బీఆర్ఎస్ పాతాళానికి.. ఎన్నికలపై రాజగోపాల్ రెడ్డి జోస్యం
x

బీఆర్ఎస్ పాతాళానికి.. ఎన్నికలపై రాజగోపాల్ రెడ్డి జోస్యం

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఉత్కంఠ తీవ్రంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని రుచి చూసిన బీఆర్ఎస్.. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని..


తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ఉత్కంఠ తీవ్రంగా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని రుచి చూసిన బీఆర్ఎస్.. ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమంటు ఎన్నికల్లో కూడా తామేంటో చూపించుకోవాలని కాంగ్రెస్ ఉబలాటపడుతోంది. ఎలాగైనా తెలంగాణలో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోక్‌సభ పోరు ఈ మూడు పార్టీల మధ్య వాడివేడిగా సాగుతుందని ప్రజలంతా భావిస్తున్నారు. కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం వేరేలా ఉందని, పార్లమెంటు ఎన్నికల రేసులో రెండే పార్టీలు ఉన్నాయని అంటున్నారు. పోటీతో పాటు గెలుపోటములు కూడా ఆ రెండు పార్టీల్లోనే ఉంటాయిన జోస్యం చెప్పారాయన. తన పుట్టినరోజు సందర్బంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా మధ్యే పోటీ

తెలంగాణలో ఎన్నికల వేడి బాగానే ఉందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే అసలు పోటీ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధఃపాతాళానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాన సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ ఘన విజయం సాధించారు. రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రజలు సరైన నిర్ణయమే తీసుకుంటారని భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పుంజుకుంటుంది. ఈసారి గెలవడం బీజేపీకి అంత ఈజీగా లేదు’’ అని జోస్యం చెప్పారు రాజగోపాల్‌రెడ్డి.

బీఆర్ఎస్ సోదిలో కూడా లేదు

బీఆర్ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు రాజగోపాల్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా కేంద్రం ఇండియా కూటమి, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేదని అన్నారు. ‘‘ఎన్నికల ప్రారంభంలో దేశవ్యాప్తంగా బీజేపీ, మోదీ హవా నడిచింది. కానీ అత్యంత త్వరగానే వాళ్ల అసలు రంగ ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు ఎప్పుడైనా ప్రజల పక్షాన నిల్చునేది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమే అని నమ్మారు. ఇప్పుడు దేశమంతా ఇండియా కూటమి హవా నడుస్తోంది. బీజేపీకి ఓటమి తథ్యం’’ అంటూ తీవ్రంగా స్పందించారు.

ఆంధ్రలో అదే పరిస్థితి

శ్రీవారి దర్శనం అనంతరం ఏపీ ఎన్నికలపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆంధ్ర పరిస్థితి తనకు ఏమీ అర్థం కావట్లేదున్నారు. ఈసారి ఆంధ్ర ప్రజల నాడీని అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కావట్లేదని చెప్పారు. ‘‘ఆంధ్ర ఎన్నికల విజేతపై భారీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ సర్వేలో కూడా ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది స్పష్టం కాలేదు. ఎన్నికల విషయంలో ప్రజలు ఇంత స్తబ్దుగా ఉండటం ఇదే తొలిసారి చూస్తున్నా. ఈ పరిస్థితుల వల్లే ఆంధ్ర ఎన్నికల్లో విజేత ఎవరు అన్నది నేను కూడా అంచనా వేయలేకపోతున్నా’’ అని మనసులో అనుకున్నది బయటపెట్టారు.

Read More
Next Story