బీజేపీ ఎంపీపై కోర్టు ధిక్కరణ నోటీసులు
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టేట్లుగా ఎంపీ మాట్లాడారని హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణాలో బీజేపీ మెదక్ ఎంపీ రఘునందనరావుపై హైకోర్టు సూమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టేట్లుగా ఎంపీ మాట్లాడారని హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చేసుకుని చీఫ్ జస్టిస్ ఆదేశాల ప్రకారం ఎంపీపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. కూల్చివేతలకు వ్యతిరేకంగా సెంటర్ యజమాని అక్కినేని నాగార్జున హైకోర్టులో పిటీషన్ వేశారు. దాన్ని విచారించిన సింగిల్ జడ్జి కూల్చివేతపై స్టే ఇచ్చారు. ఆ ఉత్తర్వులనే ఎంపీ తప్పపట్టారు.
మీడియాతో అప్పట్లో ఎంపీ మాట్లాడుతు కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేయాలని 2014లోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. 2014లోనే కూల్చేయాలని ఆదేశాలిచ్చిన సెంటర్ పై 2024లో సింగిల్ జడ్జి స్టే ఇవ్వటం ఏమిటని ఎద్దేవా చేశారు. జ్యుడీషియల్ వ్యవస్ధ విరుద్ధమైన ఉత్తర్వులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైకోర్టు ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకుని ఉండకూడదని అభిప్రాయపడ్డారు. సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చేటపుడు గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి ఉండాల్సిందన్నారు. అప్పట్లోనే సింగిల్ జడ్జి తీర్పుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పైగా న్యాయవ్యవస్ధపై మాట్లాడే స్వేచ్చ తనకుందని కూడా రఘునందనరావు సమర్ధించుకున్నారు.
ఎంపీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలన్నింటినీ ఇపుడు తాజాగా జడ్జి చీఫ్ జస్టిస్ కు చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారు. న్యాయవ్యవస్ధ ప్రతిష్టను, గౌరవాన్ని తగ్గించేట్లుగా ఎంపీ వ్యాఖ్యలు చేసినట్లు జడ్జి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ్జి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అలోక్ అరాధే, జే. శ్రీనివాసరావు ధర్మాసనం సుమోటోగా కోర్టు ధిక్కరణకు ఎంపీ పాల్పడినట్లు నిర్ణయానికి వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎంపీకి ద్విసభ్య ధర్మాసనం నోటీసులు జారీచేసింది. మరి ఎంపీ తన వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.