మొంథా తుపాన్ : తెలంగాణలో నేడు భారీ వర్షాలు
x
ఐఎండీ విడుదల చేసిన తెలంగాణ వర్షాల చిత్రపటం...

మొంథా తుపాన్ : తెలంగాణలో నేడు భారీ వర్షాలు

మొంథా తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణలో ఉందని, పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


మొంథా తుపాన్ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. తుపాన్ ప్రభావం వల్ల గంటకు 41 నుంచాి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఆయన తెలిపారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు.




ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారులు చెప్పారు. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు వివరించారు.

అప్రమత్తంగా ఉండండి : తెలంగాణ వెదర్ మ్యాన్

దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కొన్ని చోట్ల 90 నుంచి 150 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. అక్టోబర్ 29 వతేదీన కూడా తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వివరించారు.

Read More
Next Story