
సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడం ఇక చాలా ఈజీ!
అనలాగ్ వాయిస్ సిగ్నల్స్‌ను డేటా ప్యాకెట్‌లుగా మార్చిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయడాన్నే క్లైడ్ టెలిఫోనీ వ్యవస్థ అంటారు.
పోలీసు శాఖకు అతిపెద్ద సవాల్‌గా మారిన అంశం.. సైబర్ నేరాలు. పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న కొద్దీ.. నేరగాలు సరికొత్త మార్గాలు ఎంచుకుంటూ అమాయకులు నిలువునా ముంచేస్తున్నారు. చాలా వరకు బాధితులు తాము మోసపోయామని గుర్తించినా.. ఫిర్యాదు ఎక్కడ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అంతేకాకుండా ఫిర్యాదు చేయడం పెద్ధ సవాల్‌గా మారుతుంది. ఇది సైబర్ క్రైమ్ బృందాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తుందన్న భావన కూడా చాలా మందిలో ఉంది. అయితే ఈ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ప్రజలకు ఇంకా చేరువ చేశారు. సైబర్ నేరాల ఫిర్యాదుల విభాగం హెల్ప్‌లైన్ నెంబర్ 1930 వ్యవస్థకు అధునాతన హంగులు అద్దింది. ఈ నెంబర్‌కు ఇంటర్నెట్ ఆధారిత క్లౌడ్ టెలిఫోనీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా మార్పులు తీసుకురానుంది. ఈ మార్పులపై ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజేశ్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఇకపై దేశంలో సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడం చాలా సులభమవుతుంది.
అనలాగ్ వాయిస్ సిగ్నల్స్‌ను డేటా ప్యాకెట్‌లుగా మార్చిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయడాన్నే క్లైడ్ టెలిఫోనీ వ్యవస్థ అంటారు. బాధితులు తమ ఫిర్యాదు చేయడానికి 1930 నెంబర్‌కు ఫోన్ చేయాలి, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ సర్వీస్ ప్రొవైడర్ కాల్‌ను రూట్ చేయడం ద్వారా వివరాల సేకరణ మరింత సులభతరం అవుతుంది. ఈ ప్రక్రియతో బాధితుల వివరాలతో పాటు డేటా షేర్ చేసే విధానం చాలా సరళం కానుంది.
ఈ క్లౌడ్ టెలిఫోనీ ప్రక్రియ సాంప్రదాయ ప్రైవేట్ బ్రాంచ్ ఎక్స్‌ఛేంజి అవసరాన్ని తొలగిస్తుంది. దాంతో పాటు 1930 నిర్వహణ భారాన్ని తగ్గిస్తుంది. బాధితులు 1930కు ఫోన్ చేస్తే బాధితుల నెట్‌వర్క్ లొకేషన్ ఆధారంగా వారి ఫోన్ కాల్‌ను సంబంధిత రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ ఫిర్యాదుల విభాగానికి కాల్‌ను డైవర్ట్ చేస్తారు. అక్కడి సిబ్బంది బాధితుడి నుంచి వివరాలు సేకరించి ఎన్‌సీఆర్‌పీలో అప్‌లోడ్ చేస్తారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా ఎన్‌సీఆర్‌పీలోని ఆయా బ్యాంకుల ప్రతినిధులు సైబర్ నేరస్థుల లావాదేవీ పూర్తికాకుండా అడ్డోవడానికి ప్రయత్నిస్తున్నారు. లావాదేవీని అడ్డుకోగలిగితే ఆ సొమ్మును న్యాయప్రక్రియ ద్వారా బాధితుడికి తిరిగి అందిస్తారు. కొన్ని సందర్భాల్లో కాల్‌సెంటర్ సిబ్బంది ఇతర కాల్స్‌లో బిజీగా ఉండటంతో బాధితుల ఫిర్యాదుల స్వీకరణ ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే క్లైడ్ టెలిఫోని సర్వీసెస్‌ను ప్రారంభించడం ద్వారా ఫిర్యాదుల స్వీకరణ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అధికారులు చెప్తున్నారు.