తెలుగు సిట్టింగ్ ఎంపీల క్రైం కథాచిత్రమ్
x
ADR REPORT (PHOTO: SORCE FACEBOOK)

తెలుగు సిట్టింగ్ ఎంపీల క్రైం కథాచిత్రమ్

తెలుగు రాష్ట్రాల సిట్టింగ్ ఎంపీల క్రైం కథా చిత్రం మరోసారి వెలుగుచూసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) నివేదికలో క్రిమినల్ కేసుల బాగోతం బయటపడింది.


పార్లమెంట్ సభ్యులు అంటేనే నేరచరితులు అన్నట్లుగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులున్న సిట్టింగ్ ఎంపీలు ఎక్కువగానే ఉన్నారని తాజాగా వెల్లడైంది. దేశంలో మొత్తం సిట్టింగ్ ఎంపీల్లో 306 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో హత్య, హత్య యత్నం, మతవిద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై అత్యాచారాలు ఇలా ఒకటేమిటి పలు తీవ్ర మైన కేసుల్లోనూ మన ఎంపీలు నిందితులు కావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రశ్నార్థకంగా మారింది.

లోక్‌సభలో ప్రస్థుతమున్న సిట్టింగ్ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రతీ సారి ఎన్నికల్లో నేరచరితులే ఎన్నికవుతున్నారు. అయితే ఈ ఏడాది జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో క్రిమినల్ కేసులున్న వారు ఎంతమంది ఎన్నికవుతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్థుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీల తాజా క్రిమినల్ కేసుల చిట్టాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసింది. మన ఎంపీల్లో 25 శాతం అంటే 194 మందిపై హత్య, హత్యాయత్నం, అత్యాచారాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం లాంటి తీవ్రమైన నేరాల అభియోగాలు నమోదైనాయి.

26మంది సిట్టింగ్ తెలుగు ఎంపీలు నేరచరితులే...
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. తెలంగాణలో రాజ్యసభ సభ్యులతో కలిపి 24మంది ఎంపీల్లో 13మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అందులోనూ 9 మందిపై తీవ్రమైన క్రిమినల్ నేరాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీకి చెందిన 31 మంది ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక తేల్చి చెప్పింది. అందులో 11 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.

క్రిమినల్ కేసుల్లోనూ తెలుగు ఎంపీల రికార్డ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సగం మందిపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ సీపీ ఎంపీ ఒకరు హత్య కేసులో, మరో ఎంపీ హత్యాయత్నం కేసులో నిందితులు. 17 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సీరియస్ క్రిమినల్ కేసుల్లో ఉన్నామని వారు సమర్పించిన అఫిడవిట్లలోనే పేర్కొన్నారు. పార్టీల వారీగా చూస్తే 47 శాతం ఎంపీలలపై క్రిమినల్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నే కాదు తెలంగాణలోనూ 54 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. కడప సిట్టింగ్ ఎంపీ హత్య కేసులో నిందితుడు. పలువురు ఎంపీలపై క్రిమినల్ కేసులున్నా, అవి కోర్టుల్లో వివిధ దశల్లో దర్యాప్తులో ఉన్నాయి. దీంతో కేసులున్న వారు సైతం ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టాలు చేస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీల్లో జంప్ జిలానీలు
పార్లమెంట్ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీల్లో జంప్ జిలానీల గురించి కూడా ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ప్రస్థుతం దేశంలోని పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీల్లో 27 మంది పార్టీలు ఫిరాయించారు. పార్టీలు మారిన జంప్ జిలానీల్లో తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పొతుగంటి రాములు తన కుమారుడైన భరత్ కు పార్టీ టికెట్ కోసం బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీబీపాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీబీపాటిల్ బరిలోకి దిగారు.
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైఎస్సార్ సీపీ నుంచి జనసేన తీర్థం స్వీకరించారు. ఒంగోలు వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం తెలుగుదేశంపార్టీలో చేరి ఒంగోలు నుంచి మళ్లీ పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగారు. నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణ రాజు వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు.

దేశంలోనే సంపన్నులు,,,తెలుగు సిట్టింగ్ ఎంపీలు
ధనవంతులైన సిట్టింగ్ ఎంపీ ఎంపీల జాబితాను ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. దేశంలోనే సంపన్న ఎంపీల జాబితాలో నర్సాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణ రాజు మూడోస్థానంలో నిలిచారు. ఈయనకు మొత్త 325 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. దేశంలోనే అతి తక్కువ ఆస్తులున్న వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీకి చెందిన నర్సాపురం సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవికి కేవలం 1,41,179 రూపాయల ఆస్తులే ఉన్నాయని ఆమె సమర్పించిన అఫిడవిట్ లో వెల్లడైంది. అత్యధిక ఆదాయం సంపాదించిన ఎంపీల్లో మన తెలుగు ఎంపీలే దేశంలోనే ముందున్నారు.

టాప్ టెన్ తెలుగు సంపన్న ఎంపీలు
దేశంలోని టాప్ టెన్ సంపన్న ఎంపీల్లో మన తెలుగు ఎంపీలే నలుగురు ఉండటం విశేషం. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఆస్తి 305 కోట్లరూపాయలు కాగా 2017-18 ఆదాయపుపన్ను రిటర్న్ లో రూ.43.44కోట్లుగా చూపించారు. అత్యధిక ఆదాయం పొందిన ఎంపీగా గల్లా రికార్డు నెలకొల్పారు. చేవేళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి 163కోట్ల రూపాయల ఆస్తులుండగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 33 కోట్ల ఆదాయం వచ్చిందని ఐటీఆర్ లో చూపించారు. నెల్లూరు సిట్టిగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి 221 కోట్ల రూపాయల ఆస్తులుండగా, ఏడాదికి 26 కోట్ల ఆదాయం వచ్చిందని ఐటీఆర్ లో పేర్కొన్నారు. విశాఖపట్టణం సిట్టింగ్ ఎంపీ వైఎస్సార్ సీపీకి చెందిన ఎంవీవీ సత్యనారాయణ 203 కోట్లతో దేశంలోనే టాప్ టెన్ సంపన్న ఎంపీగా నిలిచారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బీబీ పాటిల్ ఆస్తి రూ.128కోట్లు,ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, ప్రస్థుత బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు రూ.107 కోట్లు, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, ప్రస్థుత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కు రూ.87కోట్ల ఆస్తులున్నాయని ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

నేరచరిత్ర ఉన్న అభ్యర్థులకు ఓటేయవద్దు : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి
నేరచరిత్ర ఉన్న సిట్టింగ్ ఎంపీలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం దురదృష్ణకరమని, అలాంటి నేర చరిత్ర ఉన్న వారికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయ వద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి ఓటర్లకు సూచించారు. ‘‘అవినీతి, అక్రమాలతో సంపన్నులైన వారు వారి అక్రమార్జనను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇలాంటి వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే వారు ప్రజల ధన,మానచ ప్రాణాలను ఎలా కాపాడతారు? అందుకే సద్గుణాలు, సచ్ఛీలురైన వారికి ఓటు వేయాలి నా అభ్యర్థన’’అని సోమ శ్రీనివాసరెడ్డి సలహా ఇచ్చారు. నేరచరిత్ర లేని సచ్ఛీలురైన అభ్యర్థులు లేకుంటే నోటాకు ఓటేయాలని ఆయన కోరారు. ధనబలం, అంగబలం ఉన్నవారికే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని, ఈ పద్ధతి మారి సచ్ఛీలురైన వారికే పార్టీలు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


Read More
Next Story