
రాచకొండలో పెరిగిన క్రైమ్ రేట్: సీపీ సుధీర్
2024తో పోలిస్తే 2025లో మహిళలపై జరిగిన నేరాలు 4శాతం పెరిగాయని తెలిపిన సీపీ.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిందని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు అధికంగా జరిగాయని, వాటిలో 78శాతం కేసులను పరిష్కరించామని వెల్లడించారు. ఇంకా చాలా కేసులు దర్యాప్తు స్టేజిలో ఉన్నాయని, వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. సోమవారం విడుదల చేసిన 2025 క్రైమ్ వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది 28,626 కేసులు నమోదు అయినప్పటికీ, 2025లో మొత్తం 33,040 కేసులు నమోదు అయ్యాయని ఆయన చెప్పారు. ఇది గణనీయంగా 4,414 కేసుల పెరుగుదల సూచిస్తోంది. మహిళలపై నేరాల నమోదు గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఎక్కువగా నమోదైనట్లు తెలిపారు.
ప్రధాన నేరాల వివరాలు:
కిడ్నాప్: 579 కేసులు
ఫోక్సో: 1,224 కేసులు
దోపిడీ: 3 కేసులు
దొంగతనం: 67 కేసులు
ఇళ్లలో చోరీ: 589 కేసులు
వాహనాల చోరీ: 876 కేసులు
సాధారణ చోరీ: 1,161 కేసులు
హత్యలు: 73 కేసులు
అత్యాచారాలు: 330 కేసులు
వరకట్నం మరణాలు: 12
గృహ హింస: 782 కేసులు
డ్రగ్స్, సైబర్ క్రైమ్:
ఈ ఏడాది 20 కోట్లు విలువ చేసే మాదక పదార్థాలను స్వాధీనం చేసుకుని 668 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 256 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. స్వాధీనం తీసుకున్న డ్రగ్స్ వివరాలు: 2,090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లెట్‌లు, 34 కిలోల హ్యాషిష్ ఆయిల్, 216 గ్రాముల ఎండీఎంఎ, 10 కిలోల ఓపియం, 242 గ్రాముల హెరాయిన్, 35 కిలోల గసగసాల సామగ్రి. సైబర్ నేరాలకు సంబంధించిన చర్యల్లో 3,734 కేసులు నమోదు చేసి, 6,188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేశారు.
ముందున్న కేసులు, శిక్షలు:
‘‘21,056 కేసులు (78%) పరిష్కరించబడినట్లు తెలిపారు. 12 కేసుల్లో దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. 495 మందిని డ్రగ్స్ రవాణా కేసుల్లో అరెస్ట్ చేసి, 227 ఎన్డీపీఎస్ అనుమానిత షీట్లు తెరవబడ్డాయి’’ అని ఆయన చెప్పారు. “నాన్‌బెయిలబుల్ వారెంట్‌లను ఫ్రీగా చేసి, కమిషనరేట్‌ను సమర్ధవంతంగా తీర్చిదిద్దాము” అని పేర్కొన్నారు.

