
కూకట్‌పల్లి హత్యకు బ్యాటే కారణమా..!
విచారణ సమయంలో కేసును నిందితుడు తప్పుదారి పట్టించినట్లు చెప్పిన సీపీ అవినాష్ మహంతి.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు రోజుకో కీలక మలుపుతీసుకుంటుంది. తొలుత అసలు హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? అన్న అంశాలు రాష్ట్రమంతా చర్చలకు దారితీశాయి. కాగా తాజాగా హత్య చేసిన వ్యక్తితో పాటు అసలు హత్యకు కారణం ఏంటి అన్న అంశాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తాజాగా వెల్లడించారు. బాలికను హత్యచేసింది ఇంటిసమీపంలో ఉన్న బాలుడేనని వెల్లడించారు. కాగా హత్యకు అసలు కారణం క్రికెట్ బ్యాట్ అని ఆయన వివరించారు. బ్యాట్‌ను దొంగలించడానికి వెళ్లే సదరు బాలుడు.. బాలికను హత్య చేశాడని అవినాహ్ మహంతి స్పష్టం చేశారు. అంతేకాకుండా విచారణ సమయంలో నిందిత బాలుడు.. దర్యాప్తును, పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే బాలిక హత్యకు వినియోగించిన కత్తిని కూడా తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విచారణ ప్రారంభంలో ముందుగా బాలిక అరుపులు వినిపించాయని బాలుడు చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని సీపీ అవినాష్ చెప్పారు.
‘‘బాలుడికి బ్యాట్ నచ్చడంతో దానిని చోరీ చేసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకుంది. దీంతో కత్తితో దాడి చేసి చంపేశాడు. నిందితుడు పాఠశాలకు సరిగా వెళ్లేవాడు కాదు. హత్య గురించి అతడి తల్లిని విచారిస్తే తనకు తెలియదని చెప్పింది’’ అని అవినాష్ వివరించారు. కేసు ఇంకా విచారణలో ఉందని, మరిన్ని అంశాలపై క్లారిటీ కోసం బాలుడిని విచారిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే సహస్ర తమ్ముడితో కలిసి ప్రతిరోజు హంతకుడు క్రికెట్ ఆడుతుండేవాడని, ఆ సమయంలోనే ఆ బ్యాటు అతనికి నచ్చడంతో దొంగతనం చేయాలని అనుకున్నాడని పోలీసుల చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో హత్యకు గురైన బాలిక ఇంటి సమీపంలోని అపార్ట్‌మెంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ పెద్ద కిరాణా దుకాణం నడిపి, నష్టాలు రావడంతో మూసివేశాడు. ఆయన భార్య గచ్చిబౌలిలోని ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు (హత్య కేసులో నిందితుడు), బాలిక తమ్ముడు చదివే ప్రైవేటు పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నాడు.