‘బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత’ సభ వాయిదా
x

‘బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత’ సభ వాయిదా

వర్షాల దెబ్బతో నిరవధిక వాయిదా వేసిన కాంగ్రెస్.


కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించాలనుకున్న ‘బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత’ సభకు వరుణుడు అడ్డం తగిలాడు. ఈ నెల 15న కామారెడ్డి వేదికగా భారీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ సన్నాహలు చేస్తోంది. సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కీలక నేతలు దగ్గరుండి చేయిస్తున్నారు. కట్ చేస్తే.. భారీ వర్షాలు మొదలయ్యాయి. ఎడతెరిపిలేకుండా దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వాతావరణ శాఖ కూడా కీలక సూచనలు చేసింది. కామారెడ్డి సహా పలు జిల్లాల్లో రానున్న నాలుగు ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, దాంతో పాటుగానే గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయిన పేర్కొంది. దీంతో కాంగ్రెస్ తమ సభను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది.

ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. సభను రద్దు చేద్దామా.. వాయిదా వేద్దామా అన్న అంశంపై చర్చించారు. అంతేకాకుండా వేదిక మార్చి.. ఏదైనా ఇండోర్ ఆడిటోరియంలో నిర్వహించాలా? అన్న ఆలోచననను కూడా చేసినట్లు సమాచారం. కాగా ప్రజలతో కూడిన సభ కాబట్టి బహిరంగంగానే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు తగ్గే వరకు సభను వాయిదా వేయాలని పార్టీ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది.

నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నాలుగు రోజులపాటు వర్షాల సూచన వాతావరణ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ఎత్తు ప్రాంతాలవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు, వ్యవసాయదారులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వర్షాలపై సీఎం హెచ్చరికలు..

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు పలు జిల్లాల్లో కురుస్తున్న వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Read More
Next Story