కాంగ్రెస్ పోరాటానికి సిద్ధం
x

కాంగ్రెస్ పోరాటానికి సిద్ధం

బడ్జెట్ లో తెలంగాణకి కేటాయింపులు ప్రకటించకపోవడంపై రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2024-2025 ఆర్ధిక సంవత్సర ఫుల్ బడ్జెట్ ని మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకి కేటాయింపులు ప్రకటించకపోవడంపై రాష్ట్ర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విభజనలో ఏపీ ఒక్కటే కాదు తెలంగాణకి కూడా నష్టం జరిగిందని కేంద్ర గుర్తించడంలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్ లో కాంగ్రెస్ ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డా. మల్లు రవితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, రఘవీర్ రెడ్డి లు పాల్గొన్నారు.

ఏపీ, బీహార్ కోసమే బడ్జెట్ -మల్లు రవి

కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని మండిపడ్డారు. విభజన చట్టం గురించి చాలసార్లు ప్రస్తావించారు కానీ తెలంగాణ అన్న పదం కూడా వాడలేదని ధ్వజమెత్తారు.

హైదరాబాద్ మినహా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినప్పటికీ... తెలంగాణకు కేటాయింపులు లేవని, ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు నిధులు కేటాయించడంలో తమకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం బాధాకరమని చెప్పారు. పాలమూరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తిచేయాలని సీఎం, మంత్రులు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని కేంద్రాన్ని తప్పుబట్టారు.

విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, ఇద్దరు మంత్రులు ఉన్నారని, అయినా తెలంగాణకు దక్కింది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బుద్దిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల సాధనకు అందరు ఎంపీలు కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. బీజేపీ, ఎంఐఎం ఎంపీలందరు కలిసి ఉమ్మడి పోరాటాలపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ హక్కుల సాధనకు అలుపులేని పోరాటం చేస్తామని ఎంపీ మల్లు రవి ప్రకటించారు.

బీజేపీకి తెలంగాణ పై ప్రేమ లేదు -గడ్డం వంశీ

కాంగ్రెస్ నష్టపోయినా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఇది కేంద్ర బడ్జెట్ కాదని, పొలిటికల్ బడ్జెట్ అని ఆయన విమర్శించారు. పూర్తి మెజారిటీ దక్కలేదు కాబట్టి అధికారాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో సామాన్య ప్రజానికానికి ఒరిగింది ఏమి లేదు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచినా వారు సాధించింది ఏమి లేదు. తెలంగాణ నిధులు సాధించేందుకు కృషి చేస్తామని ఎంపీ వంశీ తెలిపారు.

కేంద్రం తీరును ఖండిస్తున్నాం: ఎంపీ కడియం కావ్య

తెలంగాణ పుట్టకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇష్టపడడం లేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య విమర్శించారు. తెలంగాణకు నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణలో రూ. 7 లక్షల కోట్లు అప్పులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు ఏమైనా ఇస్తారేమోనని చూశామని అన్నారు. కేంద్రం తీరును ఖండిస్తున్నామని కడియం కావ్య తెలిపారు.


Read More
Next Story