కొడంగల్ లిఫ్ట్ టెండర్లలో భారీ అవినీతి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆరోపణలు..
x

కొడంగల్ లిఫ్ట్ టెండర్లలో భారీ అవినీతి.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆరోపణలు..

నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.


నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేబులు నింపుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, దేనిని చూసినా వీళ్లకు కమీషన్లే గుర్తొస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దండుకుంటున్నారని, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితులను తమ స్వార్థం కోసం మరింత దిగజారుస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆఖరికి కాంగ్రెస్ అవినీతి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి కూడా మినహాయింపు లభించలేదని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లలో నిబంధనల ప్రకారం తక్కువ బిడ్ వేసిన వారికి కాకుండా తమకు అనుకూలంగా ఉండే వారికే టెండర్లను కట్టబెడుతున్నారని, అందుకు నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ నిదర్శనమని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుందని, ప్రజల పక్షాన అహర్నిశలు పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు. ప్రజల గొంతులపై ఈ అవినీతి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని అన్నారు.

దిగ్గజ కంపెనీలను పక్కనపెట్టి మరీ..

‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నారాయనపేట-కొడంగల్ లిఫ్ట్ టెండర్లలో అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అద్వాన్న క్యాపిటలిజానికి ఈ ప్రాజెక్ట్ నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రాజెక్ట్ టెండర్లలో దిగ్గజ సంస్థలను పక్కనపెట్టి మరీ మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్‌కు ఈ ప్రాజెక్ట్ టెండర్లను కట్టబెట్టారు. వీరికన్నా తక్కువకు బిడ్ వేసిన ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీఎల్ వంటి దిగ్గజాలను సాంకేతిక కారణాలు చెప్తూ పక్కనబెట్టారు. రాఘవ, మేఘా రెండు సంస్థలూ కూడా 3.9, 3.95 శాతం అధిక బిడ్‌లను కోట్ చేశాయి. కానీ వాటికే ప్రాజెక్ట్‌ను ఇచ్చిందీ ప్రభుత్వం. ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీఎల్ సంస్థలకు నో చెప్పడానికి సాంకేతిక లోపాలను చెప్పడం దారుణం. ఇటువంటి ఎన్నో అబద్ధాలు చెప్పి తమకు అనుకూలంగా ఉండే సంస్థలకు ప్రాజెక్ట్‌ను ఎంతో సులభంగా అందించింది కాంగ్రెస్ సర్కార్’’ అని విమర్శించారు.

అది గుర్తు లేదా రేవంత్ సారూ..

‘‘సుంకిశాలలో భారీ విపత్తు సంభవించిన సందర్భంగా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థను బ్లాక్‌లిస్టింగ్ చేయాలంటూ HMWSSB సిఫార్సు చేసింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సిగ్గులేకుండా అటువంటి సంస్థకు మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బహుమానంగా ఇచ్చారు. రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కొందరి జేబులు నింపడం కోసం రూ.4,350 కోట్ల రూపాయలను వాళ్ళ చేతుల్లో పెట్టారు. కాంగ్రెస్ పార్గీ తమ కుబేరుల ఖజానా నింపుకోవడానికి తెలంగాణను ఏటీఎంగా వినియోగించుకుంటుంది’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

ప్రతిష్టాత్మకంగా ఎత్తిపోతల పథకం

అయితే కొడంగల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈప్రాజెక్ట్‌కు మొదటి దశలో రెండు ప్యాకేజీలుగా టెండర్లను పిలిచారు. ఈ టెండర్లకు బిడ్‌లు వేయడం కోసం మొత్తం నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌లకు ఎల్ అండ్ టీ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థల టెక్నికల్ బిడ్స్‌ ద్వారా ఆయా సంస్థల అర్హతలు, సాంకేతిక అంశాలను ఇంజినీర్లు పరిశీలించారు. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీఎల్ సంస్థలు అనర్హతకు గురయ్యాయి. ప్రైస్ బిడ్స్‌లో మిగిలిన రెండు సంస్థలు చెరో ప్యాకేజీని సొంతం చేసుకున్నాయి. అర్హత సాధించిన సంస్థల వివరాలను మహబూబ్‌నగర్ నీటి పారుదల శాఖ ముఖ్య ఇంజినీరు.. కమిషనర్ ఆఫ్ టెండర్స్ ఆమోదానికి పంపనున్నారు. ఆ తర్వాత టెండర్ అగ్రిమెంట్ ఖరారు కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.4,350 కోట్ల వ్యవయంతో చేపట్టనుంది ప్రభుత్వం. ఈ టెండర్లపై కేటీఆర్ తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story