కేసీఆర్ సర్కార్.. గొర్రెల్నీ వదల్లేదా....
x
విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలో రేవంత్, సీఎస్ శాంత కుమారి

కేసీఆర్ సర్కార్.. గొర్రెల్నీ వదల్లేదా....

30 రోజుల టైంలో మూడు శాఖలకు తాకీదులు, ముగ్గురు అధికారులకు మెమోలు.. కేటీఆర్ పేషీలో కీలక అధికారి అరవింద్ కి నోటీసులు ఇచ్చి మూడు రోజులు కాకముందే మరో రెండు శాఖలకు..


వినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతిని పక్కనపెట్టాలని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలకు నడుంకట్టారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవమైన డిసెంబర్ 9 కి కొంచెం ముందు అధికారాన్నిచేపట్టిన ఆయన చేసిన ప్రతిజ్ఞ అవినీతిని సహించనని. దానికనుగుణంగానే గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా ఆరా తీస్తున్నారు. తీగలాగడం ప్రారంభించారు.

2023 డిసెంబర్ 21.. అసెంబ్లీ వేదికగా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై న్యాయవిచారణకు అసెంబ్లీ వేదికగా న్యాయవిచారణకు ఆదేశాలు..

2024 జనవరి 6... ఫార్ములా-ఇ (ఎలక్ట్రానిక్) కార్ల రేసుకు ఎటువంటి అనుమతులు లేకుండా ఎందుకు రూ.56 కోట్లు ఇవ్వాల్సివచ్చిందో చెప్పాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ పేషీలో కీలక ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ కి నోటీసులు..

2024 జనవరి 8... బాహుబలి ప్రాజెక్ట్ గా చెప్పిన కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై ఇరిగేషన్ శాఖా కార్యాలయాలపై పలు చోట్ల దాడులు, రికార్డులు స్వాధీనం..

2024 జనవరి 9.. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో అద్భుతం జరిగిందన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలోనూ భారీ అవినీతి జరిగిందని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన..

ఇలా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్టు ఆరోపిస్తున్న అన్ని అవకతవకలను బయటపెడతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ముందు నుంచి ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించి విచారణలను పరుగులు తీయించాలని చూస్తోంది.

గొర్రెల పంపిణీలోనూ అక్రమాలా...





ఇక గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు మొదలైంది. పశుసంవర్ధక శాఖలో ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, మరికొందరు రూ. 2.10 కోట్లకుపైగా గోల్‌మాల్‌ చేశారంటూ బాధితులు సైబరాబాద్‌ పోలీ్‌సలకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత నేపథ్యంలో ఇటీవలే ఏసీబీ రంగంలోకి దిగింది. త్వరలోనే గోల్‌మాల్‌ వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేల్చే పనిలోపడింది. ఈ కేసుతోపాటు పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మా యంపైనా ఏసీబీ దృష్టిసారించనుంది.

విజిలెన్స్ చేతిలో మేడిగడ్డ బ్యారేజ్ ఫైళ్లు..

రాష్ట్రంలో జరిగిన అక్రమాలను వెలికితీసేదిశలో అడుగులు వేస్తోంది. ప్రస్తుతం విజిలెన్స్‌ విచారణ జరుపుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ వ్యవహారంలోనూ త్వరలోనే ఏసీబీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఫైళ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. విజిలెన్స్‌ నివేదిక, ప్రభుత్వ పరిశీలన తర్వాత తదుపరి ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగనుంది.

విద్యుత్ కొనుగోళ్లపై దృష్టి..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్తు కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ‘విద్యుత్తు కొనుగోలు ఒప్పందం’(పీపీఏ), దాని వెనుక ఉన్న కారణాలతో పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా ఆదేశించారు. 2014 నుంచి 2023 వరకూ రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లు, విద్యుదుత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాలు, చెల్లించిన ధరలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలు, వాటిలోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కువ ధర చెల్లించేలా కొనుగోలు ఒప్పందాలు జరిగితే, వాటి వెనుక ఉన్న అసలు కారణాలేమిటో కూడా నివేదించాలన్నారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్తు విక్రయిస్తున్నారో లోతుగా పరిశీలించి.. వారి నుంచే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

కరెంటు దుర్వినియోగాన్ని అరికడతారా..

కరెంటు దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది రేవంత్ సర్కార్ నిర్ణయాల్లో ఒకటి. అయితే అదంత సాధ్యమా అనేది చర్చనీయాంశం. సరఫరాలో నాణ్యతను పెంచి, దుబారాను అరికట్టేలా చర్యలకు ఉపక్రమించారు. నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం జెన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర సంస్థల నుంచి కొనుగోళ్లు, రాష్ట్రంలో డిమాండ్‌, సరఫరా, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరును అధికారులు దృష్టి సారించారు.

ఏసీబీకి కొత్తరక్తం ఎక్కించి...

ప్రస్తుతం ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు సిబ్బందిలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. విజిలెన్స్‌ విభాగం ఇంతకాలం ఇన్‌చార్జుల పాలనలోనే కొనసాగింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్న అధికారే విజిలెన్స్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించేవారు. రేవంత్‌ సర్కారు మాత్రం విజిలెన్స్‌ విభాగానికి పూర్తిస్థాయి అధికారిని నియమించింది. ఇప్పుడు ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల్లో సిబ్బంది కొరతపై దృష్టి సారించింది. ముఖ్యంగా డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు సరిపడాలేరు. ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ స్థాయి అధికారులు, కోర్టుల్లో కేసులు వీగిపోని విధంగా బలమైన చార్జిషీట్లు, నిందితులకు బెయిల్‌ రాకుండా శక్తిమంతమైన కౌంటర్లు వేసే దర్యాప్తు అధికారుల కొరత కొనసాగుతోంది. చాలామంది డెప్యూటేషన్లపై వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. దీంతో ఏసీబీలో పూర్తిస్థాయి సిబ్బందిని భర్తీ చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విచారణలు కొలిక్కివచ్చేదెప్పుడు...

ఇప్పుడున్న వేగం చూస్తుంటే పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ కేసుల్ని ఒక కొలిక్కి తెచ్చి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, ఆయన మంత్రివర్గాన్ని అవినీతికి బాధ్యుల్ని చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధిపొందేందుకైనా బీఆర్ఎస్ పాలనలో జరిగినట్టు చెబుతున్న అవినీతిని బయటపెడుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Read More
Next Story