నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న నాంపల్లి కోర్టు
x

నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న నాంపల్లి కోర్టు

కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమన్న అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది.


అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై భగ్గుమన్న అక్కినేని నాగార్జున కోర్టు మెట్లెక్కారు. రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. మంగళవారం (రేపు) నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే, స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం నాగార్జున కోర్టుకి వెళ్లాల్సి ఉంది.

కాగా, ఈ నెల 3న మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేశారు. సమంత, తన కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె చేసిన నిరాధారా వ్యాఖ్యలకు గానూ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు. ఆమె తన కుటుంబ పరువును దెబ్బతీసేలా మాట్లాడారాని, అందుకు గానూ తగిన చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి మనోరంజన్ కోర్టును ఆశ్రయించారు. వారి స్వార్థ రాజకీయాల కోసం తమ కుటుంబాన్ని బజారుకీడ్చటం ఏమాత్రం సబబు కాదని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. మరెవరూ తమ స్వార్థ రాజకీయాల కోసం మరో కుటుంబాన్ని రోడ్డుకీడ్చే ధైర్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

కొండా సురేఖ ఏమన్నారంటే...

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ ఇటీవల మీడియా ఎదుట ఆరోపించారు. వరుసపెట్టి కేటీఆర్ పై విరుచుకుపడుతున్న ఆమె... జరుగుతున్న ఇష్యూకి ఎలాంటి సంబంధం లేని నాగ చైతన్య-సమంత విడాకుల వ్యవహారం బయటకి తెచ్చి, అక్కినేని ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "సమంతను తన దగ్గరకు పంపమని కేటీఆర్ అడిగారు.. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఒత్తిడిపెట్టారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళటం ఇష్టంలేదని సమంత తెగేసి చెప్పారు.. కేటీఆర్ దగ్గరకు వెళ్ళకపోతే ఇంట్లో ఉండొద్దని చెప్పటంతోనే సమంత నాగచైతన్యకి విడాకులిచ్చి ఇల్లు విడిచి బయటకు వచ్చేసింది" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అక్కినేని ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ, మీ స్వార్ధ రాజకీయాల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను బయటకి లాగొద్దంటూ చురకలంటించారు.

ఘాటుగా స్పందించిన అక్కినేని ఫ్యామిలీ, సమంత..

సురేఖ ఆరోపణలపై అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు, సమంత సీరియస్ గా స్పందించారు. రాజకీయంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవద్దని మంత్రిని ఎక్స్ వేదికగా కోరారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండని అభ్యర్ధించారు. బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉండి తమ కుటుంబం విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని నాగార్జున కోరారు. ఇక సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ... విడాకులు తన వ్యక్తిగతమని, ఊహాగానాలను మానుకోవాలని కోరారు. రాజకీయాల్లోకి తమ వ్యక్తిగత జీవితాలను తీసుకురావద్దని హెచ్చరించారు.

Read More
Next Story