కేసీఆర్ హయాంలో బర్తరఫ్ లు, సస్పెన్షన్లను గుర్తుచేస్తున్న కాంగ్రెస్
x
Revanth and KCR

కేసీఆర్ హయాంలో బర్తరఫ్ లు, సస్పెన్షన్లను గుర్తుచేస్తున్న కాంగ్రెస్

ఎస్సీ, బీసీ ఎంఎల్ఏలను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయటమే కాకుండా వారిని ఘోరంగా అవమానించి పార్టీలో నుండి బహిష్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.


సూర్యాపేట ఎంఎల్ఏ గుంటకండ్ల జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేయటం అధికార కాంగ్రెస్-ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య పెద్ద వివాదంగా మారింది. తనపట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎంఎల్ఏ జగదీశ్వరరెడ్డి(BRS MLA Jagadeeswar Reddy)ని స్పీకర్ బడ్జెట్ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే కేసీఆర్(KCR) పదేండ్లలో జరిగిన విషయాలను కాంగ్రెస్ నేతలు తవ్వి బయటకు తీస్తున్నారు.

అసెంబ్లీ నుండి జగదీశ్వరరెడ్డిని సస్పెండ్ చేయటం అరాచకం, అప్రజాస్వామికం అంటు కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు. వీళ్ళ గోల ఎలాగుందంటే తమ పదేళ్ళ హయాంలో సభనుండి కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాము అసెంబ్లీని నూరుశాతం ప్రజాస్వామికంగా, ప్రశాంతంగా నిర్వహిస్తే కాంగ్రెస్ మాత్రం అప్రజాస్వామికంగా నడుపుతోందన్న కేటీఆర్, హరీష్ ఆరోపణలు, విమర్శలను మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు తిప్పికొడుతున్నారు.

అసెంబ్లీనుండి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయటానికి రేవంత్ రెడ్డి(Revanth)కి ఏమాత్రం ఇష్టంలేదన్న విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గుర్తుచేస్తున్నారు. కారుపార్టీ ఎంఎల్ఏలు సభలో గడచిన 15 మాసాల్లో ఎన్నిసార్లు గోలచేసినా సభ్యులను సస్పెండ్ చేయద్దని స్పీకర్ కు రేవంత్ విజ్ఞప్తిచేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేస్తున్నారు. ఇపుడు కూడా స్పీకర్ ను ప్రశ్నించటంతోనే ఎంఎల్ఏని సస్పెండ్ చేయాల్సొచ్చిందని మంత్రి చెప్పారు. ఇదేవిషయమై విప్ వేముల వీరేశం మాట్లాడుతు ఎంఎల్ఏలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసే సంప్రదాయాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్ అని గుర్తుచేస్తున్నారు. సభలోనే కాదని సభ వెలుపల కూడా ఎస్సీ, బీసీలను కేసీఆర్ అవమానించిన, చిన్నచూపుచూసిన విషయాలను వేముల ప్రస్తావించారు.


మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చినపుడు మంత్రివర్గం నుండి డిప్యుటి సీఎంగా పనిచేసిన ఎస్సీ ఎంఎల్ఏ డాక్టర్ రాజయ్యను, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నేత ఈటల రాజేంద్ర(Eatala Rajendra)ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయాన్ని వేముల గుర్తుచేశారు. ఎస్సీ, బీసీ ఎంఎల్ఏలను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయటమే కాకుండా వారిని ఘోరంగా అవమానించి పార్టీలో నుండి బహిష్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సభనుండి కాంగ్రెస్ ఎంఎల్ఏలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy), సంపత్ కుమార్ ను స్పీకర్ తో చెప్పించి కేసీఆర్ డిస్ క్వాలిఫై చేయించిన విషయమై వేముల మండిపోయారు. ప్రభుత్వాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని నిలదీస్తున్నందుకు సభనుండి రేవంత్ ను పదేపదే సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.

మంత్రి సీతక్క(Minister Sithakka) మాట్లాడుతు తెలంగాణకు మొదటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు పాదాభివందనం చేసేన కేసీఆర్ తర్వాత గవర్నర్ గా వచ్చిన తమిళిసైని ఎందుకు అవమానించారో చెప్పాలని నిలదీశారు. తమిళిసై మహిళ పైగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే కేసీఆర్ అవమానించినట్లు మంత్రి ఆరోపించారు. గవర్నర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించిన విషయాన్ని కూడా మంత్రి గుర్తుచేశారు. మొత్తానికి మంత్రులు, ఎంఎల్ఏలు పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన డిస్ క్వాలిఫికేషన్లు, సస్పెన్షన్లు మొత్తాన్ని తవ్వితీస్తున్నారు. మరీ వివాదం చివరకు ఎంతదూరంపోతుందో చూడాల్సిందే.

Read More
Next Story