జూబ్లీహిల్స్ హోరాహోరీ పోరులో కాంగ్రెస్ సునాయాస విజయం
x
Congress candidate Naveen yadav receiving winning certificate from Election Officials

జూబ్లీహిల్స్ హోరాహోరీ పోరులో కాంగ్రెస్ సునాయాస విజయం

బీఆర్ఎస్ అభ్యర్ధి(Maganti Sunitha)మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్(Naveen Yadav)24,729 ఓట్ల మెజారిటీతో గెలిచాడు


హోరాహోరీగా ప్రచారంజరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. శుక్రవారం ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్ధి(Maganti Sunitha)మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్(Naveen Yadav)24,729 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మూడోప్లేసులో నిలిచిన బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ కూడా గల్లంతయ్యింది. నవీన్ కు 98,945 ఓట్లు రాగా, సునీతకు 74,259 ఓట్లు, దీపక్ కు 17,061 ఓట్లు వచ్చాయి. 4.01 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో పోలైన ఓట్లు 1,95,527 మాత్రమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాధ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకనే ఇపుడు ఉపఎన్నిక జరిగింది. అంటే బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ సీటును ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్ లాగేసుకున్నట్లు అనుకోవాలి. ఇలా జరగటం రెండోసారి.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంఎల్ఏగా గెలిచిన బీఆర్ఎస్ నేత లాస్య నందిత మరణించింది. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన లాస్య నివేదితపై కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 39 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదు. కంటోన్మెంట్ ఉపఎన్నికలో గెలుపుతో బోణికొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా అదే ఒరవడి కంటిన్యు చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంటోన్మెంట్ లో కాని జూబ్లీహిల్స్ లో కాని బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అచ్చిరాక రెండింటిలోను ఓడిపోయింది.

కాంగ్రెస్ కు విజయం ఏమంత తేలిగ్గా దక్కలేదు. అభ్యర్ధిగా నవీన్ ఎంపిక నుండి ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ వరకు అన్నీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తానై నడిపించాడు. బ్యాలెట్ లో అభ్యర్ధులుగా ఉన్నది నవీన్-సునీతే అయినా క్షేత్రస్ధాయిలో మాత్రం పోటీ రేవంత్-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే అన్నట్లుగా సాగింది. మూడువారాల ప్రచారంలో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ ప్రభుత్వంపై చేయని ఆరోపణలు, విమర్శలు లేవు. అయినా రేవంత్ మాత్రం తిరిగి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ తదితరులపై రెచ్చిపోకుండా సంయమనం పాటించారు. తనతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో పాజిటివ్ ప్రచారం చేయించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఎక్కువగా ప్రచారంచేశారు.

నియోజకవర్గంలో అత్యధికంగా రెండు సామాజికవర్గాలకు ఓట్లున్నాయి. బీసీల ఓట్లు 1.30 లక్షలు, ముస్లింల ఓట్లు 1.20 లక్షలున్నాయి. కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ తదితర సామాజికవర్గాల ఓట్లు మిగిలినవి. సామాజికవర్గాల ఓట్లలో బీసీ, ముస్లింల ఓట్లలో కాంగ్రెస్ కు మెజారిటి ఓట్లుపడటంలో రేవంత్ చక్రంతిప్పారు. బీసీ అభ్యర్ధిగా నవీన్(యాదవ)ను ఎంపికచేయటంలోనే కాంగ్రెస్ పార్టీకి సగం విజయం దక్కినట్లయ్యింది. కారణం ఏమిటంటే తెలంగాణలో ఇపుడు బీసీ వాదన చాలా బలంగా వినబడుతోంది. అందులోను నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 35 వేలున్నాయి. బీసీలతో పాటు యాదవుల ఓట్లు, ముస్లింల ఓట్లలో మెజారిటి పడటంతోనే నవీన్ విజయం సునాయాసమైంది. పై రెండు సామాజికవర్గాలతో పాటు ఇతర సామాజికవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు ఓట్లు సానుకూలమవ్వటంతోనే మెజారిటి 24,571 వచ్చింది.

నియోజకవర్గంలో ఓటమి బీఆర్ఎస్ అభ్యర్ధి సునీతకన్నా కేటీఆర్ కు ఎక్కువ డ్యామేజీ జరుగుతుందనటంలో సందేహంలేదు. కారణం సునీత ఫుల్ టైం రాజకీయ నేత కాదు. భర్త గోపీనాధ్ మరణంతో ఆమె ఉపఎన్నికలో పోటీచేసిందంతే. గోపీ మరణంతాలూకు సానుభూతి ఓట్లతో ఈజీగా గెలవచ్చని అనుకున్న కేసీఆర్ అభ్యర్ధిగా గోపి భార్య సునీతను రంగంలోకి దింపారు. అభ్యర్ధిని దింపారు కాని కేసీఆర్ మాత్రం ప్రచారంలోకి దిగలేదు. ప్రచారం, ఎలక్షనీరింగ్ మొత్తాన్ని కేటీఆర్ ఒక్కళ్ళే మోయాల్సొచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ కు రేవంత్ మరోవైపు బీఆర్ఎస్ కు కేటీఆర్ నాయకత్వం వహించారు. అయితే చివరకు రేవంత్ ముందు కేటీఆర్ ఏవిధంగా కూడా నిలవలేకపోయారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా జనాలు నమ్మలేదని తేలిపోయింది.

ఒంటరైన కేటీఆర్

ఎన్నికల యుద్ధంలో కేటీఆర్ ఒంటరైపోయారు. చెల్లెలు కల్వకుంట్ల కవితను పార్టీ సస్పెండ్ చేయటంతో ఆమె వేరుకుంపటి పెట్టుకుంది. ప్రచారం ఊపందుకుంటున్న దశలో తండ్రి చనిపోవటంతో హరీష్ రావు ఉపఎన్నికకు దూరమయ్యారు. కేసీఆర్ అసలు ఫామ్ హౌస్ నుండి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేదు. దాంతో కేటీఆర్ ఒంటరైపోయి చివరకు ఫెయిలయ్యారు.

ఇక పోటీలో ఉన్న మూడోపార్టీ బీజేపీ మొదటినుండి అన్నింటిలోను వెనకబడిపోయింది. అభ్యర్ధి ఎంపికలో కూడా చాలా జాప్యం జరిగింది. అలాగే నామినేషన్ వేసిన తర్వాత కూడా దీపక్ రెడ్డి ప్రచారం ఊపందుకోలేదు. దీపక్ తరపున కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు చేసిన ప్రచారం ఎవరినీ ఆకట్టుకోలేదు. అందుకనే చివరలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగాల్సొచ్చింది. బండి నాలుగురోజులు ప్రచారం చేశారు. తన ప్రచారంలో హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టాలని బండి చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. దాంతో చివరకు దీపక్ చివరకు ఓడిపోయారు. 2023 సాధారణఎన్నికల్లో సుమారు 26 వేల ఓట్లు తెచ్చుకున్న దీపక్ ఇపుడు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

ఎంఐఎం పాత్ర

కాంగ్రెస్ విజయంలో ఏఐఎంఐఎం పాత్ర గణనీయంగా ఉందనే చెప్పాలి. నిజానికి నవీన్ ఒకపుడు ఎంఐఎంలో కీలక నేత. అలాంటిది 2023 ఎన్నికల్లోనే ఎంఐఎంను వదిలేసి నవీన్ కాంగ్రెస్ లో చేరారు. అందుకనే నవీన్ కు మద్దతుగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంపూర్ణంగా మద్దతివ్వటమే కాకుండా స్వయంగా ప్రచారం కూడా చేశారు. నియోజకవర్గంలోని 1.20 లక్షల ముస్లింల ఓట్లలో మెజారిటి ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా పడటంలో ఎంఐఎం పాత్ర కీలకంగా ఉంది. పోలింగ్ రోజున ఎంఐఎం శ్రేణులు కొన్ని డివిజన్లలో రెచ్చిపోయి కాంగ్రెస్ కు అనుకూలంగా ఓట్లు వేయించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ కు చివరినిముషంలో మంత్రిపదవి ఇవ్వటం కూడా కాంగ్రెస్ పట్ల ముస్లింలు సానుకూలమయ్యారనే చెప్పాలి.

కమ్మ ఓట్లూ కీలకమే

బీసీ, ముస్లింలను పక్కనపెట్టేస్తే మిగిలిన సామాజికవర్గాల్లో కమ్మ ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. ఈ ఓట్లలో మెజారిటి ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయనే అనుకోవాలి. కారణం ఏమిటంటే 2023 ఎన్నికల్లో కమ్మ ఓట్లు సాలిడ్ గా బీఆర్ఎస్ కు పోలయ్యాయి. అలాంటిది ఇపుడు కమ్మ ఓట్లలో మెజారిటి కాంగ్రెస్ కు పడేట్లుగా రేవంత్ చక్రంతిప్పారు. ఎలాగంటే చంద్రబాబుతో రేవంత్ కు అత్యంత సన్నిహితముంది. అలాగే కమ్మ సామాజికవర్గంలో కీలక నేతైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రేవంత్ ప్రయోగించారు. కమ్మోరిలోని ప్రముఖులతో రేవంత్ భేటీకి తుమ్మలే చొరవచూపించారు. అలాగే కమ్మోరి ప్రయోజనాలను కాపాడుతానని, అభిమానుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రీవనంలో ఏర్పాటుచేస్తానని రేవంత్ ఇచ్చిన హామీ కారణంగా కమ్మ ఓట్లు కాంగ్రెస్ కు పడటంలో బాగా కీలకమైంది.

పెరిగిన రేవంత్ పట్టు

జూబ్లీ గెలుపుతో రేవంత్ పట్టు పెరిగిందనే చెప్పాలి. రేవంత్ పనైపోయిందని ఎవ్వరూ లెక్కచేయటంలేదన్న కేటీఆర్ విమర్శలకు ఇక చెక్ పడినట్లే. తాజా విజయంతో పార్టీ, ప్రభుత్వంపై రేవంత్ పట్టు పెరుగుతుంది అనటంలో సందేహంలేదు. రేవంత్ పట్టు విషయంలో అధిష్ఠానానికి కూడా ఇదొక సంకేతమనే చెప్పాలి. రేవంత్ వ్యతిరేకులు కనీసం కొంతకాలమైనా మౌనంగా ఉండకతప్పదు.

రేవంత్ స్ట్రాంగ్ : శ్రీనివాసులు

తాజా గెలుపుతో పార్టీ, ప్రభుత్వంలో రేవంత్ బలోపేతమైనట్లు ఉస్మానియా యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కే శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. తాజా గెలుపుతో తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో రేవంత్ పనిచేస్తాడని చెప్పారు. అలాగే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు తక్కెళ్ళపల్లి కుమార్ రావు మాట్లాడుతు జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ కు వ్యక్తిగత గెలుపన్నారు. అభ్యర్ధి ఎంపిక దగ్గర నుండి ప్రచార బాధ్యతలు, ఎలక్షనీరింగ్ వరకు అన్నింటిలోను రేవంత్ ముద్ర కనబడిందని చెప్పారు.

తాజా ఎన్నిక ఫలితంతో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పట్టు సడలుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విజయానికి తోడు తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు భవిష్యత్తులో కష్టాలు తప్పవనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Read More
Next Story