
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీం కోర్టులో ధిక్కార పిటిషన్
మూడు నెలల్లోపు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై సుప్రీం కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మూడు నెలల్లోపే చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీం కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోలేదని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ పిటిషన్‌పై ఈ నెల 17న విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 17న లిస్ట్ చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశించారు. అయితే ప్రతివాదులు కావాలనే విచారణను తాత్సారం చేస్తున్నారని కేటీఆర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 23న జస్టిస్ గవాయ్ పదవీ విరమణను బిఆర్ ఎస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.నవంబర్ 24 తర్వాత సుప్రీంకోర్టు మూసివేయబడదు అని జస్టియ్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అనర్హత పిటిషన్ పై బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు స్వీకరించాలని న్యాయవాది అభ్యర్థించారు. విచారణకు స్వీకరించడం లేదని,అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు.
2023 అసెంబ్లీ ఎన్నికలు బిఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వీరిపై అనర్హత పిటిషన్ వేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ గతంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

