రౌడీషీటర్ ఇళ్లలో సీపీ సజ్జనార్ తనిఖీలు
x

రౌడీషీటర్ ఇళ్లలో సీపీ సజ్జనార్ తనిఖీలు

నేర ప్రవృత్తి మానుకోవాలని హెచ్చరిక


హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ పాతబస్తీ రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని మానుకోవాలని వారికి సూచించారు. అర్దరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు సీపీ స్వయంగా పెట్రోలింగ్ వాహనంలో గస్తీ నిర్వహించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండానే సజ్జనార్ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండి లేన్స్, ఆశంనగర్, డిఫెన్స్ కాలనీలోని రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, సామాజిక స్థితి వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట తెరచి ఉన్న హోటళ్లు, వ్యాపార సంస్థల్లో స్వయంగా కమిషనర్ తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రాత్రి పూట తెరిస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. పాతబస్తీలోని మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ , తనిఖీలు జరిగాయి. అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు గడించిన సజ్జనార్

ఇటీవల ఐబొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి వార్తల్లో కెక్కారు. ప్రస్తుతం ఐ బొమ్మ రవి ని విచారణ నిమిత్తం హైదరాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో ఐదురోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్ 1999 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధిరారి. సజ్జనార్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ ఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. 2008 వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, 2019 శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈ రెండు ఎన్ కౌంటర్ల తర్వాత సజ్జనార్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు గడించారు.2019 నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు వ్యక్తులు రేప్ చేసి హత్య చేశారు. లారీ డ్రైవర్ ,క్లీనర్ ఈ హత్యాచారంలో దోషులుగా తేలారు.

వరంగల్‌లోని కిట్స్ కళాశాలలో బీటెక్ ఇంజినీరింగ్ చేస్తున్న స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబర్‌ 10న యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ ఎస్పీగా ఉన్న వీసీ సజ్జనార్ నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను సీన్ రీకన్‌స్ట్రక్చన్‌ కోసం ఘటనా స్థలానికి తీసుకవెళ్లారు. అక్కడ ఆయుధాలు లాక్కొని దాడి చేయడానికి నిందితులు ప్రయత్నించారని, తాము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సజ్జనార్ నేరుగా పాతబస్తీ రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Read More
Next Story