
నిజామాబాద్ లో 10 లక్షలు బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
ప్రభుత్వాధికారులమంటూ ఓ కుటుంబానికి ఫోన్లు... ఆ పై మోసం
సూర్య, రమ్యకృష్ణ కలిసి నటించిన "గ్యాంగ్" సినిమాకు సంబంధించిన ఒక సీన్ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది, సూర్య ఆమెతో ఇంటరాక్ట్ అవుతాడు. నకిలీ సిబిఐ ఆఫీసర్ల పాత్రలో మెప్పించారు. అచ్చం అలాంటి సీన్ తెలంగాణ నిజామాబాద్ లో రిపీట్ అయ్యింది. తాము ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారులమంటూ నిజామాబాద్ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్దమయ్యారు.
తాము ఫలానా డిపార్ట్ మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఈ కేటుగాళ్లు నిత్యం నిజామాబాద్ ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ కుటుంబాన్ని సదరు కేటుగాళ్లు బెదిరించారు. 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. బాధిత కుటుంబం సదరు కేటుగాళ్లను బ్రతిమాలడంతో 10 లక్షలకు బేరం కుదిరింది. ఈ పది లక్షలు పుచ్చుకున్న కేటుగాళ్లపై బాధితులు ఫిర్యాదు మేరకు
సైబర్ నేరగాళ్ల అకౌంట్ ను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
ఆర్థికంగా వృద్ది చెందిన కుటుంబాలను టార్గెట్ చేసుకుని కేటుగాళ్లు ఫోన్లు చేసే వారు. తమ అకౌంట్లలో ఉన్న డిపాజిట్లు గుల్ల కావడంతో కేటుగాళ్లపై ప్రజల ఫిర్యాదులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో పోలీస్ నిఘా పెరిగింది.
కేటుగాళ్లు ఫోన్ చేసినప్పుడు అనుమానం వస్తే పోలీసులకు సమాచారమివ్వాలని పోలీసులు కోరారు.
బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఆన్ లైన్ ట్రాన్ సాక్షన్ నిర్వహించకూడదన్నారు. ఓటీపీ నెంబర్స్ ఇతరులతో షేర్ చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.