తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ
x
Source: Twitter

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.


తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆదాధే.. కృష్ణన్ చేత రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర సీఎస్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ తదితరులు విచ్చేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణన్ నేటి నుంచి తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా కూడా కొనసాగుతారు.

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర నూతన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా సీపీ కృష్ణన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం కృష్ణన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇందులో రాష్ట్ర స్థితిగతులు సహా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాలపై చర్చించారు. వీటికి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి నూతన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌కు వివరించారు.



సీపీ రాధాకృష్ణన్ నేపథ్యం

తమిళనాడు బీజేపీలో సీపీ రాధాకృష్ణన్ సీనియర్ నేత. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. తమిళనాడు కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. తొలుత 1998 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1999లో కూడా కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఆయన 18 ఫిబ్రవరి 2023 నుంచి ఝర్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
నేటి నుంచి ఝార్ఖండ్‌తో పాటు తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలంగాణ, పుదుచ్చేరిలో పూర్తిస్థాయిలో నూతన గవర్నర్‌లను నియమించే వరకు సీపీ రాధాకృష్ణన్ కొనసాగుతారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. అయితే తెలంగాణ గవర్నర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన ఈఎస్‌ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్‌తో పాటు సీపీ రాధాకృష్ణన్ కూడా తమిళనాడుకు చెందిన వారే కావడం విశేషం.
బీజేపీలో చేరిన తమిళిసై

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. ఈరోజు ఆమె కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె మళ్ళీ బీజేపీలో చేరారు. ఆమె తమిళనాడు సెంట్రల్ నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story