తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల క్రైం కథా చిత్రమ్
తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల క్రైం కథా చిత్రమ్ వెలుగుచూసింది.ప్రచారంలో కొందరు అభ్యర్థులు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు.వారిపై కేసులు పెట్టారు.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురిపై ఇప్పటికే పలు పోలీసు కేసులున్నాయి. మళ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతుండటంతో ఎంపీ అభ్యర్థులపై మరిన్ని పోలీసు కేసులు నమోదవుతుండటం సంచలనం రేపుతోంది. బీజేపీ, మజ్లిస్ అభ్యర్థులు ఎక్కువ మంది విద్వేషాలకు ఆజ్యం పోస్తుండటంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ లు జారీ చేశారు.
మసీదు వైపు రామబాణం ఎక్కుపెట్టిన మాధవీలత
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనవమి ఊరేగింపులో పాల్గొన్న మాధవీలత బేగంబజార్ వద్ద ఉన్న మసీదు వైపు గురిపెడుతూ ఉహాజనిత బాణం విడిచిన వ్యవహారంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగింది. మాధవీలత తీరుపై ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బండి సంజయ్‌పై పోలీసు కేసు
హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్లలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 27వతేదీన చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చెంగిచర్ల ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ చెంగిచర్లలోని పిట్టలబస్తీకి రావడంతో పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుమిగూడారు. దీంతో చెంగిచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకొని, బండి సంజయ్ పై కేసు పెట్టారు.
అసదుద్దీన్ ఒవైసీపై మాధవీలత ఫిర్యాదు
హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ బీఫ్ వినియోగానికి మద్దతు తెలిపారంటూ అతనిపై బీజేపీ హైదరాబాద్ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత భారత ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఒవైసీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో అసదుద్దీన్ ఒవైసీ తన ఎన్నికల ప్రచారంలో ఓ కసాయిని కలిసి ‘రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోపై బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై బీజేపీ అభ్యర్థి నగేష్ పై కేసు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఆదిలాబాద్ పట్టణ పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీరామ నవమి ఫ్లెక్సీలపై శ్రీరాముడి చిత్రంతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫొటోను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ముద్రించారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.శ్రీరామ నవమి రోజు శోభాయాత్రలో ఎమ్మెల్యే శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పాల్గొని నినాదాలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల నిఘా అధికారులు ఆదిలాబాద్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరిపై కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థిపై భూకబ్జా కేసు
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల రాధిక, యాదగిరిరెడ్డి దంపతులు తుర్కయాంజాల్ మున్సిపల్ పరిధిలోని రాగన్నగూడ సర్వేనంబడరు 500.501లో 65వ నంబరు 200 గజాల ప్లాట్ ను కొన్నారు. ఆ ప్లాట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డి తన మనుషులతో వచ్చి ఆక్రమించారని రాధిక దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు అతనిపై కేసు పెట్టారు.
తెలంగాణలో పోలీసు కేసులున్న అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లేస్తారా? లేదా అనేది ఓటర్ల తీర్పు కోసం జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు వరకు వేచిచూడాల్సిందే.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 17వతేదీన శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్ శ్రీరాముడి శోభయాత్రకు అనుమతి లేకున్నా నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని సుమోటోగా తీసుకున్నారు. శోభాయాత్ర ర్యాలీని పలు చోట్లు ఆపి బాణసంచా కాలుస్తూ, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్ ను కూడా రాజాసింగ్ ఉల్లంఘించారని ఆయనపై ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు పోలీసులు నమోదు చేశారు.
2వేల క్రిమినల్ కేసుల పరిష్కారం
పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులపై ఉన్న 2వేల క్రిమినల్ కేసులను ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయని సుప్రీంకోర్టుకు తాజాగా సమాచారం అందింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని దాఖలైన పిల్‌లో అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రస్థుత లోక్ సభ ఎన్నికల్లో 501 మంది క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ కేసుల విచారణను త్వరితగతిన చేయాలని కోరారు.
Next Story