చిన్న కొడుకు విషయంలో కవితకి నో రిలీఫ్
x

చిన్న కొడుకు విషయంలో కవితకి నో రిలీఫ్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించలేదు.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించలేదు. ఆమె దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ నెల 4న తనకి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత కోర్టుని ఆశ్రయించగా ఆమెకి నిరాశే మిగిలింది.


కవిత తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో అతనికి తన మోరల్ సపోర్ట్ అవసరమని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ కోసం కోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారని, ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, మధ్యంతర బెయిల్ పిటిషన్ ని ఈడీ వ్యతిరేకించింది. ఇప్పటికే మద్యం కేసులో అప్రూవర్స్ గా మారిన కొందరిని ఆమె బెదిరించినట్లు మావద్ద ఆధారాలున్నాయని ఈడీ కోర్టుకి తెలిపింది.

మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని ఈడీ కోరిన నేపథ్యంలో... ఇరువైపుల వాదనలు విన్న అనంతరం, ఆమె పిటిషన్ ను తోసిపుచ్చుతూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను సిబిఐ స్పెషల్ కోర్టు ఏప్రిల్ 20 కి వాయిదా వేసింది.


ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో కవిత "సౌత్ గ్రూప్" లో కీలక సభ్యురాలు అని ఈడీ ఆరోపించింది. దేశ రాజధానిలో మద్యం లైసెన్స్‌లలో పెద్ద వాటాకు బదులుగా ఢిల్లీలో అధికార ఆప్‌ కి రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు ఆమెపై అభియోగాలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో మార్చి 15 న కవిత బంజారాహిల్స్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అదేరోజు ఆమెను అరెస్టు చేశారు. మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన అనంతరం ఆమెను ఏడు రోజుల ఈడీ కస్టడీకి పంపారు. తర్వాత ఆమె కస్టడీ విచారణను మూడు రోజులు పొడిగించారు. గత మంగళవారం ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీహార్ జైలుకి తరలించారు.

Read More
Next Story