బిఆర్ ఎస్ లాగానే బిజెపిని సాగనంపాలి : ధర్నాచౌక్ లో దద్దరిల్లిన కేక
x
ధర్నా చౌక్ తొలి ధర్నాలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

బిఆర్ ఎస్ లాగానే బిజెపిని సాగనంపాలి : ధర్నాచౌక్ లో దద్దరిల్లిన కేక

నిరంకుశ పాలనకు తెలంగాణలో లాగనే కేంద్రంలో కూడా చోటు లేదుంటున్న కాంగ్రెస్.


కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను సస్పెన్షన్ చేయడం అప్రజాస్వామికమని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ధర్నా చౌక్ మీద ఆంక్షలను విధించాక జరిగిన తొలిధర్నా ఇది. ఈ తొలిధర్నాకాంగ్రెస్ దే కావడం విశేషం.

ధర్నాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టిజెఎస్ నేత ప్రొఫెషర్ కొదండరామ్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు.

పార్లమెంటుపై అగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను ఆ ప్రజాస్వామికంగా సస్పెన్షన్ చేయడాన్ని ధర్నాలో పాల్గొన్న నేతలు ఖండించారు. నూటానలభైై మంది ప్రతిపక్ష సభ్యులను బయటకుపంపి కీలకమయిన బిల్లులను పాస్ చేసుకోవడాన్ని ధర్నాలో పాల్గొన్ననేతలు తీవ్రంగా విమర్శించారు. ఇది ఎన్ డిఎ ప్రభుత్వానికి ఉన్న నిరంకుశ లక్షణమని అన్నారు. ధర్నాచౌక్ ను మూసేసి ప్రతిపక్షాల గొంతు నొక్కి రాష్ట్రాన్ని నిరంకుశంగా పరిపాలించిన భారత రాష్ట్ర సమితిని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపినట్లే, కేంద్రంలో ఉన్న ఎన్ డిఎ నిరంకుశ ప్రభుత్వాన్ని కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సాగనంపాలని ధర్నాలో ప్రసంగించిన కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సిపిఐ తదితర పార్టీల నేతలు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ "భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలి. ఈదాడికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. భారత పార్లమెంటను రక్షించుకోలేని బిజెపి పాలకులు ఈ దేశాన్ని ఏమి కాపాడుతారు. ఈ దేశ రక్షణను ప్రధాని మోడీ గాలికి వదిలేశారు,” అని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు.

“పార్లమెంట్ పై ఈనెల 13న అగంతకులు చేసిన దాడిపై ఇప్పటి వరకు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా బిజెపి మంత్రులు మౌనంగా ఉండటం, అసలేమి దాడి జరగలేదన్నట్టుగా వ్యవహరించడం, అందుకు తగ్గట్టుగా వారి కార్యకలాపాలు ఉండటం బాధాకరం. దీనికి నిరసన వ్యక్తం చేస్తే, దేశ చరిత్రలో కనీ విని ఎరగని విధంగా పార్లమెంటు సభ్యులను 141 మందిని సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంత్రత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుంది అనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనం,” అని అన్నారు.

సభ్యులను తిరిమి బిల్లు పాస్ చేసుకొంటారా: కోదండరాం

పార్లమెంట్ ఘటన పై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం విపక్ష సభ్యులందరిని బహిష్కరించి, చర్చలేకుండా కీలకమయిన బిల్లులను ఆమోదింప చేసుకుంటున్నారు. ఇదే ప్రజాస్వామ్యమని తెలంగాణ జనసమితి నేత ప్రొ. కోదండరామ్ అన్నారు.

“పార్లమెంట్ పై దాడి జరిగితే సమాధానం లేదు. బీజేపీ నియంత్ర్యత్వ ధోరణి వ్యవహరిస్తుంది. పార్లమెంట్ కి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్ డిఎ ప్రభుత్వానికి లేదు. అలాంటి ప్రభుత్వం దేశానికి భద్రత ఎలా కల్పిస్తుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చర్చలు లేకుండా, ప్రతిపక్షం సభలో లేకుండా చేసి చట్టాలు తెస్తున్నార," ఆయన అన్నారు.

బిఆర్ ఎస్ లాగా బిజెపిని సాగనంపాలి

"బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. గతంలో బిఆరెస్ ప్రభుత్వం నిరంకుశత్వం తో ధర్నా చౌక్ ని తీసేసింది. హైకోర్టు ధర్నా చౌక్ కి అనుమతి ఇచ్చింది. ఆగ్రహంతో ప్రజలంతా ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని తొలగించారు. ఇపుడు కేంద్రంలో అధికాంలో ఉన్నబిజెపిని కూడా భారత రాష్ట్ర సమితిని సాగనంపినట్లే 2024 ఎన్నికల్లో సాగనంపాలి,”అని మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, సీనియర్ నాయకుడు మల్లు రవి తదితరులు పేర్కొన్నారు.

Read More
Next Story