తెలంగాణలో బయటపడ్డ ‘క్రిప్టో’ మోసం
x

తెలంగాణలో బయటపడ్డ ‘క్రిప్టో’ మోసం

170 కోట్ల విలువ చేసే లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన ఐటి అధికారులు


తెలంగాణలో బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరాలతో బాటు క్రిప్టో కరెన్సీమోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బ్యాంకుల్లో నకిలీ అకౌంట్లు తెరచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న వైనం ఇపుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు 170 కోట్ల రూపాయల విలువ చేసే మోసపూరిత క్రిప్టో లావాదేవీలు జరిగాయి. సంపన్న వర్గాలు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల బ్యాంకు అకౌంట్ల నుంచి లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. రైతు కూలీలు, రైతులు, చిరు ఉద్యోగుల అకౌంట్ల నుంచే లావాదేవీలు జరగడంతో ఐటి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. పాన్ కార్డు , ఆధార్ కార్డు వంటివి ఉంటే బ్యాంకు అకౌంట్ తెరవడం పెద్ద విషయమేమి కాదు. ఒకటి రెండు డాక్యుమెంట్స్ ఉంటే బ్యాంకు అధికారులు అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు క్రిప్టో లావాదేవీలు జరుపుతున్నట్టు ఐటి అధికారులు గుర్తించారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో క్రిప్టో లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీటిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్, సిద్దిపేట, ఖమ్మం, జగిత్యాల, సత్తుపల్లి ప్రాంతాల్లో క్రిప్టో లావాదేవీలు జరుగుతున్నట్లు ఐటి అధికారులు గుర్తించారు. దాదాపు 20 కి పైగా మోసాలు జరిగినట్టు అధికారవర్గాలు తెలిపాయి. లాలాగుడాలో వాటర్ ప్లాంట్ లో పని చేసే ఉద్యోగి అకౌంట్ నుంచి 34 కోట్లు, సత్తుపల్లికి చెందిన సన్నకారు రైతు పేరుతో 31 కోట్లు, ఖమ్మం ఫార్మా కంపెనీ ఉద్యోగి పేరిట 19 కోట్లు, సిద్దిపేట రైతుపేరుతో 9 కోట్లు, జగిత్యాల డెలివరీబాయ్ పేరిట 20 కోట్ల లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. సాధారణ వ్యక్తుల అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరపడంతో క్రిప్టో రాకెట్ వెనక ఉన్న వ్యక్తుల గూర్చి అధికారులు ఆరాతీస్తున్నారు.

Read More
Next Story