ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్టీఆర్ మనవరాలు?
x
రేవంత్ ను కలిసిన నందమూరి సుహాసిని

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్టీఆర్ మనవరాలు?

ఖమ్మం పార్లమెంట్ బరిలో ఎన్టీఆర్ మనవరాలు కాంగ్రెస్ అభ్యర్థిగా నందమూరి సుహాసిని బరిలోకి దిగనున్నారా ? అంటే అవునంటున్నారు నేతలు..ఆమె ఇటీవల రేవంత్ తో భేటీ అయ్యారు.


ఎన్టీఆర్...రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు...అత్యంత జనాదరణ ఉన్న ఎన్టీఆర్ లెగసీని పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వాడుకోనున్నారు. ఒకవైపు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గత కొంతకాలంగా ఎన్టీఆర్ జపం చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. మరో వైపు దీనికి కౌంటరుగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ మనవరాలైన నందమూరి సుహాసినిని ఎన్నికల బరిలోకి దించనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.

- తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్రమేణా కనుమరుగైపోతోంది.అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ఖమ్మం జిల్లాలో మాత్రం టీడీపీ ఓటుబ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం వారితోపాటు సెటిలర్స్ ఓటర్లు ఉండటంతో ఖమ్మంలో టీడీపీ ప్రాబల్యం ఇప్పటికీ కొనసాగుతోంది.
- ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సెగ్మెంట్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్టీఆర్ అభిమానులతో సమావేశమై ఓట్లు అభ్యర్థించారు. ఎన్టీఆర్ అభిమానుల మద్ధతుతో తుమ్మలకు అనూహ్యంగా అత్యధిక మెజారిటీతో విజయ దుందుభి మోగించారు.

ఎన్టీఆర్ జపం చేస్తున్న నామ
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన ప్రస్థుత ఆ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గత కొంతకాలంగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే నాయకుడిగా నామ ఖమ్మంలో టీడీపీ ఎంపీగా ఉన్నపుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పోలీసు నిర్బంధం మధ్య ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు ఆగంతకులు పాక్షికంగా ధ్వంసం చేస్తే దాన్ని ఖండిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరో వైపు ఢిల్లీలోని పార్లమెంట్ లో నూ ఎన్టీఆర్ విగ్రహాన్ని తాను చేసిన పోరాటం వల్లనే ఏర్పాటు చేశారని తాజాగా బీఆర్ఎస్ నామ ప్రకటించారు.

ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సమావశం అనంతరం మాట్లాడుతున్న నామ

ఖమ్మం పర్యటనకు వచ్చినపుడల్లా టీడీపీ సానుభూతిపరులతో నామ సమావేశమై వారి మద్ధతు పొందేందుకు యత్నిస్తున్నారు. మరో వైపు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి స్థలం లీజు గడువును మరో 30 ఏళ్ల పాటు పెంచాలని కోరుతూ ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ కేన్సర్ ఆసుపత్రి లీజును పెంచారు.

రేవంత్‌ను కలిసిన నందమూరి సుహాసిని
పార్లమెంట్ ఎన్నికల వేళ మళ్లీ తెలంగాణలో నందమూరి మనవరాలు నందమూరి సుహాసిని పేరు తెర మీదకు వచ్చింది. టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల సమక్షంలో సుహాసిని కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.దీంతో నామకు కౌంటరుగా నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని ఖమ్మం బరిలోకి దించితే ఎలా ఉంటుందనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ముగ్గురు మంత్రులు వారి కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న తరుణంలో వారు ముగ్గురిని కాదని కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం యోచిస్తుందని హస్తిన కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కూకట్ పల్లిలో ఓటమి పాలై...
2018 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలైంది. ఎన్టీఆర్ అభిమానులతోపాటు టీడీపీ ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మం ఎంపీ స్థానం నుంచి నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినిని రంగంలో దించితే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు ఆమె పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే నందమూరి సుహాసిని సీఎం రేవంత్ ను కలవడం మర్యాదపూర్వక భేటీ అని మరికొందరు నాయకులు చెబుతున్నారు. కాగా తాను తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎనుముల రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని నందమూరి సుహాసిని ప్రకటన జారీ చేశారు.

నేడో రేపో వెలువడనున్న జాబితా
తెలంగాణలో పెండింగులో ఉన్న మూడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను నేడో, రేపో విడుదల చేయనున్నట్లు ఢిల్లీలోని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తెలిపింది. ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, లేదా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందినీ విక్రమార్కలలో ఎవరో ఒకరిని రంగంలోకి దించే విషయంపై కూడా కాంగ్రెస్ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే చివరి క్షణంలో నందమూరి సుహాసిని పేరును రేవంత్ తీసుకువస్తే ఆమె పేరును కూడా ఖరారు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఎవరికనేది ఆసక్తి రేపుతోంది.
Read More
Next Story