![మేఘా కంపెనీలో కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ళు మేఘా కంపెనీలో కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ళు](https://telangana.thefederal.com/h-upload/2025/02/15/512992-megha-and-cyber.webp)
మేఘా కంపెనీలో కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్ళు
ప్రముఖ నిర్మాణ సంస్ధ మేఘా కంపెనీ ఖాతా నుండి సైబర్ నేరగాళ్ళు 5.5 కోట్ల రూపాయలను కొట్టేశారు
సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తపంథాలో రెచ్చిపోతున్నారు. వ్యక్తుల ఖాతాల్లో ఎంత డబ్బుంటుందని అనుకున్నారో ఏమో ఏకంగా వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీపైనే కన్నేశారు. చాలా ప్లాన్డ్ గా రు. కోట్ల రూపాయలను కొట్టేశారు. జరిగిన మోసాన్ని గుర్తించిన కంపెనీ యాజమాన్యం సైబర్ పోలీసుల(Cyber Police)కు ఫిర్యాదుచేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రముఖ నిర్మాణ సంస్ధ మేఘా కంపెనీ ఖాతా నుండి సైబర్ నేరగాళ్ళు 5.5 కోట్ల రూపాయలను కొట్టేశారు. అందుకు నేరగాళ్ళు(Cyber Crimes) అనుసరించిన ప్లాన్ చాలా సింపుల్.
అదేమిటంటే మేఘా కంపెనీ నెథర్లాండ్స్(Netherlands) నుండి కొన్ని పరికరాలను రెగ్యులర్ గా కొటుంటూంది. అవసరమైన పరికరాలను కొనుగోలు చేయటం, తర్వాత డబ్బులు చెల్లించటం మామూలుగా జరిగేపనే. అదే పద్దతిలో ఈమధ్యనే నెదర్లాండ్స్ కంపెనీ నుండి విలువైన పరికరాలు కొన్నది. పరికరాలు కొనుగోలుచేసిన కొన్ని రోజుల తర్వాత నెదర్లాండ్స్ కంపెనీ నుండి మేఘా(MEIL)కు ఒక మెయిల్ వచ్చింది. అందులో ఏముందంటే ఇప్పటివరకు పరికరాల కొనుగోలు తర్వాత చేస్తున్న చెల్లింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో సమస్య వచ్చిందని చెప్పింది. కాబట్టి తాము కొత్త బ్యాంకు ఖాతా నెంబర్ ఇస్తున్నామని డబ్బులు అందులో జమచేయాలని కోరింది. మేఘా కంపెనీ(Megha Company) సరే అనిచెప్పి కంపెనీ కోరినట్లుగానే కొత్త బ్యాంకు ఖాతాకు రు. 5.5 కోట్లను జమచేసింది.
సీన్ కట్ చేస్తే పరికరాలను సరఫరాచేసిన కంపెనీ డబ్బులు పంపాలని మేఘా కంపెనీకి మెయిల్ పెట్టింది. మెయిల్ చూసుకున్న మేఘా కంపెనీ యాజమాన్యం ఆశ్చర్యపోయింది. ఖాతాలో డబ్బులు జమచేసిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులు పంపాలని నెదర్లాండ్స్ కంపెనీ అడగటం ఏమిటో మేఘాకు అర్ధంకాలేదు. డబ్బులను కొత్త బ్యాంకు ఖాతాలో జమచేసినట్లుగా చెప్పి అందుకు ఆధారాలను కూడా మెయిల్ లో పంపింది. మేఘా కంపెనీ నుండి వచ్చిన మెయిల్ చూసిన నెదర్లాండ్స్ కంపెనీ ఆశ్చర్యపోయింది. తమకు డబ్బులు అందనేలేదని తాము బ్యాంకు ఖాతా కూడా మార్చలేదని మళ్ళీ మెయిల్ పంపింది. దాంతో ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని మేఘా కంపెనీ వెంటనే బ్యాంకు ఖాతాను మార్చినట్లుగా చెప్పిన కొత్త బ్యాంకు ఖాతాతో పాటు మెయిల్ కాపీని కూడా నెదర్లాండ్స్ కంపెనీకి పంపింది. దాంతో మెయిల్ లో ఉన్న కొత్త మెయిల్ అడ్రస్ తమది కాదని, తమ కంపెనీ మెయిల్ అడ్రస్ పేరులో ఒక్క అక్షరాన్ని మార్చటం ద్వారా సైబర్ నేరగాళ్ళు మేఘా కంపెనీని మోసంచేశారని నెదర్లాండ్స్ కంపెనీ సమాధానం చెప్పటంతో మేఘాకు ఒక్కసారిగా షాక్ తగిలింది.
వెంటనే తేరుకుని తమకు వచ్చిన మెయిల్ అడ్రస్ ను ట్రేస్ చేద్దామని ప్రయత్నిస్తే అసలా మెయిలే పనిచేయటం లేదని (ఎర్రర్)కనబడింది. దాంతో తాము మోసపోయామని గ్రహించిన మేఘా కంపెనీ యాజమాన్యం వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదుచేసింది. సైబర్ బ్యూరో కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.