
పత్తి రైతులను ఆదుకోవాలి: కవిత
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీత
మోంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ముందుకు రావడం లేదని మంగళవారం తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. జనంబాటలో భాగంగా కవిత మంగళవారం ఆదిలాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పత్తిరైతులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, అమ్మడానికి వెళితే సిసిఐ( కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) తేమ పేరుతో పత్తిని కొనుగోలు చేయడం లేదన్నారు. సిసి ఐ ను నిలదీయాల్సిన ప్రజా ప్రతినిధులు మౌనంగా ఉండిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 20 శాతానికి పైగా తేమ ఉన్న పంటను కూడా సిసిఐ పూర్తి మద్దత్తుతో కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. నిబంధనల పేరిట రైతులను సిసిఐ ఇబ్బందులు పెడుతుందన్నారు.
చనాక-కొరటా బ్యారేజీ పనులను ఎందుకు నిలుపుదల చేసిందో ప్రభుత్వం చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు అంచనాలు పూర్తిగా పెంచారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చాక పనులను ఆపేశారని పేర్కొన్నారు. దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
6నుంచి పత్తి కొనుగోలు చేయం: జిన్నింగ్ మిల్లులు
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు  వ్యతిరేక విధానాలకు నిరసనగా జిన్నింగ్ మిల్లులు తెలంగాణ వ్యాప్తంగా  ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని హెచ్చరిక  జారీచేశాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు  బహిరంగ లేఖ రాశాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  అవలంబిస్తున్న అసమతుల్య అలాట్‌మెంట్,  స్లాట్‌బుకింగ్ విధానాలతో ఎతురవుతున్న సమస్యల గురిం  చి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కాంగ్రెస్  ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఈ నిర్ణయం  తీసుకున్నట్టు తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  స్పష్టంచేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మనేని రవీందర్‌రెడ్డి రాష్ట్ర  ప్రభుత్వానికి లేఖ రాసినట్టు మీడియాకు  వివరించారు.  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం  అనుసరిస్తున్న విధానాలపై రైతులు  ఆగ్రహంగా ఉన్నారని, సమస్యలను పరిష్కరించాలనే విచక్షణ  ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు.
షరతులతో పత్తి కొనుగోలు టెండర్లలో పాల్గొనేందుకు తెలంగాణ జిన్నింగ్ మిల్లులు యాజమాన్యాలు గతంలో అంగీకరించినప్పటికీ తాజా పరిణామల నేపథ్యంలో జిన్నింగ్ మిల్లులు పత్తిని కొనుగోలు చేయమని భీష్మించుకుని కూర్చున్నాయి. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లలో కొన్నింటికి సానుకూలంగా ఉన్న సీసీఐ మరికొన్ని అంశాలపై నవంబర్‌లో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. దీంతో టెండర్లలో పాల్గొనేందుకు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు తొలుత అంగీకరించాయి.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య పలు దఫాలు చర్చల ఫలితంగా జిన్నింగ్ మిల్లులు అంగీకారం తెలిపాయి. పత్తి కొనుగోళ్లలో సీసీఐ అమలుచేస్తున్న కొత్త నిబంధనల్లో జిన్నింగ్ మిల్లులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతివారం సమీక్షించి వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులకు మంత్రి సూచించారు.
మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చాకగానీ, తమకు కిసాన్ కపాస్ యాప్ గురించి తెలియదని కొందరు, ఒకవేళ తెలిసినా తమకు స్మార్ట్ ఫోన్లు లేవని మరో వైపు రైతులు ఆవేదన చెందుతున్నారు.

