
దక్షిణాదికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం
2026లో నియోజకవర్గాల పునర్విభజన చేపడితే పార్లమెంట్ దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గి ఉత్తరాదిలో 4 రాష్ట్రాల ప్రాబల్యం అంతకు అంతా పెరగనుందని చెప్పారు.
కేంద్ర పాలకులు దక్షిణాదిని కూడా భారతదేశంలో భాగంగా పరిగణించాలని సీపీఐ నేతలు కోరారు. లేకుంటే తిరుబాట్లు వస్తాయని హెచ్చరించారు. రాజ్యసభకు అమెరికా సెనెట్ అధికారాలు కల్పించాలని కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో ‘నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై ప్రభావం’ అంశంపై రౌండ్ లేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సీట్లు తగ్గే అవకాశం ఉన్న రాష్ట్రాలకు రక్షణ కల్పించాలని కోరారు.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం జరిగే విధంగా సీట్ల సంఖ్య ఉండాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అమెరికా సెనెట్ తరహా ‘రాష్ట్రాల సభ’గా పిలవబడే రాజ్యసభకు లోక్ సభతో సమాన అధికారాలు కల్పించాలని సూచించారు. 2026లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఖాయమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు వెల్లువరిస్తున్న నేపథ్యంలో జనాభా ప్రతిపాదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగునుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా కాకుండా రక్షణలు కల్పించాలని, అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం జరిగే విధంగా పునర్విభజన ఉండాలని కోరారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్ శనివారం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన- దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం’ అనే అంశంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ జి.హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్,కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ఐఎఎల్ జాతీయ అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్, ఆర్ధిక నిపుణులు కె.పాపారావు, న్యాయవాది కె.ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ మాట్లాడారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు స్వాగతం పలకగా, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ వందన సమర్పణ చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నియోజవర్గాల పునర్విభజన: హరగోపాల్
ప్రొఫెసర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజవర్గాల పునర్విభజన భారత రాజ్యాంగంలోనే పొందుపర్చినప్పటికీ భారత సమాఖ్య స్ఫూర్తిని సైతం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందన్నారు. ఎందకంటే 1971నాటికి పెరిగిన జనాభాను దృష్టిలో పెట్టుకుని దేశం అభివృద్ది చెందాలంటే జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని అప్పటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడంతో ఈ ప్రాంత జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడిందన్నారు. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో వెనకబాటుతనం, ఇతర కారణాల వల్ల అక్కడ మాత్రం ఏలాంటి నియంత్రణ పాటించకపోవడంతో యాదావిధిగా జనాభా పెరిగిందని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జనాభా నియంత్రణ పాటించి దేశ అభివృద్దికి తోడ్పాటును అందించిన దక్షిణాది రాష్ట్రాలకు అదే ఇప్పుడు శాపంగా మారిందన్నారు. దీనికి తోడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండడం, అధికారాన్ని కేంద్రీకృతం చేయడంతో పాటు ఏకీకరణతో ముందుకు పోతూ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే స్వార్థ రాజకీయాలకు పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందనే భయం సహజంగానే ఇక్కడి నేతల్లో నెలకొందని చెప్పారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విభజన అనివార్యం అనుకుంటే దక్షిణాధి రాష్ట్రాలకు నాయ్యబద్దంగా స్థానాలను కేటాయించడంతో పాటు అమెరికా సెనెట్ తరహాలో రాజసభ్య స్థానాలను చిన్న పెద్ద రాష్ట్రాలు అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా స్థానాలు కేటాయించడంతో పాటు విశేష అధికారాలను ఇవ్వడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు కొంత న్యాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. సెనేట్ ప్రతి రాష్ట్రం నుంచి జనాభాతో నిమిత్తం లేకుండా ఇద్దరు సభ్యులను ఇస్తారని, సెనేట్ అక్కడ శక్తివంతమైన విభాగమని తెలిపారు. అదే పద్ధతిలో రాజ్యసభను కూడా బలోపేతం చేసే క్రమంలో ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున ఏర్పాటు చేస్తే, సమ ప్రాధాన్యత వస్తుందన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సంక్లిష్ట సమస్య: కె.శ్రీనివాస్
సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనే అంశంతో భారత దేశం ఒక సంక్లిష్టమైన సమస్యను ఎదుర్కొబోతుందన్నారు. ఈ సమస్యను అప్పటి కాంగ్రెస్ ప్రభత్వం 1975లోనే గుర్తించి లోక్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 25 ఏళ్ళ పాటు నిలిపివేయగా, 2001లో అధికారం చేపట్టిన వాజ్ పేయి సైతం దీనిని మరో 25 ఏళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేపడితే పార్లమెంట్ దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గి ఉత్తరాదిలో 4 రాష్ట్రాల ప్రాబల్యం అంతకు అంతా పెరగనుందని చెప్పారు. పునర్విభజన జరిగితే పార్లమెంట్ ప్రస్తుతం 24.1 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19.1 శాతానికి తగ్గిపోనుండగా, అదే ఉత్తరాదిలోని 4 ప్రధాన రాష్ట్రాల ప్రాతినిధ్యం 40 శాతం నుంచి 46 శాతానికి పెరగనుందని చెప్పారు. అయితే పునర్విభజన అనేది ఒక సహాయ ప్రక్రియ అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో పాలకుల కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ భయం మరింత ఎక్కువైందన్నారు. ఎందుకంటే కాశ్మీర్ రాష్ట్రం పునర్విభజన అంశం పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
దక్షిణాదికి వివక్షత అనే భావనను భావనను తొలగించాలి : కూనంనేని సాంబశివరావు
భాషా,ఆర్ధిక, సంస్కృతిక, సమానత్వం ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు వివక్షతకు గురవుతున్నాయని ఈ ప్రాంత వాసుల్లో ఇప్పటికే ఓ భావన ఏర్పడిన తరుణంలో లోకసభ నియోజకవర్గాల పునర్విభజను దేశ సమాఖ్య స్ఫూర్తి ఏమాత్రం విఘాతం కల్గకుండా చేపట్టాలని సిపిఐ కోరుకుంటుందని కూనంనేని సాంబశివరావు అన్నారు. భాషాపరంగా , సంస్కృతిక పరంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల ప్రజల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, అయితే బిజెపి పార్టీ అధికారం అడ్డం పెట్టుకుని తన స్వార్థ రాజకీయాల కోసం దక్షిణాదికి ఎక్కడ అన్యాయం చేస్తుందోనన్నదే తమ భయమని ఆయన పేర్కొన్నారు. అందుకే జనాభా పరంగా కాకుండా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఎ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, కేంద్ర పాలకులు దక్షిణాదిని కూడా భారతదేశంలో భాగంగా పరిగణించాలని కూనంనేని అన్నారు. లేకుంటే తిరుబాట్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
జాతీయ స్థాయిలో చర్చిస్తాం : నారాయణ
డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జాతీయ స్థాయిలో చర్చించి సిపిఐ కార్యాచరణను ప్రకటిస్తుందని వెల్లడించారు.అజీజ్ పాషా మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన కాకుండా సామాజిక, ఆర్ధిక రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, ఆ ప్రాంతాల రాజకీయ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసముందని చెప్పారు. చాడవెంకటరెడ్డి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం గల ఈ దేశంలో బిజెపిఅవలంభిస్తున్న మతపరమైన విధానాలతో ఇప్పటికే దేశ భవిష్యత్ ఏలా ఉండబోనుందనే అందోళన నెలకొందన్నారు. అందుకే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్రాల ప్రయోజనాలు ప్రతిబింభించేవిధంగా ఉండాలన్నారు.
బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజ్యాంగంలోనే పొందపర్చబడిందని, ఈ ప్రక్రియ లాభ నష్టాల దృష్టి కోణంలో కాకుండా ప్రజాస్వామ్యం అనుగుణంగా అన్ని రాష్ట్రాల స్రాతినిధ్యం సమన్యాయంగా ఉండేలా ఉండాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ప్రధానమంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్నిపార్టీల నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశ ఫెడరల్ వ్యవస్థకు ఏమాత్రం భంగం కలగకుండ పార్లమెంట్ నియోజవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండాలన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి.జంగయ్య,మేడ్చల్ మల్కాజ్ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిల్ గౌడ్, వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.