఎలాగ తయారైందంటే కాంగ్రెస్ నేత బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్నకు ప్రచారం చేస్తున్నారు. పార్టీతో అవసరంలేదని చెప్పి కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) బీఎస్పీ అభ్యర్ధికి బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాడు. పార్టీకన్నా తనకు సామాజికవర్గమే ముఖ్యమని ప్రకటించి బీసీల ఓటర్లందరు పార్టీలకు అతీతంగా ప్రసన్నకు ఓట్లేసి గెలిపించాలని తీన్మార్ బహిరంగంగానే పిలుపిచ్చాడు. అయితే తీన్మార్ పిలుపు ఏమేరకు పనిచేస్తుందో తెలీదు. కాని కాంగ్రెస్ అభ్యర్ధి పోటీలో ఉన్నప్పటికీ అధికారిక అభ్యర్ధిని కాదని ప్రత్యర్ధి బీఎస్సీ అభ్యర్ధిని గెలిపించాలని తీన్మార్ ప్రచారంచేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తీన్మార్ బహిరంగంగా ప్రచారం చేస్తుంటే ఇంకెంతమంది లోలోపల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో తెలీదు. ఈపరిస్ధితుల్లో నరేంద్రరెడ్డి గెలవాలంటే బాగా లక్కుండాల్సిందే.
ఇక బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ విషయంచూస్తే వ్యక్తిత్వంలో కాంగ్రెస్ అభ్యర్ధికి ఏమీ తీసిపోడనే ప్రచారం బాగా జరుగుతోంది. అయితే బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తుండటమే అంజిరెడ్డికి పెద్ద ప్లస్ పాయింట్. ఎలాగంటే బీజేపీతో సంబంధంలేకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, ఏబీవీపీలు చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఈమూడింటిలో పనిచేసేవాళ్ళకు అంజిరెడ్డితో అసలు పనేలేదు. పార్టీ తరపున ఎవరు పోటీచేస్తున్నారని కాకుండా పార్టీని చూసే వీళ్ళంతా ఓట్లేస్తారు. తాము ఓట్లేయటమే కాకుండా మరికొందరితో కూడా ఓట్లేయిస్తారు. ఇంతకమిటెడ్ గా పనిచేసే సంస్ధలుండటమే బీజేపీకి అతిపెద్ద బలం. బీజేపీ తరపున పోటీచేస్తున్న అంజిరెడ్డికి వీళ్ళ మద్దతు భేషరతుగా దొరికింది. ఇదేసమయంలో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఓట్లను అభ్యర్ధి మేనేజ్ చేసుకుంటే గెలిచే అవకాశాలున్నాయి. కారుపార్టీలోని కొందరు నేతలు అంజిరెడ్డితో టచ్ లో ఉన్నట్లుగా బాగా ప్రచారం జరుగుతోంది.
ఇక ఫైనల్ గా బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గురించి చూద్దాం. హరికృష్ణ మొదట బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉన్న కారణంగా ఇండిపెండెంటుగా పోటీచేయటం కన్నా ఏదో ఒక పార్టీ టికెట్ నయమని భావించి చివరకు బీఎస్పీ టికెట్ తెచ్చుకున్నారు. ఆర్ధికంగా ప్రసన్న కూడా గట్టిస్ధితిలోనే ఉన్నారు కాబట్టి ఆర్ధిక వనరులకు ఢోకాలేదు. జాతీయపార్టీలతో పోల్చుకుంటే కొన్ని మైనస్సులున్నా తన సామాజికవర్గం బలంతో అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ బీసీ(BC Votes) సామాజికవర్గంలోని గౌడ్ ఉపకులానికి చెందిన వ్యక్తి. ప్రసన్నకు నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్లో గ్రూప్ పరీక్షలకు కోచింగ్ సంస్ధలున్నాయి. కాబట్టి ప్రసన్న కోచింగ్ సెంటర్లలో కూడా చాలామంది విద్యార్ధి ఓటర్లుంటారు. అంతేకాకుండా బీసీ కార్డును ప్రసన్న బాగా ఉపయోగిస్తున్నారు.
BSP candidate Prasanna Hari Krishna
పోటీచేస్తున్న ముగ్గురిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారైతే ప్రసన్న ఒక్కళ్ళే బీసీ. కరీంనగర్, నిజామాబాద్ లో బీసీల జనాభా బాగా ఎక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్లలో బీసీలు ఎక్కువగా ఉంటారు. పై నాలుగు జిల్లాల పరిధిలోని 3.5 లక్షల ఓటర్లలో సుమారుగా లక్ష ఓటర్లు బీసీలే ఉన్నట్లు సమాచారం. ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యంతోనే ప్రసన్న చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా గ్రాడ్యుయేట్ ఓటర్లను అందులోను బీసీలను పెద్దఎత్తున ఓటర్లుగా చేర్పించారు. సామాజికవర్గాల పరంగా రెడ్డి ఓటర్లు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోయినా బీసీల ఓట్లు సాలిడ్ గా ప్రసన్నకు పడితే గెలిచే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు. అందుకనే బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న దెబ్బకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు వణికిపోతున్నారు. గ్రౌండ్ లెవల్ సమాచారం ఏమిటంటే పోటీ బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్-బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న మధ్యే ఉంటుందని. కాంగ్రెస్ అభ్యర్ధి మూడోస్ధానంలో నిలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ పెరిగిపోతోంది. సామాజికవర్గాల వారీగా ఓటర్లు చీలిపోతే ప్రసన్న గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. చివరకు ఏమి జరుగుతుందో గురువారం చూడాల్సిందే.