మేడిగడ్డ కేసులో కేసీఆర్ కి నోటీసులు
x

మేడిగడ్డ కేసులో కేసీఆర్ కి నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది


తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి వేసిన రివిజన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అందులో భాగంగా కేసీఆర్, హరీష్ రావు సహా 8 మందికి నోటీసులు పంపింది. సెప్టెంబర్ 5న కోర్టులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న అధికారుల్లో స్మిత సబర్వాల్, రజత్ కుమార్ కూడా ఉన్నారు.

కాగా, గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, జిల్లా ఎస్పీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే కోర్టును ఆశ్రయించానని రాజలింగమూర్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. తొలుత ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ని కొట్టేసిందని తెలిపారు. దీంతో హై కోర్టుకి వెళ్లగా.. జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలని సూచించిందని పిటిషన్ లో వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను జిల్లా కోర్టులో పిటిషన్ వేసినట్టు రాజలింగమూర్తి తెలియజేశారు.

తీవ్రవాద శక్తుల ప్రమేయం?

రాజలింగమూర్తి తన పిటిషన్ లో... ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్ కి పగుళ్లు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఎఆర్ నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి సీఎం హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులని ఆరోపించారు.

కేసీఆర్ విచారణకి హాజరవుతారా?

నోటీసులు అందిన నేపథ్యంలో సెప్టెంబర్ 5న కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కోర్టుకి హాజరవుతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది. గతంలో కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి విచారణకి హాజరవ్వాలని నోటీసులిస్తే... విచారణకి హాజరవ్వకుండా అసలు కమిషన్ నే తప్పుబట్టి, కమిషన్ ని రద్దు చేయాలని హైకోర్టులో ఆ తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీం కోర్టు కమిషన్ ని రద్దు చేయకుండా చైర్మన్ ని మార్చాలని, విచారణ కొనసాగించాలని ఆదేశించింది. మరి కాళేశ్వరం లో ఎలాంటి అవినీతి జరగలేదని, మేడిగడ్డ ప్రాజెక్టు చెక్కుచెదరలేదని, నిర్మాణం బ్రహ్మాండం అంటోన్న కేసీఆర్... జిల్లా కోర్టులో విచారణకి హాజరవుతారనేది ప్రశ్నార్ధకమే. అసలే కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం మేడిగడ్డని పరిశీలించి, లక్ష క్యూసెక్కుల వరదనీటిని తట్టుకుని మేడిగడ్డ ఠీవిగా నిలబడిందని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే .

Read More
Next Story