తెలంగాణలో రోజుకో రకం సైబర్ మోసం,సైబర్ కేసుల్లో అగ్రస్థానం
x

తెలంగాణలో రోజుకో రకం సైబర్ మోసం,సైబర్ కేసుల్లో అగ్రస్థానం

తెలంగాణలో రోజుకో రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తోంది.సైబర్ నేరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శికే సైబర్ నేరగాళ్లు వల విసిరారు.


నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2022 వార్షిక నివేదిక ప్రకారం సైబర్ నేరాల నమోదులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2021వ సంవత్సరంలో తెలంగాణలో 10,303 సైబర్ నేరాలు జరగ్గా, 2022వ సంవత్సరంలో వీటి సంఖ్య 15,272కు పెరిగాయి

కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల

సైబర్ క్రిమినల్స్ సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ్యనే లక్ష్యంగా చేసుకొని కొరియర్ స్కాంకు తెరలేపిన ఘటన తాజాగా వెలుగుచూసింది.రిటైర్డు ఐఎఎస్ అధికారి అయిన పద్మనాభయ్య హైదరాబాద్ నగరంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఛైర్మన్ గా ఉన్నారు. పద్మనాభయ్య ఫెడ్ ఎక్స్ కొరియర్ పార్శిల్ ద్వారా డ్రగ్స్, క్రెడిట్ కార్డ్స్, పాస్ పోర్ట్స్ ను ముంబయి నుంచి ఇరాన్ దేశానికి పంపిస్తుండగా తాము పట్టుకున్నట్లు సైబర్ నేరగాళ్లు ఫోన్ లో చెప్పారు.ఆగస్టు 23వతేదీన ఈ పార్శిల్ ను పంపించారని, దీన్ని తాము పట్టుకున్నామని ఫెడ్ ఎక్స్ ఉద్యోగినని ముందు ఓ మహిళ మాట్లాడింది.

షిప్పింగ్ పేమెంట్ చెల్లించాలని...
తాను ఎలాంటి కొరియర్ పార్శిల్ పంపించలేదని పద్మనాభయ్య సమాధానం ఇచ్చినా వినకుండా అనుమానాస్పద, నిషేధిత వస్తువుల ప్యాకేజీని కొరియర్ చేసినందుకు ముంబయి కస్టమ్స్ అధికారులకు వీటిని పంపిస్తున్నామని మరో వ్యక్తి తాను ఫెడ్ ఎక్స్ ఉద్యోగినని చెప్పి మాట్లాడాడు. ఈ కొరియర్ కు షిప్పింగ్ పేమెంట్ కింద రూ.93,410 లను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలని ముకేష్ అనే వ్యక్తి కోరాడు.తనకు పార్శిల్ కొరియర్ తో ఎలాంటి సంబంధం లేదని, తాను పంపించలేదని చెప్పినా, వినకుండా తాము దీనిపై ఆన్ లైన్ లో ముంబయి సైబర్ క్రైం సెల్ కు ఫిర్యాదు చేస్తున్నామని మరో వ్యక్తి చెప్పారు.

స్కైప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని...
స్కైప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని లేదంటే జైలుకు పంపిస్తామని ఆయన పద్మనాభయ్యను హెచ్చరించాడు. ఈ కొరియర్ పార్శిల్ పేరిట సైబర్ నేరగాళ్లు వేసిన సైబర్ వల గురించి మాజీ ఐఎఎస్ అధికారి పద్మనాభయ్య హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఒక్క క్లిక్ తో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము లూటీ
సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాల ద్వారా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దోచుకుంటున్నారు.కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం, అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు ఒక్క క్లిక్ తో లూటీ చేస్తున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల్లోని డబ్బలు మోసగాళ్లు వారి ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. తెలంగాణలో రోజుకో రకం మోసం వెలుగుచూస్తోంది.కొరియర్ పార్శిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

ఎన్నెన్నో రకాల సైబర్ మోసాలు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సైబర్ మోసాల్లో పలు రకాలున్నాయి.కొరియర్ పార్శిళ్లలో డ్రగ్స్, యూపీఐ, క్రెడిట్ కార్డు, పార్ట్ టైమ్ జాబ్ ల పేరిట మోసాలు సాగుతున్నాయి. 43శాతం మంది క్రెడిట్ కార్డు లావాదేవీల్లో, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల్లో మోసపోతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ల పేరిట సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లు, క్యూఆర్ కోడ్ లకు డబ్బులు చెల్లించి ఎక్కువ మంది మోసపోయారని హైదరాబాద్ సైబర్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్, ఈజీ మనీ పేరిట మోసాలు సాగుతున్నాయి.

మోసాలకు కొత్త పద్ధతులు
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్, ఛీటింగ్,ఓటీపీ, ఏటీఎం,క్రెడిట్, డెబిట్ కార్డుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ పోలీసుల పరిశీలనలో తేలింది.ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్, సెక్స్ టార్షన్, ఓటీపీ ఫ్రాడ్స్, ఓఎల్ఎక్స్, గిఫ్టులు, కూపన్లు, పార్శిల్స్ వచ్చాయని చెబుతూ కేవైసీ పేరుతో ఓటీపీ తెలుసుకొని క్షణాల్లో ఖాతాల్లో ఉన్న డబ్బు దోచేస్తున్నారు.సైబర్ నేరగాళ్ళు తెలంగాణ డీజీపీ వాట్సాఫ్ ఫోటోతో ఫేక్ వాట్సాప్ డీపీని క్రియేట్ చేసి మోసాని పాల్పడిన ఘటన జరిగింది.

పౌరుల డాటా బహిర్గతం
పౌరులకు చెందిన ఆధార్,పాన్ కార్డు, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఈమెయిల్, చిరునామాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. పౌరుల డాటా బహిర్గతం అవుతుండటంతో సైబర్ నేరాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.తెలంగాణ సైబర్‌ క్రైం అనాలసిస్‌ అడ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం(సైకాప్స్‌) అనే టూల్‌ను రూపొందించారు. సైబర్‌ నేరగాళ్లు వాడిన సిమ్‌ నంబరు, ఐఎంఈఐ నంబర్‌ను ఇందులో ఎంటర్‌ చేస్తే..వారు ఎక్కడున్నారో గుర్తించి వారిని పట్టుకోవచ్చని పోలీసులు చెప్పారు.

సైబర్ నేరాల్లో తెలంగాణ ఫస్ట్
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో కేసులు నమోదు కావడం లేదు. సైబర్ నేరాల బారిన ఎక్కువ మంది వృద్ధులు పడి మోసపోతున్నారని తేలింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2022 వార్షిక నివేదిక ప్రకారం సైబర్ నేరాల నమోదులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2021వ సంవత్సరంలో తెలంగాణలో 10,303 సైబర్ నేరాలు జరగ్గా, 2022వ సంవత్సరంలో వీటి సంఖ్య 15,272కు పెరిగాయి. 2021 వ సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 40శాతం మేర సైబర్ నేరాలు పెరిగాయి.2019వ సంవత్సరంలో తెలంగాణలో 2,691 సైబర్ నేరాలు జరిగాయి. 2020లో వీటి సంఖ్య 5,024కు పెరిగాయి. 2021లో 10,303 కేసులు నమోదయ్యాయి. దేశంలో 20 శాతం సైబర్ నేరాలు తెలంగాణ రాస్ట్రంలోనే జరిగాయని ఎన్ సీఆర్ బీ నివేదికలు వెల్లడించాయి.

తెలంగాణలో రోజుకు రూ.4కోట్లు స్వాహా
తెలంగాణ రాష్ట్రంలో అమాయక ప్రజల నుంచి రోజుకు రూ.4కోట్ల మేర సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారు. ఏడాదికి ఒక్క తెలంగాణలోనే రూ.1450 కోట్ల డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ లెక్కలే చెబుతున్నాయి.సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యావంతులే ఉన్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడంతోనే వీటిని నివారించవచ్చని డీజీపీ పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ మోసాలు
ఈ సైబర్ మోసాలు నగరాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండతోపాటు కామారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సైబర్ మోసాలు సాగుతున్నాయి.వరంగల్ పోలీసు కమిషనరేట్ లో 631, కామారెడ్డిలో 295, సంగారెడ్డిలో 286, సిద్ధిపేటలో 246, ఖమ్మంలో 237, జగిత్యాలలో 156, నిజామాబాద్ లో 134 సైబర్ నేరాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

1930కి ఫిర్యాదు చేయండి
సైబర్ మోసాల బారిన పడిన బాధితులు నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో 1930కి ఫోన్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కోరారు. ఎవరైనా మోసపోతే వెంటనే పిర్యాదు చేస్తే , ఆ డబ్బును తిరిగి తీసుకురావచ్చని అధికారులు చెప్పారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు రూ.85.05 కోట్ల ను రిఫండ్ చేయడంలో పోలీసులు కీలక పాత్ర వహించారు.

Read More
Next Story