మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కు కోర్టు షాక్
x
Prabhakar Rao with KCR

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కు కోర్టు షాక్

కోర్టు విచారణకు తాను వర్చువల్ గా హాజరవుతానని చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.


టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో నాంపల్లి కోర్టు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు పెద్ద షాకిచ్చింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే అని స్పష్టంగా శనివారం ఆదేశించింది. కోర్టు విచారణకు తాను వర్చువల్ గా హాజరవుతానని చేసుకన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే టెలిఫోన ట్యాపింగ్ లో కీలక పాత్రదారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకరరావే అని ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే కోర్టులో అఫిడవిట్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. ప్రభాకరరావు పాత్రపైన అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాగ్మూలాలను కూడా సిట్ అధికారులు తమ అఫిడవిట్ కు జతచేశారు. అయితే దర్యాప్తును ఎంత వేగంగా ముగించాలని అనుకుంటే అన్ని బ్రేకులు పడుతున్నాయి. కారణం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగుచూడగానే, దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేయగానే ప్రభాకరరావు దేశం వదిలి పారిపోయారు.

తాను దేశం వదిలి పారిపోలేదని ఆయన చెబుతున్నప్పటికీ చాలాకాలం తాను ఎక్కడున్నది కూడా తెలీకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఆ తర్వాత అనారోగ్యానికి చికిత్స నిమిత్తం అమెరికాలో ఉంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. తనకు క్యాన్సర్ ఉందని దానికి అమెరికాలో చికిత్స చేయించుకుంటున్నట్లు చెప్పారు. టెలిఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని పదేపదే చెబుతున్నారు. సిట్ దర్యాప్తుకు అన్నీవిధాలుగా సహకరిస్తానని చెబుతున్నారు. విచారణ కోసం హైదరాబాద్ కు రమ్మంటే మాత్రం రావటంలేదు. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ప్రభాకరరావును అమెరికా నుండి హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ చేస్తున్న ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదు. అమెరికాలో ఉన్న ప్రభాకరరావును హైదరాబాద్ కు రప్పించాలంటే ఇంటర్ పోల్ సాయం అవసరం.

అయితే ఇంటర్ పోల్ సాయం తీసుకునేందుకు ఇంతకాలం పరిస్ధితులు సహకరించలేదు. ఎందుకంటే అరెస్టు వారెంట్ జారీచేయటానికి కోర్టు అంగీకరించలేదు. కోర్టు అరెస్టు వారెంటు జారీచేస్తేకాని దాని ఆధారంగా కేంద్ర హోంశాఖ నుండి ఇంటర్ పోల్ కు రిక్వెస్టు పంపేందుకు లేదు. ప్రభాకరరావు పాస్ పోర్టును ఫ్రీజ్ చేయాలని సిట్ ప్రయత్నించినా అందుకు కూడా కోర్టు ఆదేశాలు అవసరమని హోం, విదేశాంగ శాఖలు స్పష్టంగా చెప్పాయి. ఈ మధ్యనే సిట్ రిక్వెస్టు ఆధారంగా ప్రభాకరరావు, మరో కీలక నిందితుడు శ్రవణరావుపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును కోర్టు జారీచేసింది. అయితే దాన్ని కూడా పై ఇద్దరు నిందితులు పట్టించుకోలేదు. అదే విషయాన్ని శనివారం విచారణలో సిట్ కోర్టుకు చెప్పింది. దాంతో మండిపడిన కోర్టు వెంటనే ప్రభాకరరావు, శ్రవణ్ ను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.

కోర్టు తాజా ఆదేశాలతో సిట్ కేంద్రప్రభుత్వాన్ని కలిసి, ఇంటర్ పోల్ సాయం తీసుకుని అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం దొరికింది. ప్రభాకరరావు అమెరికాలో ఉన్నారని తెలిసినా శ్రవణ్ ఎక్కడున్నారో ఇప్పటికీ సిట్ అధికారులు కనుక్కోలేకపోయారు. ఏదేమైనా ప్రభాకరరావును వెంటనే హాజరపరచాలని కోర్టు ఆదేశాలు ఇవ్వటం కీలక పరిణామామనే చెప్పాలి. ప్రభాకరరావును అమెరికా నుండి రప్పించగలిగితే అప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రదారులు ఎవరనే విషయం బయటపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసు అధికారులు ప్రవీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు, రాధాకిషన్ రావుతో పాటు మరికొందరు కూడా అరెస్టయిన విషయం తెలిసిందే. మరి ప్రభాకరరావు అమెరికా నుండి హైదరాబాద్ కు ఎప్పుడు వస్తారో చూడాలి.

Read More
Next Story