
‘ప్రజల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా..?’
వరదలు, వర్షాలు అతలాకుతలం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సర్కార్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వరదలు, వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే సర్కార్‌కు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు తమకు పట్టవన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు, వారి కష్టాలు కాంగ్రెస్‌కు ఎన్నికలప్పుడు ఓట్లకు మాత్రమే గుర్తొస్తాయని, ఒక్కసారి ఎన్నికలయ్యాయంటే ప్రజలు ఎలా పోయినా పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్‌దేనంటూ ఎద్దేవీ చేశారు.
24 గంటలుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని, దాని కారణంగే అనేక ప్రాంతాలు నదుల మాదిరిగా మారాయిన, మరెన్నో ప్రాంతాల్లో ప్రజలు నానా తిప్పలు పడుతున్నారని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం, మంత్రులు అందరూ కూడా చోద్యం చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష వెంటనే చేయాలి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల, రాజకీయ ప్రచారాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజల ఇక్కట్లపై దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైతే NDRF సహకారం తీసుకోండి. గతంలో వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మా ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్లను పంపించాము.కామారెడ్డి నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులు, మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ తండాలోని గిరిజనులను కాపాడాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. రోడ్లు, రహదారులు, విద్యుత్ వంటి వసతుల మరమ్మత్తులపై దృష్టి సారించాలి’’ అని అన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. గత 24 గంటల్లో ఎడతెరిపిలేని వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు కూడా అందుబాటులో లేకుండా పోయింది’’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. జాతీయ రహదారి 44తో పాటు, అనేక అంతర్ జిల్లా రహదారులు కూడా కొట్టుకుపోయాయని, కామారెడ్డి నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులు, హవేలీ ఘనపూర్ తాండాలో గిరిజనులు ఇండ్లపై ఎక్కి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కేసీఆర్ గారు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు’ అని విమర్శించారు. అనంతరం ప్రభుత్వానికి కేటీఆర్ పలు సూచనలు చేశారు.
కేటీఆర్ సూచనలు:
- వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF, SDRF బృందాలను పెద్ద ఎత్తున రంగంలోకి దించాలి.
- బాధితుల కోసం ప్రత్యేక రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్యం కల్పించాలి.
- దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయాలి.
- కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి.
“ప్రభుత్వం తక్షణం మేల్కొని ప్రజల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలబడాలి. ప్రభుత్వం వైఫల్యం చెందితే, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు” అని కేటీఆర్ అన్నారు.