హైదరాబాద్ (Hyderabad)నగరంలోని మూసీ నదిలో (Musi River) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మొసళ్లు (Crocodiles) ఇటీవల ప్రత్యక్ష మవడంతో హైదరాబాదీలు హడలిపోతున్నారు.
- హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరదనీరు ప్రవహిస్తోంది...లంగర్ హౌస్ సమీపంలోని డిఫెన్స్ కాలనీ మసీదు ఈ మెరాజ్ సమీపంలో మూసీ తీరంలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు...వారికి మూసీ నదిలో వచ్చిన నాలుగు అడుగుల మొసలి ప్రత్యక్షమైంది. అంతే పిల్లలంతా తీవ్ర భయాందోళనలు చెందారు. మూసీలో మొసలి ప్రత్యక్షమైన ఘటన ఆదివారం వెలుగుచూసింది.
- మూసీ నదీ తీరంలో ఉన్న కొత్తపేట ఫణిగిరి కాలనీలలో ఆలయం వద్ద మొదటి సారి మొసలి కనిపించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచి మూసీ తీరంలోని కిషన్ బాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో మొసళ్లు దర్శనమిచ్చాయి. ఇలా తరచూ నాలుగు మొసళ్లు దర్శనమిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ప్రజల భయాందోళనలు
లంగర్ హౌజ్ సమీపంలోని మూసీ నదిలో మరోసారి మొసలి కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇటీవల ఒక పెద్ద మొసలి కిషన్‌బాగ్ ప్రాంతంలోనూ కనిపించింది.మూసీ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న బురద మార్గంలో నాలుగు అడుగుల పొడవున్న మొసలిని పిల్లలు గమనించారు. మొసలిని చూసి వారు హాహాకారాలు చేశారు. మూసీ తీరంలో పగలు పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశానికి తరచుగా వస్తుంటారు. మొసలి ప్రత్యక్షం అవడంతో కిషన్‌బాగ్‌లోని అసద్ బాబా నగర్ ప్రాంతంలో భయం మొదలైందని ప్రజలు ఫిర్యాదు చేశారు. మొసలిని చూసేందుకు ప్రజలు మూసీ తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మొసళ్లకు నిలయం మూసీ
హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు మొసళ్లకు నిలయాలుగా మారాయి. ఈ రెండు మంచినీటి జలాశయాల్లో వరదనీరు చేరడంతో నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు రెండు జలాశయాల గేట్లు తెరచి మూసీలోకి నీరు వదిలారు. దీంతో మొసళ్లు జంట జలాశయాల నుంచి మూసీనదిలోకి వచ్చాయి. మొసళ్లు వచ్చినపుడల్లా మూసీ తీర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. మొసళ్లకు హాని తలపెట్టవద్దని, వాటిని జూపార్కుకు తరలించి సంరక్షిస్తామని జూపార్కు పశువైద్యుడైన డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎ హకీం సూచించారు.
మంజీరాలో మొసళ్లు బాబోయ్
మంజీరా వన్యప్రాణుల అభయారణ్యం నుంచి సంగారెడ్డి, మెదక్ జిల్లాల నీటిపారుదల చెరువులు, వ్యవసాయ భూముల్లోకి మొసళ్లు వస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో మొసళ్లు దర్శనమిస్తుండటంతో తాము పొలాలకు ఎలా వెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. సదాశివపేట మండలంలోని కోల్కూరు గ్రామంలోని చిన్న నీటిపారుదల చెరువులో మొసలి కనిపించింది. చెరువు చుట్టూ ఉన్న పొలాల రైతులు మొసలిని చూసి భయాందోళనలు చెందుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు ఎగువన, మంజీరా నది వెంట మొసళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొసళ్ల కదలికలపై అటవీశాఖ అధికారులు నిఘా వేసి వాటిని పట్టుకొని జూపార్కుకు తరలించాలని రైతులు కోరుతున్నారు.