Congress | కాంగ్రెస్‌లో ఆరని వర్గపోరు మంటలు!
పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఉద్రిక్తత. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు. రాజీనామా చేయాలంటూ డిమాండ్.
కాంగ్రెస్ పార్టీలు చీలికలు వస్తున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ ముక్కలు కాబోతోందా? నేతలు ఎవరి దారి వారు చూసుకుంటారా? క్షేత్రస్థాయి నుంచే వర్గాలుగా విడిపోతున్నారా? అంటే ప్రస్తుత వాతావరణం అవుననే చెప్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమవుతూనే ఉన్నాయి. ఒకచోట వివాదాలు సర్దుమణిగితే మరొక చోటు ప్రారంభమవుతున్నాయి. బుధవారం యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో కొట్టుకుంటే గురువారం పటాన్‌చెరు కాంగ్రెస్‌లో వర్గపోరు మొదలైంది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పార్టీ పెద్దలు ఘంటాపథంగా చెప్తున్నా పార్టీ శ్రేణులు మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకర కలబడుతున్నారు. పార్టీ శ్రేణుల తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. బీజేపీ, బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి చేసిన సందర్భాల్లో కూడా ఇటువంటి దాడులు సరైన పద్దతి కాదని కాంగ్రెస్ నేతలు వారించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో నడుచుకోవాలని చెప్పారు. పార్టీ శ్రేణులు మాత్రం వారి మాటలను తలకెక్కించుకున్నట్లు కనిపించడం లేదు. ఇందుకు ఈరోజు పటాన్‌చెరులో జరిగిన ఘటన అద్దం పడుతోంది.
ఎమ్మెల్యేకు వ్యతిరేకం
కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. పటాన్‌చెరులో ఆయన పర్యటనకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించి కొంతకాలానికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సదరు నేత.. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రెండు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో మహిపాల్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ ఫొటోనే ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఆఫీసులో రేవంత్ ఫొటో పెట్టడం ఇష్టం లేకుంటే పార్టీ నుంచి తప్పుకోవాలని, బీఆర్ఎస్ పంచనే మళ్ళీ చేరాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పటాన్‌చెరువులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్రుతమైన వర్గపోరు
కాగా కాంగ్రెస్ శ్రేణులు మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేస్తుండగా మహిపాల్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిపాల్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడతారని వారు అన్నారు. దీంతో మహిపాల్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, అది కాస్తా వివాదంగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని సమాచారం. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను విడగొట్టారని, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అంశంపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.