
నకిలి విత్తనాల దెబ్బకు పత్తిపంట నాశనం
40 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగుచేయాలంటే సుమారు 160 లక్షల కిలోల పత్తివిత్తనాలు అవసరం
పత్తిపంట సీజన్ మొదలవుతోందంటే చాలు నకిలీవిత్తనాల హవా మొదలవుతుంది. నకిలీ విత్తనాలు ప్రతి సీజన్లోను పత్తిపంటను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. నకిలీవిత్తనాల దెబ్బకు ప్రతిసీజన్లోను పత్తిపంట(Cotton Crop) ఏవిధంగా దెబ్బతింటోందో ప్రభుత్వానికి బాగా తెలుసు. అయినా సరే నకిలీవిత్తనాల(Fake Cotton Seeds) నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించటంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే పోయిననెల 24వ తేదీన మంచిర్యాలలో 214 కిలోల నకిలీ పత్తివిత్తనాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నకిలీ విత్తనాలను మార్కెట్లో అమ్ముతున్న ఎనిమిది మంది ఏజెంట్లతో పాటు రు. 6 లక్షలను కూడా పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ప్రతి ఏడాది పత్తి సీజన్ మొదలయ్యే ముందు ఇలాంటి నకిలీ విత్తనాలతో కంపెనీల తరపున ఏజెంట్లు మార్కెట్లోకి దిగబడటం చాలా మామూలైపోయింది.
తెలంగాణ మొత్తంమీద 40 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగుచేస్తారు. 40 లక్షల ఎకరాలంటే సుమారు 40 లక్షలమంది రైతులనే అనుకోవాలి. ఎకరా పత్తిపంట సాగుకు 4 కిలోల పారుపత్తి విత్తనాలు కావాలి. ఈలెక్కన 40 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగుచేయాలంటే సుమారు 160 లక్షల కిలోల పత్తివిత్తనాలు అవసరం. ఇన్ని లక్షల కిలోల విత్తనాలు అవసరం కాబట్టే చాలా కంపెనీలు నకిలీ విత్తనాలను ఉత్పత్తిచేస్తు మార్కెట్లో చెలామణి చేయిస్తున్నాయి. పత్తి విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీలన్నింటికీ లక్షల కిలోల విత్తనాలను ఉత్పత్తిచేసే సామర్ధ్యం ఉందోలేదో కూడా ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అందుకనే కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాల ఉత్పత్తినే టార్గెట్ గా పెట్టుకుని ఒరిజినల్ విత్తనాలకన్నా బాగుండేట్లుగా ప్యాకింగ్ లో రెడీచేసి మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి.
నాలుగునెలల పత్తిపంట సీజన్ ప్రతి ఏడాది జూన్ లో మొదలవుతుంది. సెప్టెంబర్ కల్లా సీజన్ ముగిసిపోతుంది. నాలుగునెలల పత్తిపంటసాగులో రైతులకు నాణ్యమైన పత్తివిత్తనాలను అందించటంలో ప్రభుత్వాలు ఫెయిలవుతున్నాయి. మామూలుగా అయితే పత్తివిత్తనాల్లోనే ఉత్పత్తి సంస్ధలు బీటీ3( బ్యాచులర్ ఆఫ్ టొరంజెస్)అనే క్రిమిని ప్రవేశపెడతాయి. దీన్నే వాడుకలో ‘బీటీ విత్తనాలు’(BT Seeds) అని అంటారు. ఈక్రిమి విత్తనాల్లో 90 రోజుల పాటు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పత్తి పంటకు పట్టే గొంగళిపురుగుతో పాటు ఇతర చీడపీడలను ఈ బీటీ అనే క్రిమి తినేస్తుంది. గొంగళిపురుగు, చీడ, పీడలను బీటీ క్రిమి తినేస్తుంది కాబట్టి పంట చక్కగా పెరుగుతుంది. అయితే ఈ బీటీ వల్ల శాస్త్రజ్ఞులు ఒక నష్టాన్ని కనుక్కొన్నారు. అదేమిటంటే బీటీ పంటవల్ల భూసారం దెబ్బతినేస్తోంది. అందుకనే ఇపుడు వాడుకలో ఉన్న బీటీ 3 విత్తనాలను ప్రభుత్వం బ్యాన్ చేసింది.
అందువల్ల రైతులకు బీటీ1, బీటీ2 రకాలైన విత్తనాలే మార్కెట్లో ఉన్నాయి. ఈరెండు రకాల విత్తనాలు భూసారానికి అంత హానికరం కాదు. అయితే నికిలీ విత్తనాల ఉత్పత్తే టార్గెట్ గా ఉన్న కొన్ని సంస్ధలు మాత్రం బీటీ3తో పాటు అసలు ఏమాత్రం నాణ్యతలేని విత్తనాలను యధేచ్చగా ఉత్పత్తి చేస్తు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. దీనివల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే పత్తివిత్తనాల్లో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అన్న విషయం కనుక్కోవటం రైతులకు కష్టం. విత్తనాలు విత్తిన తర్వాత పంటపండితే నాటిన విత్తనాలు నాణ్యమైనవని, పంట పండకపోతే విత్తిన విత్తనాలు నకిలీవని రైతులు గ్రహించగలరు. ఈ పాయింటను ఆధారంచేసుకునే కొన్ని సంస్ధలు తమ నకిలీ విత్తనాలను మార్కెట్లో చెలామణిలోకి తీసుకొస్తున్నాయి.
నకిలీ కంపెనీలపై పీడీ యాక్ట్ పెట్టాలి : మందడపు
ఇదే విషయాన్ని ఖమ్మంకు చెందిన పత్తిరైతు, మంచుకొండ ప్రాధమిక వ్యవసాయ సంఘం అధ్యక్షుడు, మందడపు సుధాకర్ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘నకిలీ పత్తివిత్తనాలు మార్కెట్ ను ఇష్టారాజ్యంగా ఏలుతున్న’ట్లు మండిపడ్డారు. ‘తమకు నాణ్యమైన విత్తనాలు కావాలని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటంలేద’న్నారు. పత్తి విత్తనాలు ఉత్పత్తిచేసే కంపెనీలు 400 వరకు ఉన్నట్లు చెప్పారు.‘నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తిచేసే కంపెనీలు ఏవి, నకిలీ విత్తనాలను ఉత్పత్తిచేసే కంపెనీలు ఏవన్న విషయం తెలుసుకోవటం కష్టమ’న్నారు. చాలా కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవప్మెంట్ విభాగాలే లేవన్నారు. ‘ఆర్ అండ్ డీ యూనిట్లు ఉంటేనే విత్తనాల ఉత్పత్తికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాల’ని డిమాండ్ చేశారు. ఒక ఎకరాలో పత్తిసాగుచేయాలంటే సుమారు 35 వేలు ఖర్చవుతుందన్నారు. ‘విత్తిన విత్తనాలు నాణ్యమైనవి అయితే పెట్టుబడి తిరిగొస్తుందని లేకపోతే రైతులకు నష్టాలే మిగులుతాయ’న్నారు. ‘నకిలీ విత్తనాలు ఉత్పత్తిచేసే కంపెనీలు, మార్కెట్ చేసే వారిపై ప్రభుత్వాలు పీడీ యాక్ట్ పెట్టాల’ని డిమాండ్ చేశారు.
ఒకపుడు కేసీఆర్(KCR) చెప్పిన సీడ్ క్యాపిటిల్ అంతా ఉత్తమాటే అని కొట్టిపడేశారు. దేశం మొత్తానికి తెలంగాణను సీడ్ క్యాపిటల్(Telangna Seed Capital) గా తయారుచేస్తానని కేసీఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ప్రకటన రాజకీయంగా పనికొస్తుందే కాని రైతులకు జరిగిన మేలు ఏమీలేదన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నారే కాని పత్తిరైతులకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదని మందడపు ఆవేధన వ్యక్తంచేశారు.
నకిలీయే ప్రధాన శతృవు : చల్లగొండ్ల
మంచుకొండకు చెందిన చల్లగొండ్ల వెంకటేశ్వర్లు అనే మరో రైతు మాట్లాడుతు ‘నకిలీ విత్తనాలు, గులాబి పురుగే పత్తిపంటకు ప్రధాన శతృవుల’న్నారు. గులాబిపురుగు కన్నా నకిలీ విత్తనాలే పత్తిపంటను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆవేధన వ్యక్తంచేశారు. ‘30 ఏళ్ళుగా పత్తిపంటను సాగుచేస్తున్న తనకు నికిలీ విత్తనాల సమస్య ఏమిటో బాగా తెలుస’న్నారు. విత్తకముందు పత్తివిత్తనాల్లో ఏది నకిలీ, ఏది నాణ్యమైనవో తెలీదన్నారు. ‘ప్రతి సీజన్ కు నెలరోజుల ముందు గుంటూరు జిల్లా నుండి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి విపరీతంగా చెలామణిలోకి వచ్చేస్తాయ’ని చెప్పారు. ‘మార్కెట్లోకి తక్కువ ధరల్లోనే దొరకటం, నాణ్యమైన విత్తనాలే అని ఏజెంట్లు నమ్మబలకటంతోనే రైతులు వాటిని కొనేస్తున్న’ట్లు చెప్పారు. అయితే ‘విత్తిన తర్వాత పంటపండకపోతే తాము మోసపోయినట్లు రైతులకు అర్ధమవుతుంద’ని చల్లగొండ్ల చెప్పారు. అప్పటికే రైతులకు జరగాల్సిన నష్టాలు జరిగిపోతాయని చెప్పారు. ‘సీజన్ కు ముందు నకిలీ విత్తనాలు మార్కెట్లో చెలామణి అవుతున్న విషయం ప్రభుత్వానికి తెలిసినా నియంత్రించటంలో విఫలమవుతున్నాయ’ని మండిపడ్డారు.