మల్కాజిగిరి: కాంగ్రెస్ ఖాతాలో మరో లక్ష ఓట్లు?
x

మల్కాజిగిరి: కాంగ్రెస్ ఖాతాలో మరో లక్ష ఓట్లు?

మల్కాజిగిరి పార్లమెంటు సీటును మూడు ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్ల సంఖ్య ఉన్న లోక్ సభ సెగ్మెంట్ ఇది.


సీనియర్ రాజకీయ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో తన స్వల్ప ప్రయాణానికి ముగింపు పలికారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన సొంతగూటికి చేరుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షి.. శ్రీశైలం గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శ్రీశైలం గౌడ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి లక్షకు పైగా ఓట్లను సాధించి, ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి కోలన్ హన్మంతరెడ్డిని మూడో స్థానానికి నెట్టేశారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ నుంచి కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ వొడిలో మరో లక్ష ఓట్లు..

కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ బలమైన నేత. 2009 లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన అనంతరం వైఎస్సార్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. 2021 లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ దాదాపు లక్షా రెండు వేల ఓట్లు దక్కించుకుని తన సత్తా చాటారు.

మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాదాపు లక్షా ఎనభై వేల ఓట్లు దక్కించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోలన్ హన్మంతరెడ్డి కూడా లక్షా ఒక వెయ్యి ఓట్లు సాధించినప్పటికీ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో శ్రీశైలం గౌడ్ పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అవనుంది. మరో లక్ష ఓట్లు కాంగ్రెస్ వొడిలో చేరే అవకాశం ఉంది.

కాంగ్రెస్ తన ఎన్నికల పునాదిని బలోపేతం చేసుకునే సమిష్టి ప్రయత్నాలలో భాగంగా, ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీజేపీ నేత నారాయణన్ శ్రీగణేష్‌ను కూడా పార్టీలో చేర్చుకుంది. 2023లో శ్రీగణేష్ 42,000 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. తాజాగా ఆయనని కంటోన్మెంట్ ఉపఎన్నిక అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సిట్టింగ్ స్థానం కావడంతో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పలువురు కార్పొరేటర్లు, స్థానిక సంస్థలకు ఎన్నికైన నేతల చేరికలపైనా అధికార పార్టీ దృష్టి సారించింది. అనుకున్నట్లు జరిగితే మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మరి కొంతమంది నేతలు త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.

ప్రధాన పార్టీలకు ఇది ప్రతిష్టాత్మక సీటు..

మల్కాజిగిరి పార్లమెంటు సీటును మూడు ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్ల సంఖ్య ఉన్న లోక్ సభ సెగ్మెంట్ ఇది. ఇక్కడ దాదాపు 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యారంగంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోనే కాదు దేశంలోని నలుమూలల ప్రాంతాల, వర్గాలు వారు ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆర్ధికంగానూ బలమైన నియోజకవర్గం కావడంతో ఇక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు ఆశిస్తున్నాయి.

2009 లో జరిగిన నియోజకవర్గాల విభజన తర్వాత మల్కాజిగిరి పార్లమెంటు ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ లు ఖాతా తెరవలేదు. మూడు సార్లు లోక్ సభ ఎన్నికలు జరిగితే రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలిచింది. 2014 లో మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ భవిష్యత్తు కోసం 2016 లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ లు పట్టుదలతో ఉన్నాయి.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలో క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఖరారు చేసింది. కాంగ్రెస్ రంగారెడ్డిలో బలమైన నేతగా పేరున్న పట్నం మహేందర్ రెడ్డి భార్య, పట్నం సునీతా రెడ్డిని పోటీలో నిలబెట్టింది. బీజేపీ పార్టీలో ప్రధాన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ని బరిలో దింపింది.

రేవంత్ రెడ్డికి ఛాలెంజింగ్ సీటు..

మల్కాజిగిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిట్టింగ్ స్థానం. ఆయన పార్లమెంటు పరిధిలోని ఒక్క సెగ్మెంట్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటు దక్కించుకోలేదు. దీంతో ఈ సీటు కొట్టడం రేవంత్ రెడ్డికి ఛాలెంజింగ్ విషయం. సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్, దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో మళ్ళీ పోటీ చేయాలని సవాళ్లు విసురుతోంది. అందుకే రేవంత్ మల్కాజిగిరిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల వ్యూహాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ముఖ్య నేతల్ని తమవైపుకు తిప్పుకోవడంతో పాటు, అభివృద్ధి జరగాలంటే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించాలని పిలుపునిస్తున్నారు.

లోకల్ నినాదంతో బీఆర్ఎస్..

బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్స్ కావడంతో బీఆర్ఎస్ మేం పక్కా లోకల్ అంటూ ప్రచారం చేస్తోంది. రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో నేను లోకల్ అని.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని ఎన్నికల ప్రచారంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ సీటుకి నోచుకోలేదు. ఇప్పుడు అధికారంలో లేదు, అందులోనూ వెంటాడుతోన్న కేసులు, వివాదాలు. ఈ నేపథ్యంలో కారుని కూడా ఓటమి భయం వెంటాడుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 9.5 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నప్పటికీ, ఆ ప్రభావం ఇప్పుడు ఉంటుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ ని ఓడించి రేవంత్ ని మానసికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.

నార్త్ ఓటర్లపై బీజేపీ గురి..

డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ముందుకి వెళుతోన్న బీజేపీ రాష్ట్రంలో మెజారిటీ సీట్ల కోసం పాకులాడుతోంది. వాటిలో హైదరాబాద్ తో పాటు ఈటల నిలబడిన మల్కాజిగిరి సీటును కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరేసి ప్రాభవాన్ని చాటుకోవాలి అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో బీజేపీకి 4 లక్షల ఓట్లు కూడా రాలలేదు. కానీ ఇక్కడ ఎలాగైనా బోణీ కొట్టాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే నార్త్ ఓటర్లను ఆకట్టుకోవడానికి మల్కాజిగిరి పార్లమెంటులో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి తెలంగాణ భక్తుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు.

ప్రధాన పార్టీలు మల్కాజిగిరి పార్లమెంటులో గెలుపు కోసం ఎత్తులకు పైఎత్తులతో వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.

Read More
Next Story