కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారు: ఈటల
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఈ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఈ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇదే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేశారని, ఏడాదిగా రాష్ట్రానికి ఏం చేశారని ఇప్పుడు కాంగ్రెస్ ఇంత భారీ ఎత్తున విజయోత్సవాలంటూ చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అటకెక్కించడం, ప్రజలకు కష్టాలను పెంచడమే ఈ ప్రభుత్వం సాధించిన విజయాలా అని ఆయన నిలదీశారు. ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు ప్రజా విజయోత్సవాలు చేస్తున్నారని అడిగారు. పైగా హైడ్రా పేరుతో పేదలకు నిల్చునే నీడ లేకుండా చేసినందకా ఈ విజయోత్సవాలు? మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్లు కొల్లగొట్టినందుకా? అని ప్రశ్నించారు ఈటల. బీజేపీ కార్యాలయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై ఘాటుగా స్పందించారు.
‘‘కాంగ్రెస్ అబద్ధాల పునాదులపై రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం 19వేల ఎకరాల భూసేకరణ చేయడానికి యత్నించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏం చెప్పింది. ఫార్మా సిటీలను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. తీరా అధికారం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయింది. ఇప్పుడు వీళ్లు కూడా బీఆర్ఎస్ తరహాలోనే ఫార్మా సిటీ పాట పాడుతున్నారు. బీఆర్ఎస్‌ను మించి మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫోర్త సిటీ కోసం 30 వేల ఎకరాల భూసేకరణ అంటోంది. ఈ సిటీ కోసం రైతుల కడుపు కొడుతున్నారు. ఫార్మా సిటీ రద్దు అన్న వాళ్లు ఇప్పుడు కొడంగల్‌లో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు.
దాడి జరగలేదని కలెక్టరే అంటున్నారుగా..
‘‘లగచర్లలో తమపై దాడి జరగలేదని కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తున్నారు. అయినా వినిపించుకోకుండా లగచర్ల రైతులను నానా హింసలు పెడుతున్నారు. ఎనిమిది నెలలుగా నిరసన తెలుపుతున్న లగచర్ల రైతులను గుర్తించి మరీ పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. లగచర్ల రైతులు ఏమైనా నక్సలైట్లా? సంఘ విద్రోహ శక్తులా? నర్మదా, సబర్మతి నదుల తరహాలో మూసీ అభివృద్ధి జరగాలి. దానిని ఎలా చేయాలనే పక్కా ప్రణాళిక కూడా ఉండాలి. అదేమీ లేకుండా మూసీ సుందరీకరణ చేస్తామంటే ఎలా. మూసీ ఇరువైపులా ఇళ్లను కూల్చి ఆ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికే వ్యతిరేకం. మూసీ సుందరీకరణకు కాదు’’ అని ఈటల అన్నారు.
ఆ హామీలు ఏమయ్యాయి..
‘‘మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంతే సమాధానం చెప్పాలి. ప్రధానిని విమర్శించే స్థాయి సీఎంకు ఉందా? రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల ప్రచారంలో విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమైంది? మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ ఇస్తామన్నారు.. అదెక్కడి వరకు వచ్చింది? ఒక్కరికైనా అందించారా? రేవంత్ రెడ్డికి సీఎం పదవి రావడం ఆటో డ్రైవర్ల మెడకు ఉరి తాడులా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యధికంగా ఆటో డ్రైవర్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతోంది. రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారని, ఏం చేశారని ఇప్పుడు ఈ రేంజ్‌లో వేడుకలు చేస్తున్నారు?’’ అని ఈటల ప్రశ్నించారు.