తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
x
Congress MLC Teenmar Mallanna

తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పంటికింద రాయిలా తయారైన ఎంఎల్సీ తీన్మార్ మల్లన్నపై శనివారం సస్పెన్షన్ వేటుపడింది.


రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పంటికింద రాయిలా తయారైన ఎంఎల్సీ తీన్మార్ మల్లన్నపై శనివారం సస్పెన్షన్ వేటుపడింది. చాలాకాలంగా మల్లన్న పార్టీని అనేక అంశాల్లో బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనికి పరాకాష్టగా రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్వహించిన కులగనణ రిపోర్టు తప్పులతడక అని తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)@ చింతపండు నవీన్ బహిరంగంగా ఆరోపించారు. ఆరోపణలతో సరిపెట్టుకోకుండా కులగణన రిపోర్టును తన మద్దతుదారుల సమక్షంలో బహిరంగంగా తగలబెట్టాడు. దాంతో తీన్మార్ వ్యవహారంపై కాంగ్రెస్(Congress) పార్టీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చింది. దాంతో కులగణన రిజపోర్టును తగలబెట్టడంపై సంజాయిషీ కోరుతో క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ జీ చిన్నారెడ్డి పేరుతో ఫిబ్రవరి 5వ తేదీన తీన్మార్ కు షోకాజ్ నోటీసు జారీచేసింది. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చేందుకు కమిటి తీన్మార్ కు వారంరోజులు అంటే 12వ తేదీవరకు గడువిచ్చింది.

అయితే తన సంజాయిషి కోరుతు క్రమశిక్షణ కమిటి ఇచ్చిన గడువును తీన్మార్ పట్టించుకోలేదు. షోకాజ్ నోటీసును పట్టించుకోకపోగా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదన్నాడు. తాను సమాధానం ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెబుతానని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దాంతో మరికొద్దిరోజులు వెయిట్ చేసిన క్రమశిక్షణ కమిటి విషయాన్ని ఏఐసీసీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్ళింది. చివరకు పై స్ధాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) హైదరాబాద్ పర్యటన మరుసటిరోజే తీన్మార్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయటం సంచలనంగా మారింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో సీనియర్ నేత అందులోను ఎంఎల్సీపై సస్పెన్షన్(Teenmar suspention) వేటుపడటం పార్టీలో కలకలం రేకెత్తిస్తోంది. పార్టీ క్రమశిక్షణ దాటి వ్యవహరిస్తే ఎంతటి నేతను అయినా ఉపేక్షించేదిలేదని మీనాక్షి గాంధీభవన్లో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో హెచ్చరించారు. మీనాక్షి అలా హెచ్చరించారో లేదో మరుసటి రోజే తీన్మార్ ను పార్టీనుండి సస్పెండ్ చేయటం గమనార్హం. అంటే మీనాక్షి హైదరాబాదుకు రావటమే తీన్మార్ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకునే వచ్చినట్లు అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ను తీన్మార్ బహిరంగంగానే విమర్శిస్తున్నాడు. అనేక సందర్భాల్లో రేవంత్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశాడు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడద్దని సీనియర్ నేతలు ఎన్నిసార్లు చెప్పినా తీన్మార్ వినలేదు.

తీన్మార్ వ్యవహారశైలి ఎలాగ అయ్యిందంటే ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తున్నట్లు అయ్యింది. ప్రభుత్వంపై తాము ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం కాదని కాంగ్రెస్ ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఆరోపణలు చేస్తు, విమర్శలు చేస్తున్నాడు కదాని ప్రతిపక్షాల నేతలు గుర్తుచేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవటం కాంగ్రెస్ నేతలకు చాలా ఇబ్బందులుగా తయారైంది. బీసీ వాదనను బహిరంగంగా వినిపిస్తున్న తీన్మార్ ఇదే విషయమై రేవంత్ టార్గెట్ గా చాలా ఆరోపణలే చేశాడు. వీటన్నింటికీ పరాకాష్టగా కులగణన రిపోర్టును తగలబెట్టాడు. సమయంకోసం వెయిట్ చేస్తున్న పార్టీలోని సీనియర్ నేతలు వెంటనే తీన్మార్ పై యాక్షన్ తీసుకోవాల్సిందే అని రేవంత్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీద ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అందుకనే సంజాయిషీ కోరుతు పార్టీ క్రమశిక్షణ కమిటి తీన్మార్ కు వారంరోజులు గడువిచ్చింది. సంజాయిషి ఇవ్వకపోగా కమిటీని, పార్టీని లెక్కనేట్లుగా మాట్లాడటంతోనే చివరకు తీన్మార్ ను పార్టీ సస్పెన్షన్ వేటువేసింది.



క్రమశిక్షణ దాటితే వేటు తప్పదు

పార్టీలో ఎంతటి నేతైనా సరే క్రమశిక్షణ దాటితో వేటు తప్పదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(TPCC President Bomma Mahesh) హెచ్చరించారు. తీన్మార్ సస్పన్షన్ పై మీడియాతో మాట్లాడుతు తీన్మార్ పై సస్పెన్షన్ వేటు ఏఐసీసీ అగ్రనేతల ఆమోదంతోనే జరిగినట్లు చెప్పారు. పార్టీలో క్రమశిక్షణకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు బొమ్మ చెప్పారు.

Read More
Next Story