
ముగిసిన ఫిరాయింపుల విచారణ..
స్పీకర్ నిర్ణయం ఏంటనేదే హాట్ టాపిక్..!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ శనివారం పూర్తయింది. అక్టోబర్ 1న జరగాల్సిన విచారణ వాయిదా పడటంతో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. శనివారం విచారించారు. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శనివారం ఉదయం నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేల విచారణ జరిగింది. శనివారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వాస్తవానికి వీరి క్రాస్ ఎగ్జామినేషన్.. అక్టోబర్ 1న జరగాల్సి ఉంది. కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపు నేతల విచారణను స్పీకర్ చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యను పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారి విచారణ సుదీర్ఘంగా జరిగింది. దీంతో వీరిద్దరి క్రాస్ ఎగ్జామినేషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దసరా పండగ తర్వాతకు వాయిదా వేశారు.
స్పీకర్ నిర్ణయం ఏంటో..?
శనివారం మధ్యాహ్నం వారి విచారణ ముగిసింది. దీంతో వారి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అనేది ప్రస్తుతం కీలక చర్చలకు దారితీస్తోంది. బీఆర్ఎస్ కోరినట్లు పార్టీ మారిన నేతలపై అనర్హత పిటిషన్ వేస్తారా? లేదంటే నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరతారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాన్స్ ఏంటి? బీఆర్ఎస్.. ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అనేది కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
ఈ అంశంలో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఫిరాయింపు నేతలు ఎనిమిది మంది.. అసలు తాము పార్టీనే మారలేదని అఫిడవిట్‌లు దాఖలు చేశారు. కాగా ఫిర్యాదుదారులు ఫిరాయింపు నేతలకు వ్యతిరేకంగా తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించారు. ఈ క్రమంలోనే ఫిరాయింపు నేతలపై అనర్హత వేటు అంశంలో పార్టీ మారిన నేతల విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. న్యాయవాదుల సమక్షంలో ఫిరాయింపుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను పూర్తి చేశారు. వారిచ్చిన సమాధానాలను పరిశీలించిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.