దేశంలోనే రెండో అతిపెద్ద గణపతి విగ్రహం.... తెలంగాణలోనే
x
పరమేశునిగుట్ట. ఫోటో: రచయిత సౌజన్యం

దేశంలోనే రెండో అతిపెద్ద గణపతి విగ్రహం.... తెలంగాణలోనే

ఈ స్థానిక కథనాల ప్రకారం క్రీ.శ. 12వ శతాబ్ది చివరి దశాబ్దాలలో ఇక్కడి పార్వతీ పరమేశ్వర ఆలయాలు, విగ్రహాలు, తత్సంబంధిత గణపతి విగ్రహం ఏర్పాటయ్యాయి


ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి ఏకశిలా విగ్రహం తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపపు ఆవంచ గ్రామ శివార్లలో ఉన్న విషయం తెలిసిదే. కాగా ఇప్పుడు రెండో అతిపెద్ద గణపతి విగ్రహం కూడా తెలంగాణలోనే ఉందని తెలిసింది. ఈ విగ్రహం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కోనాపూర్ చీమలదరి - గంగారం - మల్లెపల్లి -

- మాందాపురం గ్రామాల సరిహద్దులలోని పరమేశునిగుట్ట పైన ఉంది. ఈ విషయాన్ని ఇటీవల అర్చకుడు జంగం పరమేశదాసు రచించిన "శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మానసపూజ" అనే పుస్తకంలో (పు. 55 - 59) కిందివిధంగా రాశాడు.

సీ॥ శ్రీ తెలంగాణలో శ్రీ కలల పచ్చని

సిరిసంపదలతోడ స్థిరముగాను

లక్షణాభావమౌ లక్ష్మీ కలలతోడ

సంగారెడ్డి యనె పట్టణంబు

ఆ పట్టణంబుకు నైరుతి దిశయందు

కొండపురము యనె మండలంబు

ఆ మండలంబుకు తూరుపు భాగాన

మల్లెపల్లి యనె గ్రామమందు

ఆ గ్రామమందున అతి భక్తిపరుడైన

అచల పరిపూర్ణుండు అవనియందు

తమ్మలి రామప్ప తత్వబోధ తెలిపి ...

విశ్వజనంబుతో స్థిరముగాను

మాంధాపురము జేరి మహా పర్వతంబున

శ్రావణంబున సోమవారమందు

సతి పార్వతియైన సదయహృదయుడైన

పరమశివుని భజన భక్తితోడ

నిండు పున్నమినాడు అందమలర

ఆనంద వైభవ గానంబుతోడను




జాతర ప్రారంభించాడని చెప్పాడు. అయితే గత మూడు దశాబ్దాలుగా శివరాత్రికి జాతర జరుగుతున్నది. ఈ గుట్టపైకి వందకు పైగా మెట్లు ఎక్కిన తరువాత పార్వతీ పరమేశ్వరుల గుహాలయాలున్నాయి. వాటి పైకి మరో యాభై మెట్లు ఎక్కి కొండ శిఖరం పైకి చేరుకునే మార్గమధ్యంలో ఒక కొండ కొమ్ముకు ఈ గణపతి విగ్రహం చెక్కి ఉంది.

సుమారు పదిహేను అడుగుల ఎత్తు, పన్నెండు అడుగుల వెడల్పుతో చెక్కిన ఈ గణపతి విగ్రహం రెండు కాళ్ళను సగం మలుచుకొని, పెద్ద పొట్టతో రెండు చేతులు పైకెత్తి ఆయుధాలు పట్టుకొన్నట్లుగా చిత్రించబడింది. ఏనుగు తలతో, కుడి దంతం విరిగినట్లుండగా తొండం ఎడమ వైపుకు తిరిగి మోదకాలు / లడ్డును తీసుకుంటున్నట్లుగా చిత్రించబడింది. ఏనుగు తలపై ఐదు అంతరాల కిరీటం, తల వెనుక ప్రభా మండలం చిత్రించబడ్డాడెయి. గణపతి ముందర క్రింద రెండు కాళ్ళ మధ్యలో చిట్టి ఎలుక చిత్రించబడింది. అయితే 1996 లో మాందాపురం గ్రామస్తుడు కమ్మరి నర్సింలు ఈ విగ్రహానికి సిమెంటు పూత పూసి నల్ల రంగు వేస్తున్న క్రమంలో విగ్రహానికి నాలుగు చేతులున్నట్లు, యజ్ఞోపవీతం ధరించినట్లు మార్పు చేసే ప్రయత్నం చేశాడు.

850 ఏళ్ళ చరిత్ర:

ఈ గణపతి ఉన్న ప్రాంతం పేరు కోనాపూర్. కోన అనే పదం ముడి ఇనుము మూసను (త్రికోణం) తెలిపే పదం. ఇనుమును చెంకల్ (ఎర్రరాయి / లేటరైట్ ) రాయి నుంచి తీసేవారు - సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి. ఈ గణపతిని చెక్కింది కూడా లేటరైట్ రాయికే. ఈ గణపతి ఉన్న గుట్ట, దీని

పక్కనున్న గుట్టలు కూడా ఎర్రరాయి గుట్టలే. ఇలా ఈ ప్రాంతానికి మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ గణపతి విగ్రహాన్ని చెక్కింది మాత్రం సుమారు 850 సంవత్సరాల కిందట అని స్థానిక స్థల పురాణం వల్ల స్పష్టమవుతుంది.

ఈ పరమేశుని గుట్టకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఎల్లకొండ ఉంది. అక్కడ ఇప్పుడు పార్వతీనాథుడైన సోమేశ్వర శివున్ని పూజిస్తున్నారు. నిజానికి ఆ శివ విగ్రహం 23వ జైన తీర్ధంకరుడు పార్శ్వనాధునిది. క్రీ.శ. 12 వ శతాబ్దం ద్వితీయార్ధం వరకు అక్కడ జైన మతమే వర్ధిల్లింది. ఆ శతాబ్దం మధ్యలో కర్ణాటకలోని కళ్యాణిలో బసవేశ్వరుడు లింగ, కుల భేదాలు లేని వీరశైవ మతశాఖను ప్రచారం చేయడంతో తదనంతరం వీరశైవ మతానుయాయులు విజృంభించి అప్పటికి మనుగడలో ఉన్న జైనులను, వారి బసదులను, ఆలయ విగ్రహాదులను ధ్వంసం చేసి వాటిని శివాలయ విగ్రహాలుగా మార్చారు. (ఆధారం: 13వ శతాబ్దం నాటి పాల్కురికి సోమనాథుని రచనలు). అదే క్రమంలో ఎల్లకొండ, పరమేశునిగుట్టగా పిలువబడుతున్న ప్రస్తుత కొండ పార్వతీ పరమేశ్వరాలయాలుగా మారాయి. ఇప్పటికీ స్థానికులు (ఉదా: కోనాపూర్ రాంచందర్) ఎల్లకొండ నుంచి పరమేశుని గుట్టకు సొరంగ (దొన) మార్గం ఉందని, పరమేశుని గుట్ట ముందు పాత ఊరు ఉండేదని చెప్తుండగా, పరమేశునిగుట్ట ఆలయ అర్చకుడు పరమేశదాసు సుమారు వెయ్యేళ్ళ కిందట ఎల్లకొండ నుంచి గమనముని ఇక్కడికి వచ్చి తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకొని వారిని ఇక్కడే ప్రతిష్ట కమ్మని వరం పొందాడని చెప్పాడు. ఈ స్థానిక కథనాలు కూడా క్రీ.శ. 12వ శతాబ్ది చివరి దశాబ్దాలలో ఇక్కడి పార్వతీ పరమేశ్వర ఆలయాలు, విగ్రహాలు, తత్సంబంధిత గణపతి విగ్రహం వెలిసినట్లు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణలోని అవంచ వద్ద కనిపించిన అతిపెద్ద రాతి వినాయక విగ్రహం


ఊర్ల పేర్లలో చరిత్ర:

పరమేశునిగుట్ట చుట్టుపక్కల గ్రామాల పేర్లు వీరశైవమత ప్రభావంతో శివ సంబంధిత పేర్లను సంతరించుకున్నాయి. ప్రస్తుత పరమేశునిగుట్ట గ్రామం పేరు మాందపురం = మాన+ద పురం జైన సంబంధం కలది: జైన మాన స్తంభం కల పురము అని అర్థం. ఇప్పటికే పరమేశుని గుట్టపైనున్న పార్వతి గుహాలయంలో రెండు-మూడు దశాబ్దాల క్రితం చేయించి ప్రతిష్టించిన పార్వతి విగ్రహం పక్కనే అనాది కాలంగా ఉంటున్న నాలుగు పలకల గ్రానైట్ బండ ఉంది. అది ఒకప్పటి జైన మానస్తంభం ముక్క అని స్పష్టంగా అర్ధమవుతుంది. పరమేశుని గుహాలయం ముందు కూడా ఒక స్తంభం నిలబెట్టి ఉంది. అదీ ప్రాచీనమైనదని అర్చకుడు చెప్పాడు. కాబట్టి అదీ జైన మానస్తంభమే.

మాందపురము పక్కన పరమేశ్వరుని రెండో భార్య పేర గంగారం వెలియగా, అతని కొడుకు (ఏనుగు తల కలిగిన గణపతి) పేరున ఏనుగుతల (ఎనుగతల) అనే గ్రామం వెలిసింది. క్రీ.శ. 12, 13 శతాబ్దాల నుంచి శ్రీశైలం మల్లికార్జునుని మల్లయ్య అని పిలిచేవారు కాబట్టి ఆ పేరు మీద పరమేశునిగుట్ట సమీపంలో మల్లెపల్లి అనే గ్రామం వెలిసింది. మరో పక్క గ్రామం పేరు అర్కతల. ఇక్కడి గణపతి తల వెనుక గల అర్క ప్రభా మండలం పేరుతో ఆ గ్రామం వెలిసినట్లుంది.

అరుదైన అష్టగణపతి ఆలయం:

ఎనుగతల గ్రామస్తులు ప్రకాశం పంతులు, పోలీస్ పటేల్ మోహన్ రెడ్డి పరమేశునిగుట పైన గణపతి ఆలయం కట్టాలని పట్టుపట్టి కొంత చందా కూడా వసూలు చేశారట. అదే సమయంలో ఈ ప్రాంతంలో రోడ్డు వేయిస్తున్న ఆంధ్ర ప్రాంత గుత్తేదారు పద్మశాలి రాములు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుని, ఆ కృతజ్ఞతతో అర్చకుని కోరిక మేరకు పరమేశునిగుట్టపై పదేళ్ళ కిందట అష్ట గణపతి ఆలయం కట్టించాడు. హైదరాబాద్కు చెందిన ఈద్గ వెంకటేశ్వర్లు అరుదైన అష్ట గణపతుల విగ్రహాలను, అర్థనారీశ్వర, లక్ష్మి, సరస్వతి, హనుమాన్ విగ్రహాలను చేయించి ప్రతిష్ఠించాడు. దాంతో తెలంగాణలో అరుదైన అష్ట గణపతి ఆలయం అందుబాటులోకి వచ్చింది.

Read More
Next Story