
విద్యుత్ శాఖలో అవినీతి తిమింగళాలు
కాంట్రాక్టర్లే రేట్ ఫిక్స్ చేస్తున్నారు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్న విద్యుత్ శాఖాధికారులు లంచాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు లక్షల జీతం ఉన్న విద్యుత్ శాఖాధికారులు సైతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు విద్యుత్ కనెక్షన్ కోసం వస్తే ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ శాఖాధికారులు కొందరు ప్రయివేటు కాంట్రాక్టర్లను నియమించుకుని లంచాల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారనే ఆరోపణలు మిన్నంటాయి. అసలు కంటే కొసరే ఎక్కువన్నట్టు పెద్ద పెద్ద భవంతులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే కుదరదు అని అధికారులు చెబుతున్నట్టు ప్రయివేటు కాంట్రాక్టర్లు ఎంట్రీ ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. వీళ్లు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారమందుతోంది.వినియోగదారులు బ్రతిమిలాడటంతో అధికారులను అడిగి చూస్తామని బుకాయిస్తూ లక్షలకు లక్షలు ముడుపులు స్వీకరించి ఎలక్రిసిటీ డిపార్ట్ మెంట్ కు కడుతుంది తక్కువే అని తెలుస్తోంది. మిగతా సొమ్మును విద్యుత్ శాఖాధికారులు కాంట్రాక్టర్లు పంచుకుంటున్నారనే ఆదారాలు అవినీతి శాఖాధికారులకు లభ్యమయ్యాయి.
బినామీ కాంట్రాక్టర్లే కాకుండా బినామి అధికారులు లంచాలసామ్రాజ్యంలో భాగస్వాములవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎడిఈగా పని చేస్తున్న అంబేద్కర్ వద్ద ప్రభుత్వ విద్యుత్ శాఖాధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎసిబి విచారణలో వెల్లడైంది. లంచాలు తీసుకోవడం నేరం అని ఈ అధికారులకు తెలుసు.చట్టాలు ఏమి చేస్తాయన్న ధీమాతో విద్యుత్ శాఖాధికారులు ఉన్నట్టు కనబడుతోంది. సతీష్ అనే విద్యుత్ అధికారి ఇంట్లో సోదాలు చేస్తే రెండు కోట్ల రూపాయలు లభ్యమయ్యాయి. ఇబ్రహీం బాగ్ డిస్కం ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ ఏడీఈగా పని చేసే అంబేద్కర్ వద్ద సతీష్ బినామీగా ఉన్న ప్రభుత్వోద్యోగి.
ఫిర్యాదులు పట్టించుకునే వారు లేరు
దక్షిణ తెలంగాణ డిస్కం ప్రధాన కార్యాలయంలో అవినీతి అధికారుల మీద ఫిర్యాదుచేయాలని ప్రత్యేక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ మీద ఫిర్యాదుచేసిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు 63 మందిపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ 19 మంది విద్యుత్ శాఖాధికారుల మీద మాత్రమే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.ఫిర్యాదు అందిన వెంటనే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
అంబేద్కర్ బినామీలే
చేవెళ్ల ఎడిఈ రాకేశ్ ఇంట్లో సోదాలు చేస్తే మరో రూ17లక్షల నగదు లభ్యమైంది. అవినీతి శాఖాధికారులు అడిగిన ప్రశ్నలకు రాకేశ్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో 17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవలె హైదరాబాద్ శివారులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లను విక్రయించింది. ఈ ప్లాట్లకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే విద్యుత్ శాఖ ఇంజినీర్ 13 లక్షల రూపాయలు అడిగినట్లు సమాచారం. కాంట్రాక్టర్ వద్దకు వెళితే 15 లక్షలు అడిగాడని వార్తలు వచ్చాయి. అనుమానం రావడంతో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి డిస్కం ప్రదాన కార్యాలయానికి వెళ్లి పరిచయం ఉన్న అధికారిని సంప్రదించాడు. కేవలం రూ 6. 70 లక్షలని శాస్త్రీయంగా అంచనావేస్తే తేలింది.
ఎనిమిదినెలల్లో 179 కేసులు నమోదు
ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో ప్రభుత్వాధికారులపై 179 అవినీతి కేసులు నమోదయ్యాయి.
ఎసిబి కేసులు నమోదైన ప్రభుత్వాధికారుల్లో విద్యుత్ శాఖాధికారులే ఎక్కువగా ఉన్నారు. ట్రాప్ కేసులు,క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు , రహస్య దర్యాప్తులు ఇలా విద్యుత్ శాఖాధికారులపైనే నమోదవుతున్నాయి. అవినీతి సొమ్ము ఆరగించడంలో విద్యుత్ శాఖాధికారులు ముందంజలో ఉన్నారనే ఆరోపణలు సర్వత్రావినిపిస్తోంది.
అక్రమ ఆస్తుల కేసులో అంబేద్కర్ వద్ద వద్ద 200 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు ఎసిబి అధికారులు గుర్తించారు. చిరుద్యోగిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో కెరీర్ ప్రారంభించిన అంబేద్కర్ ఉన్నతాధికారి హోదాలో కొనసాగుతున్నారు. ఎడిఈ హోదాలో 200 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి చివరకు కటకటాలపాలయ్యారు.ప్రస్తుతం ఎడిఈ అంటే అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ హోదాలో మాత్రమే ఉన్నారు. కాంట్రాక్టర్లు ప్రయివేటు సైన్యంగా మారి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
విద్యుత్ శాఖలో అవినీతి అంతం సాధ్యం కాదు
విద్యుత్ శాఖలో అవినీతి అంతం చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేయడానికి విద్యుత్ నెట్ వర్క్ అత్యంత ఆవశ్యం. ఈ నెట్ వర్క్ ఉంటే ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు వస్తున్నాయి. సెక్షన్ స్థాయి అధికారులు, లైన్ మెన్ లు లంచాలకు ఎగబెడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు వీరే కీలక పాత్ర పోషిస్తున్నారు. నిబంధనలను బేఖాతరుచేస్తూ కనెక్షన్ లు ఇచ్చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.