కేసీయార్ కు మండలి ఛైర్మన్ గుత్తా ఊహించని షాక్
x
Revanth and Guttha in loan waiver programme

కేసీయార్ కు మండలి ఛైర్మన్ గుత్తా ఊహించని షాక్

ప్రభుత్వం శ్రీకారంచుట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో గుత్తా కూడా పాల్గొన్నారు.


తెలంగాణాలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈనెల 23వ తేదీనుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. అదే రోజు శాసనమండలి సమావేశాలు కూడా మొదలవుతాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి కారుపార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీల ఫిరాయింపులు మంచి జోరుమీదున్న నేపధ్యంలో బడ్జెట్ సమావేశాలు రెండుపార్టీల మధ్య చాలా హాటుహాటుగా జరుగుతాయనే ప్రచారం పెరిగిపోతోంది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కేసీయార్ కు బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఊహించని షాకిచ్చారు.

ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే ప్రభుత్వం శ్రీకారంచుట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో గుత్తా కూడా పాల్గొన్నారు. రైతురుణమాఫీ అంతా బూటకమని, నాటకాలని ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, సీనియర్ నేత, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు గోలచేస్తుంటే మరోవైపు అదే కార్యక్రమంలో గుత్తా పాల్గొనటం ఏమిటి ? అన్నదే అర్ధంకావటంలేదు. పైగా రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్ర తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గుత్తా కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలి ఛైర్మన్ వైఖరి చూస్తుంటే మానసికంగా బీఆర్ఎస్ నుండి దూరమైపోయినట్లే అనుమానంగా ఉంది. ఇఫ్పటికే ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

సాంకేతికంగా గుత్తా బీఆర్ఎస్ లోనే ఉన్నా మానసికంగా మాత్రం కాంగ్రెస్ నేతగానే చెలామణి అయిపోతున్నట్లున్నారు. అందుకనే పార్టీ లైనును ధిక్కరించి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామూలుగా అయితే బీఆర్ఎస్ నేతలెవరూ రైతురుణమాఫీకి మద్దతుగా మాట్లాడకూడదు. ఎందుకంటే రుణమాఫీ చేయటం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా ప్లస్ అయ్యే కార్యక్రమం. ప్రభుత్వపరంగా కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఇమేజిని పెంచే ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి కార్యక్రమంలో పార్టీ లైనుకు వ్యతిరేకంగా గుత్తా పాల్గొన్నారంటే అర్ధమేంటి ? గుత్తా వైఖరి కారణంగా కేసీయార్ నుండి కీలకనేతలంతా మండిపోతున్నారన్న విషయం అర్ధమైపోతోంది. కానీ గుత్తాను ఎవరూ ఏమీ చేయలేని, అనలేని స్ధితిలో పడిపోయారు. ఎందుకంటే అధికారంలో ఉన్నపుడే గుత్తాను కేసీయార్ పూర్తిగా దూరంపెట్టేశారు.

అపాయిట్మెంట్ కోసం గుత్తా ఎన్నిసార్లు ప్రయత్నించినా కేసీయార్ అవకాశం ఇవ్వలేదు. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే గుత్తాను మండలి ఛైర్మన్ గా కేసీయార్ తప్పించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. గుత్తాను తనంతట తానే కేసీయార్ దూరం చేసుకున్నారు. గుత్తా విషయంలో ఎందుకు అలా వ్యవహరించారంటే మూడోసారి కూడా బీఆర్ఎస్సే గెలుస్తుందని తాను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని కాబోతున్నానని కేసీయార్ అనుకున్నారు. అయితే కేసీయార్ ఊహించిన దానికి భిన్నంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అప్పటినుండి కేసీయార్ కు సమస్యలు మొదలైతే గుత్తా పెద్ద రిలీఫ్ గా ఫీలయ్యారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో సయోధ్య చేసుకున్నారు. ఎలాగూ టీడీపీలో ఉన్నప్పటినుండి రేవంత్ తో గుత్తాకు మంచి సన్నిహితముంది. దాన్ని అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ ను గుత్తా పూర్తిగా దూరంపెట్టేశారు. కాబట్టే కేటీయార్ అయినా మరోకరైనా గుత్తా వైఖరిని బహిరంగంగా తప్పుపట్టేస్ధితిలో లేరు.

ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించినా కారుపార్టీ నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. ఎంఎల్సీలపై అనర్హతవేటు పడాలంటే అందుకు నిర్ణయం తీసుకోవాల్సింది ఛైర్మన్ మాత్రమే. ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టుకు పోయినా, కోర్టు ఆదేశించినా జరిగేదేమీ ఉండదు. అందుకనే ఇపుడు ఫిరాయించిన ఆరుగురు ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలని పార్టీ నేతలు ఎన్నిసార్లు డిమాండ్లు చేస్తున్నా గుత్తా పట్టించుకోవటంలేదు. రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ తో కలిసి పాల్గొనటం ద్వారా గుత్తా తన వైఖరిని కేసీయార్ అండ్ కో కు చెప్పకనే చెప్పేసినట్లయ్యింది. మరి బడ్జెట్ సమావేశాల్లో ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story