ఫిరాయింపులపై మిత్రపక్షానికి షాకిచ్చిన సీపీఐ
x

ఫిరాయింపులపై మిత్రపక్షానికి షాకిచ్చిన సీపీఐ

ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్యం కాదన్నారు ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.


ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్యం కాదన్నారు ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు మాత్రమే కాంగ్రెస్తో కలిసి పోటీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పారు. ఫిరాయింపుల విషయంలోనూ తమ వైఖరేంటో కుండబద్దలు కొట్టి మిత్రపక్షానికి షాకిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులను వెంటనే రద్దు చేయాలన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17ను రాష్ట్ర విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే సెప్టెంబర్ 17న విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వాళ్ళమని వెల్లడించారు. సిపిఐ ఆధ్వర్యంలో విలీన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపకూడదని కోరారు. మానవత్వంతో కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ విపత్తు కింద తెలంగాణకు తమ అంచనా ప్రకారం రూ. పదివేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ళు కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్ళకి, పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు సరిపోవన్నారు. నష్టపోయినదాంట్లో సగమైనా ప్రభుత్వం ఇవ్వాలన్నారు.

అలాగే మావోయిస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయకూడదన్నారు. మావోయిస్టులు ఏమైనా రాక్షసులా అని ప్రశ్నించారు. నక్సల్స్ పై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు. ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలన్నారు. మావోయిస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మాయలో పడి తప్పులు చేయకూడదని సూచించారు. సెప్టెంబర్ 11నుంచి 17వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామని చెప్పారు. సెప్టెంబర్ 21వ తేదీన భారీ బహిరంగసభ ఉంటుందని కూనంనేని సాంబశివరావు తెలిపారు.



Read More
Next Story