అవినీతి అడ్డాలు ఈ కార్యాలయాలు!  30 రోజులు- ఏడుగురు అధికారులు..
x
ఏసీబీ పట్టుకున్న నగదు...

అవినీతి అడ్డాలు ఈ కార్యాలయాలు! 30 రోజులు- ఏడుగురు అధికారులు..

తెలంగాణలో సర్కార్ మారిన తర్వాత ఏసీబీ హడావిడి ఎక్కువైంది.. కొత్త మోజా, నిజంగా అవినీతి అధికారుల భరతం పట్టడమా.. మొత్తానికి ఏసీబీ దూకుడైతే పెంచింది..


తెలంగాణలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయా? లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారంటూ ఏసీబీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి! సర్కారు మారినప్పుడల్లా ఉండే హాడావిడేనా? లేక నిజంగానే అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచిందా? చేసిన పనికి జీతం తీసుకుంటున్నా... ప్రజల్ని లంచం పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి తిమింగలాలను ఏసీబీ కట్టడి చేస్తుందా? వీటన్నింటికి సమాధానమే.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు అవినీతి అధికారులను వలపన్ని పట్టుకోవడం.

ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు కొందరు అవినీతికి బాగానే మరిగినట్టున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేయాల్సిన వారే.. లంచాల కోసం ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. దీంతో వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల భరతం పట్టే పనిలో పడింది అవినీతి నిరోధక శాఖ. కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో ఏడుగురు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.

లంచం తీసుకోవడమెందుకు, ఏడుపెందుకు?

హైదరాబాద్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జ్యోతి ఏసీబీ వలలో చిక్కారు. మసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గంగన్న అనే వ్యక్తి నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేశారు. దీంతో ఆమె లబోదిబోమంటూ ఏడుపుకి లంకించుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయారు. లంచం తీసుకునేటప్పుడు ఉండాల్సిన ఈ ఆలోచన తీరా దొరికిన తర్వాత చేస్తే ఎలా? అని పలువురు ఆక్రోశం వెళ్లగక్కినా.. అదే నిజం. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు 65 లక్షల రూపాయల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. అంతేకాదు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జ్యోతికి ఓపెన్ ప్లాట్లతోపాటు వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఆస్తుల విలువ నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇక.. ఈ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టు జ్యోతికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

భారీ తిమింగలమంటే అతడే...

అంతకుముందు HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఆయన.. అనుమతుల పేరిట వందల కోట్లు సంపాదించినట్లు వెల్లడైంది. తమ పేరుపైనే కాకుండా.. బినామీల పేరిట భూములు, విల్లాలు రాయించి కోట్లకు పడగలెత్తారు శివబాలకృష్ణ. ఈ కేసులో బాలకృష్ణతోపాటు ఆయన సోదరుడు శివ నవీన్‌కుమార్‌ను కూడా అరెస్ట్‌ చేసింది ఏసీబీ. అయితే.. ఈ అక్రమాస్తుల వ్యవహారంలో ఇంకా చాలా మంది పెద్దల హస్తం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.

నల్లగొండలో ఆ ఇద్దరు...

ఇక నల్లగొండ జిల్లాలో ఒకే నెలలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. దేవరకొండ మండలం కొండమల్లేపల్లి ఆర్‌ఐ సర్వే నంబర్‌ మార్చేందుకు 30 వేల లంచం డిమాండ్‌ చేశారు. ఈనెల 8న రైతు బాణావత్‌ లచ్చు నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే.. నల్లగొండ జీజీహెచ్‌ సూపరింటెండ్‌ లచ్చునాయక్‌ సైతం ఈనెల 16న ఏసీబీకి చిక్కారు. సర్జికల్‌ ఐటమ్స్‌ను నాన్‌ టెండర్‌ విభాగంలో మంజూరు చేసేందుకు 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఇక... సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పంచాయతీరాజ్‌ ఏఈఈ కోసూరి రంగరాజు సైతం 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గ్రామాల్లో విద్యుత్ దీపాలు అమర్చినందుకు తనకు రావల్సిన డబ్బులను అడిగిన ధరావత్‌ కృష్ణ నుంచి లంచం తీసుకున్నారు ఈ అధికారి.

పట్టాదార్ పాస్ పుస్తకానికి రూ.30 లక్షలా?

ఈనెల 13న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ ఏసీబీ ట్రాప్‌లో చిక్కారు. ఓ భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌బుక్‌ ఇచ్చేందుకు 30 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు తహసీల్దార్‌ సత్యనారాయణ. ఇందులో 10 లక్షల రూపాయలు తహసీల్దార్‌కు అందజేసిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో తహసీల్దార్‌తోపాటు ఆయన డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.

పాపం ఓల్డ్ సిటీలోనూ అదే తీరు..

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు దూద్‌బౌలి ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అమీర్‌ ఫరాజ్‌. రెండు రిజిస్ట్రేషన్ల కోసం 2 లక్షలు కావాలని అమీర్‌ ఫరాజ్‌ డిమాండ్‌ చేయడంతో... బాధితుడు సయ్యద్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు.. తన అనుచరుడి ద్వారా లంచం తీసుకుంటుండగా ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలా వరుసగా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. వరుస ఏసీబీ దాడులతో రాష్ట్రంలోని అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది.


Read More
Next Story